🙏 రాహుకాలం - యమగండం
నేటి పంచాంగాలలో జనాన్ని అనవసరంగా భయపెడుతున్న రెండు మాటలు రాహుకాలం - యమగండం. వీటి అసలు తత్త్వం ఈ పోస్టులో చూద్దాం. కాస్త ధైర్యంగా ఈ పోస్టు చదవండి మరి !
రాహుకాలం
రాహుకాలం అనేదాన్ని పెద్ద బూచిగా నేటి జ్యోతిష్కులు చూపిస్తున్నారు. ఇది నిజం కాదు. రాహుకాలం అందరికీ చెడ్డది కాదు. ఏ జాతకంలో అయితే రాహువు శుభగ్రహమో, ఆ జాతకానికి రాహుకాలం చాలా మంచిది. ఆ సమయంలో వారు చేసే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. ఈ విషయం చెప్పకుండా నేటి కుహనా జ్యోతిష్కులు 'ఆమ్మో ! రాహుకాలం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు బాత్రూం కి కూడా పోకూడదు. బిగబట్టుకో.' అని చెబుతున్నారు. పిచ్చిజనం నమ్ముతున్నారు. మోసపోతున్నారు.
ఒక జాతకంలో రాహువు ఉచ్ఛస్థితిలో ఉంది. శుభగ్రహమై ఉంది. ఆ జాతకునికి రాహుకాలం సమయంలో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ జ్యోతిష్కులు ఎక్కించిన భయాలతో బిగదీసుకు పోయాడు. కానీ నేను చెప్పిన మాటలు నమ్మి నార్మల్ గా ఇంటర్వ్యూ చేశాడు. ఫలితం ఏమిటో తెలుసా? అతనికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 10th రాంక్ వచ్చింది. ఇది జరిగి ఇప్పటికి ముప్పై ఏళ్లయింది. ఇప్పుడతను ఒక స్టేట్లో చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. ఇతను నా మిత్రుడు. రాహుకాలం అతనికి ఏమీ చెడు చేయకపోగా, ఎంతో మంచిని చేసింది.
ఇన్నేళ్ల నా అనుభవం నుంచి, నేను ఇప్పటిదాకా విశ్లేషణ చేసిన 1000+ జాతకాల నుంచి, ఈ విషయంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వగలను.
రాహుకాలం బూచి కాదు. ఇది అందరికీ చెడూ చెయ్యదు. అందరికీ మంచీ చెయ్యదు. కానీ నేటి జ్యోతిష్కులు జనాన్ని 'అమ్మో రాహుకాలం' అంటూ భయపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాహువు ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఫలితాన్నిస్తుంది.
జ్యోతిష్యశాస్త్రంలో యూనివర్సల్ గా మంచి గ్రహాలూ, చెడు గ్రహాలూ లేవన్న విషయం నేటి జ్యోతిష్కులు మరచిపోయారు. అందుకే ఈ పిచ్చి ధోరణులు !
యమగండం
ఇప్పుడు ఇంకో బూచి గురించి చెబుతాను. అదే యమగండం. మీకో విషయం తెలుసా? అసలు యమగండం అనేది జ్యోతిష్య శాస్త్రంలో లేనేలేదు.
వింతగా ఉంది కదూ? అదేమరి నేటి జ్యోతిష్కుల మాయంటే??
ఉపగ్రహాలలో, గురువు యొక్క ఉపగ్రహాన్ని 'యమఘంటక' అంటారు. ఈ ఉపగ్రహం యొక్క కాలవేళ మధ్యభాగంలో ఉదయించే లగ్నసమయాన్ని 'యమఘంటక కాలం' అంటారు. దానిని జ్యోతిష్యశాస్త్రపు ఓనమాలు తెలియని నేటి పంచాగజ్యోతిష్కులు 'యమగండం' గా మార్చిపారేశారు. జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
అసలు 'యమగండం' అనే పదమే శుద్ధబూతు. ఏ ప్రామాణిక జ్యోతిష్య గ్రంధంలోనూ ఈ పదం లేదు. కానీ ఏ పంచాంగం చూసినా ఈ పదం కనిపిస్తుంది. మిమ్మల్ని భయపెడుతుంది. అదేమరి నేటి జ్యోతిష్కుల మాయంటే !
ఇంకో విషయం తెలుసా? ఇదే జ్యోతిష్కులు, గురువును పరిపూర్ణ శుభగ్రహం అంటారు. మరి ఆ గురువు యొక్క ఉపగ్రహమైన 'యమఘంటక' ను మాత్రం చాలా చెడ్డగ్రహం అంటారు. ఇదేంటి? అని అడిగిన వారికి సమాధానం చెప్పలేక పలాయనం చిత్తగిస్తారు. ఒకసారి అడిగి చూడండి !