విష్ణుమూర్తికే కాదు, ఈ దేవత వాహనము కూడా గరుడుడే.
.........................................................
రాయలసీమలో సప్తమాతృకలను ఏడుగురు అక్కమ్మ గార్లు అని పిలుస్తారు. ఇక్కడ అక్కమ్మ, అక్కప్ప, అక్కులప్ప అనే పేర్లు కూడా పెట్టుకొంటారు.
గతంలో అక్కన్నమాదన్నల సోదరులలోని అక్కన్న అనే పేరు బహుశా ఏడుగురు అక్కమ్మగార్లలో ఒకరి పేరైవుండవచ్చును. రాయలసీమలో వీరు గ్రామదేవతలు. అంతేకాదు ఏరువాక అంటే ముంగారుకాలములో అరక(మడక ) పట్టడానికి ముందు,మట్టితో అక్కమ్మ బొమ్మలను చేసి ప్రతిష్టించి రైతులు పూజిస్తారు. సప్త అంటే ఏడు, మాతృకలు అంటే అమ్మలు అని కదా, మరెందుకో రాయలసీమలో వీరిని అక్కలతో సమానంగా చూసుకొంటున్నారు.
అక్కమ్మగార్ల అదేనండి సప్తమాతృకల రూపురేఖావిలాసాలు తెలుసుకోవటానికి ముందుగా వారెందుకు జనించారో తెలుసుకోవడం మంచిది కదా !
పూర్వము అంధకాసురుడనే రాక్షసుడు శంకరుని మెప్పించి అనేక వరాలు పొంది బలగర్వితుడై మానవులను దేవతలను హింసింససాగాడు. అహంకారముతో కన్నుమిన్ను కానక ఒకసారి కైలాసము మీదే దండెత్తుతాడు. శివుడికి అంధకాసురునికి భీకరయుద్ధము మొదలైంది. శివుడు ప్రయోగించిన బాణము గుచ్చుకొన్నప్పుడల్లా వాడి శరీరంలోనుండి స్రవించి (కారిన) ప్రతి రక్తపుబొట్టునుండి మరో రాక్షసుడు ఉద్భవించి పరమేశ్వరునితో తలపడేవాడు.
శివుడు అలుపెరుగక బాణప్రయోగం చేస్తూనేవున్నాడు. ఈ సంగ్రామాన్ని తిలకిస్తున్న దేవతలకేమి చేయాలో ఒక తడవ వరకు పాలుపోలేదు. రాక్షసుల శరీరమునుండి చిందిన రుధిరము కింద పడకుండా చేసేటందుకు వారు ఏడుశక్తులను సృష్టించి పంపారు. ఆ ఏడు శక్తులే సప్తమాతృకలు. వారు
(1) బ్రాహ్మణి (2) మహేశ్వరి (3) కౌమారి (4) వైష్ణవి (5) వరహి (6) ఇంద్రాణి (7) చాముండి.
(1) బ్రాహ్మణి - బ్రహ్మచే సృష్టించబడిన ఈ దేవత నాలుగు శిరస్సులు ఆరు చేతులు కలిగి పసుపు వర్ణములో వుంటుంది. ఈ దేవత వాహనము - హంస.
(2) మహేశ్వరి - శివుడి అంశచే జన్మించిన దేవత ఈమె.ఐదు శిరస్సులు, పది చేతులు,మూడు కన్నులు కలిగివుంటుంది. మహేశ్వరి వాహనము - వృషభము (ఎద్దు).
(3) కౌమారి - కుమారస్వామిచే పంపబడిన ఈ దేవతకు ఆరు ముఖాలు పన్నెండు చేతులు వుంటాయి. ఈ దేవత వాహనము - నెమిలి.
(4) వైష్ణవి - నీలివర్ణముతో చతుర్భుజాలతో అలరారే ఈ దేవత వాహనము - గరుడ.
(5) వరహి - వరహస్వామితో పంపబడిన ఈ దేవత నలుపు వర్ణముతో పెద్దబొజ్జతో వుంటుంది. మహిషము వాహనముగా వుంటుందీ దేవత.
(6) ఇంద్రాణి - ఇంద్రునిచే సృష్టించబడిన ఇంద్రాణి బంగారువర్ణము కలిగివుంటుంది. ఇంద్రుడిలాగే సహస్ర నయనాలు ఉంటాయి. ఏనుగు ఈమె వాహనము.
(7) చాముండిదేవి - నలుపు రంగుతోనుంటుంది. ఎర్రని కండ్లు, కపాలమాల, సర్పాభరణాలు కలిగి శవవాహనంగా వున్న చాముండిని యముడు సృష్టించి పంపాడు.
Tags:
తెలుగు