శ్రాద్ధాభోక్తలు నియమాలు-శ్రీ విష్ణు పురాణము
🌺🌸🌸🌸🌼🌼🌸🌸🌸🌺
Part 31
శ్రాద్ధాభోక్తలుగా పిలువదగని వారు
మిత్రద్రోహి, పుచ్చినగోళ్లున్నవాడు, నపుంసకుడు, గొగ్గిపళ్లవాడు, అబ్రాహ్మణుడు, కన్యలను తిట్టేవాడు, అగ్నిని - వేదాల్ని వదిలినవాడు, సుర/ సోమ విక్రయం చేసేవాడు, హీనకృత్యాలు చేసేవాడు, ఘోరపతకాలు చేసేవాడు, గ్రామం అంతటికి శూద్రాది విచక్షణ పాటించక పౌరహిత్యం , జీవన భృతికోసం వేదం చెప్పేవాడు నియంత్రించదైనవారిగా పరిగణించబడరు.
ఇంకా - రెండోపెళ్లి చేసుకున్న దాని భర్త, తల్లిదండ్రుల పట్ల దయలేనివాడు, శూద్రస్త్రీని ఉంచుకొన్న బ్రాహ్మణుడు, దేవాలయ అర్చకుడు, భరణం ఇచ్చి వేదాధ్యయనం చేసినవాడు భోక్తగా పిలువదగడు.
'శుద్ధశ్రోత్రియుల్ని నియంత్రించడం' అనే విధి మొదట నిర్వర్తించి, వారికీ సంగతి చెప్పాలి. అలా చెప్పడం జరిగాక స్త్రీసంగమం, అహంకారం, క్రోధం విడనాడాలి. భోక్తలుగా వచ్చేవారికీ ఇది వర్తిస్తుంది. కనుకనే శ్రేష్ఠుల్ని ఎన్నుకోవాలి. నియంత్రించకనే ఇంటికి ఆ సమయంలో వచ్చిన అతిథిని పోనీయరాదు. పాద్యాదులు ఇచ్చి గౌరవించి భోజనం చేయించాక పంపించాలి. భోక్తలుగా పిలిచిన వారిని మాత్రం పవిత్రము (దర్భముడి) ధరించి ఆచమించి ఆసనాలపై కూర్చుండజేయాలి.
పితృదేవతలకు బేసిసంఖ్య బ్రాహ్మణులను, విశ్వేదేవతలస్థానంలో సరిసంఖ్య బ్రాహ్మణులను లేదా మొత్తం రెండుస్థానాలకు చెరొకరిని భోక్తలుగా పిలవవచ్చు! విశ్వేదేవతాస్థానంలో ఉన్నవారిని తూర్పు ముఖంగాను - పితృదేవతాస్థానంలో ఉన్నవారిని ఉత్తరముఖంగాను కూర్చోబెట్టి భుజింపజేయదగును.
పితృ - మాతామహవర్గం వారికి వేరేగా శ్రాద్ధం చేయాలని కోందరంటారు. ఇతర మహర్షులు ఒకచోటనే - ఒకేపాకంతో చేయవచ్చునంటారు.
మొదట యువధ్యాన్యజలంతో దేవతలకు అర్ఘ్యమిచ్చి గంధ, పుష్ప, ధూపదీపాలు సమర్పించి, పితృదేవతలకు అపసవ్యంగా ఈ పూజాదికము నెరవేర్చి అనుజ్ఞపొంది పితృదేవతాహ్వానం చేయాలి. తిలోదకాల్తో అపసవ్యంగా సమర్పించాలి. యతులు మొదలగువారు అప్రయత్నంగా శ్రాద్ధకాలమున విచ్చేసినపుడు విజ్ఞుడాతనిని పోనీయక భోజనం చేయించి పంపాలి. శాకములు లవణము లేని అన్నం మూడుసార్లు హోమం చేయాలి. ఇది తప్పనిసరిగా ఆచరించవలసిన విథి -
మొదట 'అగ్నియే కవ్యవాహనాయ స్వధానమః' అనే ఆహుతి, అటుపైన 'సోమాయ పితృమతే స్వాహా' అనే ఆహుతి, ఆ తర్వాత 'వైవస్వతాయ యమాయాంగి రస్వతే' అని అని హోమం చేయగా మిగిలిన అన్నాన్ని, అల్పమాత్రంగా బ్రాహ్మణ విస్తర్లలో ఉంచాలి. ఆ తర్వాత మృష్టాన్నభోజనాన్ని వారి విస్తర్లలో వడ్డించి 'మీ సంతృప్తి మేరకు భుజింతురు గాక' అని సౌమ్యంగా పలికి, వారికి ఆప్యాయంగా వడ్డన జరిగేలా చూడాలి. కోపంగాగాని - త్వరగాగాని వడ్డించరాదు. రక్షోఘ్నమంత్రపటనం జరిగించి, భూమిమీద అస్తరణం కల్పించి, ఆ బ్రాహ్మణుల్ని పితృ దేవతలుగా భావించాలి. 'ఈ శ్రాద్ధవిధి ప్రకారం పితృదేవతలు సంతృప్తి చెందెదరుగాక! భూమియందు నా చేత, పెట్టబడినట్టి పిండముతో పితృపితామహ ప్రపితామహులు తృప్తులగుదురుగాక!
మాతామహులు, విశ్వేదేవతలు మహాసంతుష్టినందెదరుగాక! హవ్యకవ్యములు (దేవతలకు - పితరులకు ఇవ్వబడిన అన్నములు) భుజించేవాడూ యజ్ఞేశ్వరుడూ అవ్యయుడూ అయిన శ్రీహరి ఇక్కడ ఉండడం వల్ల సకల రాక్షసులూ - అసురులూ తొలగిపోదురుగాక' అని నిండుగా - మనఃస్ఫూర్తిగా శ్రాద్ధవిధి నిర్వర్తించి, బ్రాహ్మణులు సంతృప్తులైన పిదప భూతలమందు అన్నము చిమ్మవలో. అంతవరకు అది ఉంచవలె.
బ్రాహ్మణభోజనాలు సంప్రీతికరంగా ముగిసిన పిమ్మట, వారికి ఉత్తరాపోశన మీయవలె.
తృప్తులైన బ్రాహ్మణుల అనుజ్ఞపొంది, సావధాన చిత్తుడై గృహస్థు అన్నంతోను నీటితోను భూతలం (ముందేర్పరచుకున్న ప్రదేశం) పైన పిండప్రదానం చేయాలి. పితృతార్థం (తర్జనిమూలం)తో జలాన్ని పిండాలను, తిలలను, ఇవ్వాలి. మాతామహులకు కూడాఇదే రీతి.
దక్షిణాగ్రదర్భల మీద పుష్పాలతో పూజించిన పిండాల్ని, ఉచ్ఛిష్ట సన్నిధానాన పితృపితామహాదులకు ఇచ్చి, ఆదర్భలమూలమున చతుర్థాది పితరులను లేప ఘర్షణంతో సంతోషింప చేయాలి. (ఇదంతా అపరకర్మలు చేయించే పురోహిత పరిభాష. విస్తరించి రాయదగదు.)
మాతామహాదులను కూడ ఇదేరీతిన పూజించి, బ్రహ్మణులకు యథాశక్తి దక్షిణలివ్వాలి. వారి ఆశీస్సులు అందుకోవాలి.
వారిని పంపివేశాక - మొదట పితృదేవతలను, ఆ తర్వాత విశ్వేదేవతలను విసర్జన చేయాలి. (విశ్వేదేవతంత్ర పక్షం ప్రకారం - విశ్వేదేవతలకు ముందు, పితరులకు తర్వాత విసర్జన చెప్పే పద్ధతి కూడ ఉన్నది). మాతామహాదులకు కూడ ఇదేరీతి విసర్జన. ప్రీతివాక్కుల నడిగి, ద్వారపర్యంతం అనుగమించి మరలాలి. ఆ తర్వాత వైశ్వదేవం - నిత్యకృత్యాది ఆరాధన, ఆపైన శిష్టులతో - ఇష్టులతో కలిసి భోజనం చేయవలె.
పండితుడైనవాడు ఈ రీతిగా పితృ, మాతామహాదిశ్రాద్ధాలు నిర్వర్తించాలి. దీనివల్ల పితృదేవతలకు తృప్తి కలిగి సకలవాంఛలు నెరవేరుస్తారు. మనుమడు 8/15 వంతు దినభాగం, తిలలు (వీరు/ఇవి) శ్రాద్ధంలో పవిత్రమైనవి. వెండి, సోమునికి ప్రీతికరం. పితృదేవతలు సోముని (చంద్రుని)పై ఆధారపడినవారు. అతడు యోగిపై ఆఅధారపడినవాడు. కనుక శ్రాద్ధంలో యోగిని నియంత్రించడం - వెండిదానం ఇవ్వడం పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది.
శ్రాద్ధంలో ఉపయోగించదగినవి :
పితృదేవతలకు తృప్తిని కలిగించేవి శ్రాద్ధంలో ఉపయోగించాలి. మాంసాన్ని సైతం శ్రాద్ధకర్మంలో పెట్టే ఆచారం (ఒకప్పుడు) ఉండేది. కలిలోదీనికి ప్రత్యామ్నాయంగా మినుము ఉపయోగిస్తున్నారు. ఇందువల్ల పితరులకు మాంససంబంధ తృప్తి కలుగుతుంది. దీన్ని పలపైతృకం అంటారు. మినుములతో బాటు మాంస సమానద్రవ్యాలుగా కలియుగంలో దధి, ఘృత, గోక్షీర, పాయసాదులు చెప్పబడ్డాయి. పితృకర్మాచరణానికి గయాక్షేత్రం ప్రసిద్ధి, ఇక్కడ జన్మలో ఒక్కసారైనా పిండప్రదానం చేసినవారి పితరులు తరిస్తారు.
శ్రాద్ధయోగ్యవస్తువులలో అనుములు, గోధుములు, నల్లావాలు, నీవారధానాలు, పెసలు, నువ్వులు, వడ్లు, యువధాన్యాలు, వనౌషదులు చేరతాయి.
కందులు, నీరుల్లి, గోంగూర, పుల్లబచ్చలి, మునగ, ముల్లంగి, వెల్లుల్లి, సొరకాయ తగవు.
రోగి, నగ్నుడు, ఛండాలుడు, జూదరి, మద్యపానమత్తుడు, నపుంసకుడు, శవవాహకులు, కోతి, పంది, కోడి....వీరిచే శ్రాద్ధకర్మ చూడబడకూడదు.