సతీసమేతంగా_పాండుసుతులు_అరణ్యములకు_వెళ్ళుట

🙏🌹🙏🌹🙏

*శ్రీ మన్మహాభారతము*
*సభాపర్వం*
ద్వితీయాశ్వాసము
*భాగము-16*

*సతీసమేతంగా_పాండుసుతులు_అరణ్యములకు_వెళ్ళుట*

భీముడు " సతి కారణంగా పాండుసుతులకు రాజ్యం సంప్రాప్తించింది అనిపించుకోవడం కంటే యుద్ధం చేసి పొందడం మేలు కదా " అన్నాడు. ధర్మరాజు భీముని వారించి ఇంద్రప్రస్థానికి తీసుకు వెళ్ళాడు. దుర్యోధనుడు కర్ణుడు, శకునితో ఆలోచించి దృతరాస్ష్ట్రుని వద్దకు వెళ్ళి " తండ్రీ ! శత్రువును చంపడం వివేకమని దేవగురువు బృహస్పతి చెప్పాడు. పాండవులు మనకు శత్రువులు ఎంత చేసినా మనం వారికి మంచి వాళ్ళము కాదు. మనం వాళ్ళను విడిచి పెట్టి తప్పు చేసాం. అర్జునుడు గాండీవం, భీముడు గదాయుధం, ధర్మరాజ, నకుల సహదేవులు వారి వారి ఆయుధాలు పడితే మనం వారిని గెలవడం సాధ్యం కాదు. కనుక పాండవులను తిరిగి జూదానికి పిలిచి జూదం ఆడించి నిర్వాసితులను చెయ్యడం తక్షణ కర్తవ్యం " అన్నాడు. ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. మరల జూదానికి రమ్మని ప్రాతిగామిని పంపింవాడు. తండ్రి మాట మీరరాదని ధర్మరాజు జూదానికి వచ్చాడు. అందరూ కూర్చున్నారు. శకుని " ధర్మరాజా! ధృతరాష్ట్ర మహారాజు మీరు పోగొట్టుకున్న సమస్త సంపదలు రాజ్యాన్ని ఇచ్చాడు. ఇక అవి జూదంలో పెట్టడం తగదు. ఓడిన వారు వల్కలములు ధరించి కందమూలములు తింటూ పన్నెండేళ్ళు వనవాసం ఒక్క సంవత్సరం అజ్ఞాత వాసం చేయాలి ఇదీ పందెం ఇందుకు మీరు అంగీకరిస్తే " అన్నాడు. ధర్మరాజు " సరే " అన్నాడు. జూదం ఆడాడు ఓడి పోయాడు. అరణ్యానికి పోవడానికి సిద్ధం అయ్యారు. పాండవులు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వద్ద శలవు తీసుకున్నారు. కుంతీ దేవి వద్దకు వచ్చారు. ఆమె " పుత్రులారా! ఇలాంటి దుస్థితి వస్తుందని ముందుగా ఊహించి మీ తండ్రి, మాద్రి స్వర్గానికి వెళ్ళారు. నేను దురదృష్టవంతు రాలిని కృష్ణా ! నా కుమారులను కాపాడు " అని ప్రార్థించింది. కొడుకులను కోడలిని దీవించి పంపింది. అందరూ అడవికి పయనమయ్యారు. కోపం నిండిన చూపులకు జనం దహించబడతారని ధర్మరాజు ముఖానికి వస్త్రం అడ్డం పెట్టుకుని వెళ్ళాడు, ఎట్టకేలకు యుద్ధంలో బాహు బలం ప్రదర్శించే అవకాశం వచ్చిందని భీముడు రొమ్ము విరుచుకుంటూ వెళ్ళాడు. ఇంత కంటే ఎక్కువగా అస్త్ర సంధానం చేసి శత్రు సంహారం చేస్తానని అర్జునుడు చేతితో ఇసుక చల్లుకుంటూ వెళ్ళాడు. తమ అందచందాలు చూసి జనులు దు॰ఖిస్తారని నకులసహదేవులు మలిన వస్త్రాలతో వెళ్ళారు. తడిసిన బట్టలతో విడిన కురులతో దుఃఖిస్తూ యుద్ధంలో భర్తలను పోగొట్టుకున్న కౌరవుల భార్యలు ఇలా రాజ్యం వదిలి వెళతారని సూచిస్తూ ద్రౌపది వెళ్ళింది. పాండవులతో ధౌమ్యుడు, వేలాది బ్రాహ్మణులు పాండవులను అనుసరించారు. ఇలా పాండవులు అడవులకు బయలు దేరారు.
సభాపర్వం సమాప్తం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది