🌹🌻🌹వైఖానసాగమోక్తంగా తిరుమలలో శ్రీవారి కైంకర్యాలు🌹🌻🌹
పవిత్రమైన వేదాలతో పాటే ఆగమాలు కూడా ఉద్భవించాయని హిందూ పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆగమాలన్నీ భగవంతునికి సంబంధించిన క్రతువుల్లోని విజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. అయితే వైఖానస ఆగమం ఆలయాలు, ఇళ్లలో నిర్వహించే క్రతువుల వెనక ఉన్న సైన్సును సవివరంగా తెలియజేస్తుంది.
వైఖానస ఆగమంలో రెండు విభాగాలున్నాయి. మొదటి విభాగంలో ఆలయం, అందులోని మూలమూర్తికి చేయాల్సిన కైంకర్యాలున్నాయి. రెండో విభాగంలో ఆలయశుద్ధి కోసం అర్చకులు అనుసరించాల్సిన విధి విధానాలను పొందుపరిచి ఉన్నాయి. విఖనస మహర్షి రచించిన వైఖానస ఆగమం నాలుగు వైష్ణవ ఆగమాల్లో ప్రముఖమైందిగా విరాజిల్లుతోంది. విఖనస మహర్షి భక్తులైన మరీచి, భృగు, కాస్యప, అత్రి మహర్షులు వైఖానస ఆగమం విశిష్టతను ప్రపంచమంతా చాటి చెప్పారు.
వైఖానస ఆగమం ప్రకారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కొన్ని శతాబ్దాలుగా నిత్య, వార, మాస, సంవత్సరాది ఆర్జితసేవలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వైఖానస ఆగమం రోజుకు ఆరుసార్లు చేయాల్సిన పూజా విధానాలను నిర్దేశిస్తుంది.
ప్రత్యుషం : ఆరోగ్యకరమైన జనాభా అభివృద్ధికి దోహదపడుతుంది.
ప్రాతఃకాల : జపాలు, హోమాలకు అనువైనది.
మధ్యాహ్న : సామ్రాజ్యాభివృద్ధికి సహకరిస్తుంది.
అపరాహ్న : దుష్టశిక్షణకు దోహదం చేస్తుంది.
సాయంకాల : వ్యవసాయోత్పత్తిని పెంచుతుంది.
నిశి ఆరాధన : పాడి పశువుల సంతతి పెరుగుదలకు అనువైనది.
”షట్‌కాలం వ త్రికాలం వ ద్వికాలం
ఏకకాలం వ పూజానాం దేవ దేవస్య”
ప్రస్తుతం తిరుమలలో మూడు పూజా విధానాలను ఆచరిస్తున్నారు. ఉదయం తోమాల సేవ భక్తుల సమక్షంలో జరుగుతుంది. మధ్యాహ్నం వేళ మరోపూజ నిర్వహిస్తారు. అర్చకులు, పరిచారకులు, ఆచార్యపురుషుల సమక్షంలో రాత్రి ఏకాంతంగా సేవ చేస్తారు.
శ్రీవారి ఆలయ పాలనను పర్యవేక్షిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానములు మూలమూర్తికి ప్రతిరోజూ ఆర్జిత సేవలు నిర్వహిస్తోంది. కొన్ని సేవలకు గృహస్థ భక్తులను అనుమతించి స్వామివారిని సేవించే మహద్భాగ్యం కల్పిస్తోంది.
ఆర్జిత సేవ :
ఆర్జితం అనగా శ్రీవారి దర్శనం లేదా సేవకు తితిదే యాజమాన్యం రుసుం నిర్ణయించడం. రుసుం చెల్లించి ఏదైనా సేవలో పాల్గొనడాన్ని ఆమంత్రణోత్సవం అంటారు.
నిత్యసేవలు : శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తికి ప్రతిరోజూ సుప్రభాతంతో సేవలు మొదలవుతాయి. ఆ తరువాత తోమాల, అర్చన, చివరగా రాత్రి ఏకాంతసేవ(భక్తులకు అనుమతి లేదు) నిర్వహిస్తారు.
అర్చన తరువాత స్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామివారికి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ జరుగుతాయి.
వారపు సేవలు : వారంలో ప్రతిరోజూ ఒక విశేష ఉత్సవం జరుగుతుంది. వీటినే వారపు సేవలు అంటారు.
విశేషపూజ (సోమవారం)
అష్టదళ పాదపద్మారాధన(మంగళవారం)
సహస్ర కలశాభిషేకం(బుధవారం)
తిరుప్పావడసేవ(గురువారం)
అభిషేకం – వస్త్రాలంకార సేవ – నిజపాద దర్శనం(శుక్రవారం)
సంవత్సరాది సేవలు : శ్రీవారికి విశేషమైన పర్వదినాల్లో సంవత్సరానికి ఒకసారి తిరుమలలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
తెప్పోత్సవం – సంవత్సరానికి ఐదు రోజులు (మార్చి)
వసంతోత్సవం – సంవత్సరానికి మూడు రోజులు (మార్చి లేదా ఏప్రిల్)
పద్మావతి పరిణయం – సంవత్సరానికి మూడు రోజులు (మే)
అభిధ్యేయక అభిషేకం – సంవత్సరానికి మూడు రోజులు (జూన్)
పుష్పపల్లకి (జులై)
పుష్పయాగం (నవంబర్)
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – సంవత్సరానికి నాలుగు సార్లు
పవిత్రోత్సవం – సంవత్సరానికి మూడు రోజులు (ఆగస్టు)
సుప్రభాతం :
తిరుమలలో శ్రీస్వామివారికి జరిగే తొలిసేవ సుప్రభాతం. శయన మండపంలో పట్టుపాన్పుపై శయనించి ఉన్న శ్రీనివాస ప్రభువును మేల్కొల్పడాన్నే సుప్రభాతం అంటారు. ప్రతిరోజూ తెల్లవారుజామున బంగారు వాకిలి ముందు ఆచార్యపురుషులు ”కౌసల్యా సుప్రజారామ…” అంటూ సుప్రభాత శ్లోకాలను పఠిస్తారు. అదే సమయంలో తాళ్లపాక వంశీయులు ఒకరు ”మేలుకో శృంగార రాయ…..” అంటూ మేల్కొల్పులు పాడతారు.
సంస్కృతంలో సుప్రభాతం అంటే శుభోదయం అని అర్థం. ఇందులో సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం అనే విభాగాలుంటాయి.
సుప్రభాతం : యోగనిద్రలో ఉన్న శ్రీవారిని మేల్కొలపడం. ఇందులో 29 శ్లోకాలుంటాయి.
స్తోత్రం : శ్రీవారి గొప్పతనాన్ని వళ్లించడం. ఇందులో 11 శ్లోకాలుంటాయి.
ప్రపత్తి : శ్రీవారిని శరణాగతి కోరడం. ఇందులో 16 శ్లోకాలుంటాయి.
మంగళాశాసనం : శ్రీవారి వైభవాన్ని చాటుతూ ప్రార్థించడం. ఇందులో 14 శ్లోకాలుంటాయి.
ఈ 70 శ్లోకాల సుప్రభాతాన్ని మనవాళ మహాముని శిష్యుడైన శ్రీ ప్రతివాది భయంకర అణ్ణన్ రచించారు. రూ.120(ఒక్కరికి) చెల్లించి ఈ సేవా టికెట్ కొనుగోలు చేసిన భక్తులను తెల్లవారుజామున 2.00 గంటలకు శ్రీవారి ఆలయంలోకి అనుమతిస్తారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ సేవ మొదలవుతుంది. రెండు చిన్న లడ్డూలను బహుమానంగా అందజేస్తారు. పదేళ్ల లోపు పిల్లలను ఈ సేవకు అనుమతించరు.
తోమాలసేవ, కొలువు :
తిరుమల ఆనందనిలయంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టును, ఉత్సవమూర్తులను, ఇంకా ఇతర విగ్రహాలను పుష్పమాలలతో, తులసి మాలలతో అలంకరించే కార్యక్రమాన్నే తోమాలసేవ అంటారు. భుజాల మీది నుంచి వేలాడేట్టుగా అలంకరించే శ్రీవారి పుష్పాలంకరణ విధానాన్ని ”తోళ్‌మాలై” అంటారు. అదే ‘తోమాల’గా మారిందంటారు. తోళ్ అంటే భుజమని అర్థం.
తోమాల సేవ అనంతరం స్నపన మండపంలో బంగారు సింహాసనంపై కొలువు శ్రీనివాసమూర్తికి కొలువు జరుగుతుంది. ఆ సమయంలో ఆనాటి తిథి నక్షత్రాది వివరాలతో పంచాంగ శ్రవణం జరిగిన తరువాత ముందురోజు హుండీ ఆదాయ వ్యయాలు, అన్నదాతల పేర్లు అన్నింటినీ స్వామివారికి నివేదిస్తారు.
రూ.220/-(ఒక్కరికి) చెల్లించి ఈ సేవా టికెట్ కొనుగోలు చేసిన భక్తులను మంగళ, బుధ, గురువారాల్లో తెల్లవారుజామున 3.00 గంటలకు శ్రీవారి ఆలయంలోకి అనుమతిస్తారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ సేవ మొదలవుతుంది. రెండు చిన్న లడ్డూలను బహుమానంగా అందజేస్తారు.
అర్చన :
జియ్యంగారులు అందించిన తులసిని స్వీకరించి అర్చకులు శ్రీవేంకటేశ్వర సహస్రనామావళి(1008)తో శ్రీవారి పాదాలను అర్చన చేస్తారు. ఆ తరువాత శ్రీవారి పాదాల మీది తులసిని స్వీకరించి స్వామివారి వక్షఃస్థలం మీది శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని మహాలక్ష్మీ చతుర్వింశతి(24) నామాలతో అర్చిస్తారు. క్రీ.శ.1518వ సంవత్సరంలో లభించిన శాసనంలో ఈ సేవ వివరాలు లభించాయి.
రూ.220/-(ఒక్కరికి) చెల్లించి ఈ సేవా టికెట్ కొనుగోలు చేసిన భక్తులను మంగళ, బుధ, గురువారాల్లో తెల్లవారుజామున 4.00 గంటలకు శ్రీవారి ఆలయంలోకి అనుమతిస్తారు. తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ సేవ మొదలవుతుంది. రెండు చిన్న లడ్డూలను బహుమానంగా అందజేస్తారు.
కల్యాణోత్సవం :
శ్రీవారి ఆలయం సంపంగి ప్రదక్షిణంలో ఉన్న శ్రీవేంకటరమణస్వామి కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి ప్రతిరోజూ మధ్యాహ్నం 12.00 గంటలకు కల్యాణోత్సవం జరుగుతుంది. 15వ శతాబ్దంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ కల్యాణోత్సవాన్ని ఏర్పాటుచేశారు.
బ్రహ్మోత్సవం, పుష్పయాగం, పవిత్రోత్సవం వంటి విశేష ఉత్సవ సమయాల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో విధిగా శ్రీవారికి నిత్య కల్యాణోత్సవం జరుపబడుతుంది. ఈ సేవలో పాల్గొన్నవారికి స్వామివారి ప్రసాదం, వస్త్రాలు బహుమానంగా అందజేస్తారు. గంటకు పైగా ఈ కల్యాణోత్సవం జరుగుతుంది.
డోలోత్సవం :
ఈ ఉత్సవం అద్దాల మండపంలో జరుగుతుంది. ముందుగా అర్చకస్వాములు ఈ సేవలో పాల్గొన్న భక్తుల చేత సంకల్పం చేయిస్తారు. మంగళవాయిద్యాలు, వేదపారాయణల మధ్య దేవేరులతో కూడిన స్వామివారు ఊయలలో సొబగుగా ఊగుతారు. కొద్దిసేపు ఊగిన తరువాత స్వామివారికి పంచకజ్జాయం ప్రసాదాన్ని నివేదిస్తారు. ఈ సేవా టికెట్ ధర రూ.200/- ఒక్కరిని అనుమతిస్తారు.
ఆర్జిత బ్రహ్మోత్సవం :
శ్రీవారి ఆలయంలోని రంగనాయకమండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామికి ఆర్జిత బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. ముఖ్యంగా పెద్దశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనసేవలు సంక్షిప్తంగా చేపడతారు. కల్యాణోత్సవం తరువాత ఈ సేవ జరుగుతుంది.
ఆర్జిత వసంతోత్సవం :
రంగనాయకమండపంలో ఈ సేవ నిర్వహిస్తారు. వేదపండితులు పురుష సూక్తం, శ్రీసూక్తం మొదలైన వేదమంత్రాలను శ్రుతి మధురంగా పారాయణం చేస్తుండగా, వెండి శంఖంతో జియ్యంగారు శుద్ధ జలాన్ని అందిస్తుండగా, అర్చకులు శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. ఇలా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.
సహస్రదీపాలంకారసేవ :
ఇది ఒక్కటే ఆలయం వెలుపల జరిగే ఆర్జితసేవ. ప్రతిరోజూ సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి ఆలయం వెలుపల ఆగ్నేయమూలలో ఉన్న కొలువు మండపంలో సహస్ర దీపాలంకార సేవ వైభవంగా జరుగుతుంది. సహస్రదీపాలంకారసేను ఊంజల్ సేవ అని కూడా అంటారు. శ్రీదేవి, భూదేవితో కూడిన మలయప్పస్వామి ఊరేగింపుగా వచ్చి సహస్రదీపాలు వెలిగించిన ఈ మండపంలో ఊంజల సేవలో పాల్గొంటారు.
ఏకాంత సేవ :
ఏకాంతసేవను పాన్పుసేవ, పవళింపుసేవ అని కూడా అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రోజువారీ కార్యక్రమాల్లో ప్రధానమైన చివరిసేవ ఏకాంతసేవ. ఏకాంతసేవకు వేళ కాగానే సర్వదర్శనం నిలిపివేయబడుతుంది. శయన మండపంలో వెండి గొలుసులతో వేలాడదీయబడిన బంగారు పట్టెమంచంపై భోగ శ్రీనివాసమూర్తిని వేంచేపు చేస్తారు.
రాములవారి నడవలో తాళ్లపాక వంశీయులు ఒకరు జోలపాట లేదా లాలిపాట గానం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో తరిగొండవారి తరఫున హారతిపళ్లెం వస్తుంది.
సంవత్సరోత్సవాలు :
వసంతోత్సవాలు
ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమకు ముగిసేట్లుగా మూడు రోజులపాటు తిరుమలలో వసంతోత్సవాలు జరుగుతాయి.
మొదటిదైన చైత్ర శుద్ధ త్రయోదశి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి వేంచేస్తారు. అక్కడ వసంతోత్సవ అభిషేకం, నివేదన, ఆస్థానం నిర్వహిస్తారు.
రెండవ రోజు శ్రీమలయప్పస్వామికి బంగారు రథోత్సవం జరిగిన తర్వాత మళ్లీ ముందు రోజు మాదిరే వసంతమండపంలో వసంతోత్సవం జరుగుతుంది.
మూడవ రోజు శ్రీ మలయప్పస్వామితోపాటు రుక్మిణి శ్రీకృష్ణులు శ్రీ సీతారామలక్ష్మణులు కూడా వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్లి వసంతోత్సవాల్లో పాల్గొని ఆ సాయంత్రం ఆలయానికి చేరుకుంటారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయానికి సంవత్సరంలో నాలుగు మార్లు తిరుమంజనం జరుగుతుంది. ఉగాదికి ముందు, ఆణివార ఆస్థానానికి ముందు, బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారాల్లో శ్రీవారి ఆలయాన్ని శుభ్రంగా కడగడం అనే కోయిల్ ఆళ్వారు తిరుమంజనం జరుగుతుంది. ఇదొక మహాయజ్ఞంగా జరుగుతుంది.
గర్భాలయంలోని అన్ని ఉత్సవ విగ్రహాలు, బంగారు వెండి పాత్రలు బంగారు వాకిలి వరకు తెస్తారు. లోపల గోడలు పైకప్పులు ఇలా అంతటా కడిగి శుభ్రం చేస్తారు. ఇలా చుట్టూ ఉన్న గుళ్లను కూడా శుభ్రం చేస్తారు. ఆ తరువాత పరిమళాన్ని ఆలయంలో గోడలకు పూస్తారు. నామంకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, ఖిచిలి గడ్డ మిశ్రమాన్నే పరిమళం అంటారు. కోయిల్ ఆళ్వారుతిరుమంజనం రోజున సర్కారు కల్యాణోత్సవం మాత్రమే జరుగుతుంది.
పవిత్రోత్సవాలు
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగాని, సిబ్బంది వల్లగాని తెలిసీ, తెలియక ఇలాంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు తెలిసీ, తెలియక జరిగో దోషాల పరిహరణార్థం జరిగే పవిత్ర కార్యక్రమమే ”పవిత్రోత్సవం”.
పుష్పయాగం
ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల అనంతరం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున శ్రీమలయప్పకు పుష్పయాగం జరుగుతుంది. క్రీ.శ.15వ శతాబ్దం నాటికే తిరుమలలో జరుగుతూ, అర్ధాంతరంగా నిలిచిపోయిన ఈ ఉత్సవాన్ని ఆనాటి ఆస్థానవిద్వాంసులు శ్రీ వేదాంతం జగన్నాథాచార్యులవారి పర్యవేక్షణలో క్రీ.శ.1980, నవంబరు 14 నుంచి తితిదే పునరుద్ధరించి నిర్వహిస్తోంది. కల్యాణమండపంలో శ్రీస్వామివారికి వివిధ రకాలయిన పుష్పాలతో పుష్పార్చన జరుగుతుంది. ఈ పుష్పాలు శ్రీవారి హృదయం వరకు రాగానే వీటిని తొలగిస్తారు. మళ్లీ పుష్పార్చన జరుగుతుంది. ఇలా 20 సార్లు జరుగుతుంది.
తెప్పోత్సవాలు
ప్రతి ఏటా శ్రీస్వామి పుష్కరిణిలో ఫాల్గుణ పూర్ణిమకు పూర్తి అగునట్లుగా ఐదు రోజుల పాటు తెప్సోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో మొదటి రోజు ఫాల్గుణ శుద్ధ ఏకాదశిన శ్రీ సీతారామ లక్ష్మణులు, రెండవ రోజు ద్వాదశిన రుక్మిణీశ్రీకృష్ణులు పాల్గొంటారు. ఇక మూడవ రోజు త్రయోదశి నుండి పున్నమి వరకు మూడు రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి తెప్పోత్సవంలో పాల్గొంటాడు.
క్రీ.శ 1468 నాటికే తెప్పోత్సవాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాళ్లపాక అన్నమయ్య కూడా తెప్పోత్సవాలను ఘనంగా వర్ణించారు. కాలాంతరంలో నిలిచిపోయిన ఈ తెప్పోత్సవాలు 1921లో పునరుద్ధరించారు.
జ్యేష్ఠాభిషేకం – అభిధ్యేక అభిషేకం
ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠానక్షత్రానికి ముగిసేటట్లుగా మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో జరుగుతుంది. దీన్నే ”అభిధ్యేక అభిషేకం” అంటారు.
తరతరాలుగా అభిషేకాదులతో అత్యంత ప్రాచీనములైన శ్రీస్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించే నిమిత్తం ఏర్పాటుచేసిన ఉత్సవమే ఇది. దీన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.
మొదటిరోజు శ్రీమలయప్పకు ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనాదులు జరిగిన తర్వాత శ్రీస్వామివారికి వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు.
యధాక్రమంగా రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడవ రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు చేస్తారు. ఈ బంగారు కవచ సమర్పణ మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు.
పద్మావతి పరిణయోత్సవాలు
వైశాఖ శుద్ధ దశమినాడు పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ దినం. ఆ దినాన్ని పురస్కరించుకుని 1992 నుంచి ఆనాటి వైఖానస ఆగమ ఆస్థానపండితుల సలహా మేరకు మూడు రోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి.
వైఖాఖ శుద్ధ నవమి రోజు సాయంత్రం శ్రీవారు గజవాహనంపై, శ్రీదేవి, భూదేవి పల్లకిపై వేంచేసి, ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకుంటారు. అక్కడ సంగీత కచేరి, ఆస్థానం తరువాత శ్రీస్వామివారు దేవేరులతో కలిసి ఆలయానికి చేరుకుంటారు.
అలాగే రెండో రోజు వైశాఖ శుద్ధ దశమిరోజు అశ్వవాహనంపైన, మూడవ రోజు వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు గరుడ వాహనంపైన వేంచేయగా, దేవేరులు పల్లకీలో వేంచేస్తారు.
పుష్ప పల్లకీ – ఆణివార ఆస్థానం :
ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం, కర్కాటక సంక్రాంతి నాడు తిరుమలలో ”ఆణివార ఆస్థానం” అనే ఉత్సవం జరుగుతుంది. తమిళుల ఆణిమాసం చివరిరోజున జరిగే ఆస్థానం కనుక దీన్ని ”ఆణివార ఆస్థానం” అంటారు.
పూర్వం దేవస్థానం వారి ఆదాయవ్యయాలు, నిలవలు మొదలైన సంవత్సర లెక్కలు ఈ ఆణివార ఆస్థానం రోజున ప్రారంభమయ్యేవి. ప్రస్తుతం వర్తమాన లెక్కల ప్రకారం బడ్జెట్ ఏప్రిల్ మార్చారు. అయినా ఈ ఉత్సవం అలాగే కొనసాగుతోంది.
ఈ సందర్భంగా బంగారు వాకిలి ముందు సర్వభూపాల వాహనంలో శ్రీదేవి, భూదేవులతో శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేస్తారు. మరొక పల్లకిపై విష్వక్సేనులవారిని వేంచేపు చేసిన పిదప ఘనంగా వస్త్రసమర్పణ, నివేదనలు జరుగుతాయి. అక్షతారోహణ తర్వాత కార్యనిర్వహణాధికారికి దేవస్థానం బీగాల గుత్తిని తగిలించి ఆరతి, శఠారులను ఇస్తారు. బంగారు వాకిలి ముందు జరిగే ఆణివార ఆస్థానంలో అర్చకులు, జియ్యంగార్లు అధికారులు, దేవస్థానం ఉద్యోగులు మాత్రమే పాల్గొంటారు.
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About