*మతిమరపుకు మందు*
" నాకు బాగా మతిమరపు వస్తోంది సార్ ! ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు " అని వామనరావువారి వద్ద మొరపెట్టుకున్నాడు తిక్కరాజు.
" ఈ సమస్యకి నేను ఒక పరిష్కారం అలోచించాను." అన్నారు వామనరావు గారు
" ఆ పరిష్కారం ఏమిటో చెప్పండి సార్ ! మీకు పుణ్యం ఉంటుంది" అన్నాడు తిక్కరాజు వేడికోలుగా
" ఏం లేదు. ఉదాహరణకి నీ పెన్ను ఎక్కడో పెట్టి మరచిపోతుంటావు కదా ! "
" ఒక పెన్నే కాదు. కళ్ళజోడు, జపమాల, తుండు, రిమోట్ ఇత్యాదులు కూడా "
" అదే చెపుతున్నాను. కళ్ళజోడు బీరువాలో పెడుతున్నావనుకో. దాని గురించి ఒక విపరీతమైన ఊహ మనస్సులో అనుకో. కళ్ళజోడు బీరువాలో డాన్స్ చేస్తోంది అని ఊహించుకో. ఇఖ కళ్ళజోడు గురించి అనుకున్నప్పుడల్లా అది బీరువాలో ఉంది అని జ్ఞాపకం వస్తుంది. ఇఖ మరచిపోవు. అలాగే పెన్ను, రిమోట్ల గురించి" అని వివరించారు.
తిక్కరాజు ఆనందంగా ఇంటికి వచ్చి వామనరావు గారు చెప్పినదంతా వాళ్ళవిడకు చెప్పి, ఆయన చెప్పినట్లు కళ్ళజోడు తీసి బీరువాలో పెట్టి, "కళ్ళజోడు బీరువాలో డాన్స్ చేస్తోంది " అనుకున్నాడు. భోజనం చేసి తాంబూలం సేవించి ఫేస్భుక్ తెరుద్దామనుకుని కళ్ళజోడు కోసం వెతికాడు.
" ఎమోయో నా కళ్ళజోడు ఎక్కడ పెట్టానో చూడూ " అనడిగాడు వాళ్ళావిడని తిక్కరాజు
" మీకు మతి మరపు బాగా వస్తోందండీ ! ఇందాక వామనరావు గారు ఏదో చిట్కా చెప్పారు అన్నారుగా ! అది చెయ్యలేక పోయారు " అన్నది.
" అవునే ! మరచిపోయాను. ఆయనేదో డాన్స్ చెయ్యమని చెప్పారు " అన్నాడు తిక్కరాజు దిగులుగా.