🕉🍎🕉🍎🕉🍎
*శ్రీ మన్మహాభారతము*
*సభాపర్వం*
ద్వితీయ ఆశ్వాసము
*భాగము-15*
*వికర్ణుడు*
దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడు " ఈ సభలో ఉన్న కురువృద్ధులు , గురువులు, పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు. మిగిలిన వారైనా ధర్మం చెప్పండి. ఆలోచించండి ఇక్కడ జరుగుతున్నది ధర్మమా ? " అన్నాడు. ఎవరూ బదులు చెప్పక పోవడం చూసి వికర్ణుడు " నేను ఇక్కడ ధర్మనిర్ణయం చేస్తాను. జూదం, వేట, మద్యపానం, అతిగా తినడం దుర్వ్యసనాలు. వీటి వలన మానవులు ధర్మం తప్పి ప్రవర్తిస్తారు. అలాంటి వారు చేసే పనులు లెక్కలోకి రావు. ఒక జూదరి చేత పిలువబడిన వ్యసనపరుడైన మరో జూదరి ధర్మరాజు పాండవుల ఉమ్మడి ధనమైన ద్రౌపది ని ఫణంగా పెట్టి ఆడి ఓడడం ధర్మం కాదు. పైగా ఏకవస్త్రను సభకు తీసుకు రావడం అన్యాయం " అన్నాడు. కర్ణుడు వికర్ణుని చూసి " ఎందుకీ అధిక ప్రసంగం ? చిన్నవాడివి ధర్మం గురించి నీకేమి తెలుసు. ఇంత మంది పెద్దలు ఉండగా ధర్మ నిర్ణయం చెయ్యడం నీకు తగదు. ద్రౌపది ధర్మరాజు ధనం. కనుక ధర్మ విజిత. లేకుంటే పాండవులు అంగీకరిస్తారా. పెక్కు మంది భర్తలు కలిగిన ద్రౌపది బంధకి. అలాంటి వారిని ఏకవస్త్రగానే కాదు. విగత వస్త్రగా తెచ్చినా అధర్మం కాదు " అన్నాడు. దుర్యోధనుడు కలుగ జేసుకొని ఇలా అన్నాడు " కర్ణుడు బాగ చెప్పాడు. దుశ్శాశనా ! ద్రౌపది పాండవుల వస్త్రాలు తీసుకో " అన్నాడు. దుశ్శాసనుడు ఇది ధర్మం కాదు అని ఆలోచించక ద్రౌపది కట్టుకున్న చీరను లాగాడు. విచిత్రంగా ద్రౌపది నడుముకు ఉన్న చీర నడుము భాగాన్ని వదలలేదు. లాగుతుంటే అలాంటి వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. విప్పిన చీరలు గుట్టలుగా పడ్డాయి కాని ద్రౌపది నడుముకు చీర అలాగే ఉంది. ఇది చూసి దుశ్శాసనుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇది చూసి భీముడు ఆగ్రహంతో " కురువృద్ధులు, బంధువులు సభాసదులు చూస్తుండగా ద్రౌపది ని ఇలా అవమానించిన దుశ్శాశనుని సుయోధనుడు చూస్తుండగా యుద్ధ భూమిలో ఘోరంగా చంపి అతని రక్తం దోసిలి పట్టి తాగకుంటే నేను నా పితృ పితామహులకు పుట్టలేదు " అని భీముడు భీకర ప్రతిజ్ఞ చేసాడు. సభలోని వారు " కుమారుడి మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు ద్రౌపది అడిగిన దానికి ఉపేక్షించాడు " అని అనుకున్నారు.
*ద్రౌపదికి_వరాలు_రాజ్యాన్ని_తిరిగి_పొందటం*
ప్రహ్లాదుని న్యాయం
విదురుడు లేచి " అందరూ శాంతంగా ఆలోచించండి. వికర్ణుడు చిన్న అయినా బృహస్పతిలా ధర్మం చెప్పాడు. ధర్మం తెలిసి కూడా పక్షపాతంతో కాని ,లోభంతో కాని చెప్పక పోతే అసత్య దోషం అంటుకుంటుంది. పూర్వం ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, సుధన్వుడు అనే బ్రాహ్మణుడు ఒక కన్య కొరకు తగులాడుతూ ప్రహ్లాదుని వద్దకు తీర్పు కోసం వెళ్ళారు. కొడుకు విషయంలో తీర్పు చెప్పటానికి జంకి ప్రహ్లాదుడు కశ్యపుని సలహా అడిగాడు. న్యాయమూర్తి సాక్ష్యాన్ని ధర్మాన్ని అనుసరించి ధర్మ బద్ధమైన తీర్పు చెప్పాలి. అలా చెయ్యకపోతే న్యాయమూర్తికి సభాసదులకు పాపం వస్తుంది. కనుక కామక్రోధాలకు అతీతంగా తీర్పు చెప్పు " అని కశ్యపుడు చెప్పాడు. ప్రహ్లాదుడు సంతోషించి తన కొడుకు అని ఆలోచించక సుధన్వుడికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. కనుక మనం ఈ నాడు ద్రౌపదికి న్యాయం చేయకుంటే అందరికి పాపం వస్తుంది " అన్నాడు. దుర్యోధనునికి భయపడి ఎవరూ బదులు చెప్పలేదు. ద్రౌపది సభాసదులను చూసి " నేను పాండవుల ఇల్లాలిని లోకారాధ్యుడైన శ్రీకృష్ణ సోదరిని. ఇలా అవమానింప బడ్డాను. నేను అడిగిన దానికి ఎందుకు బదులు చెప్పరు.? నేను దాసినా? కాదా? చెప్పండి "అని దుఃఖంతో అడిగింది . భీష్ముడు " అమ్మా! నీ ప్రశ్నకు ధర్మరాజు ఒక్కడే సమాధానం చెప్పగలడు " అని అన్నాడు. కర్ణుడు " తరుణీ ! ఐదుగు భర్తలకన్నా ఒక్క భర్త మేలు కదా ! జూదంలో భార్యను ఓడి పోని వ్యక్తిని భర్తగా ఎంచుకో " అని ఎగతాళి చేసాడు. సుయోధనుడు వచ్చి నా తొడపై కూర్చో. అని సైగ చేసాడు. అది చూసి భీముడు " రాజ్య సంపద వలన కలిగిన మదంతో ద్రౌపదిని తొడ మీద కూర్చోమని సైగ చేసిన ఈ దుర్మార్గుని తొడలు నా గధతో విరుగ కొడతాను " అని ముందుకు ఉరికాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఇది తగిన సమయం కాదిని శాంతింప చేసారు. అప్పటికి చలించిన గాంధారి విదురుని తీసుకుని దృతరాష్ట్రుని వద్దకు వచ్చి ద్రౌపదికి జరిగిన అవమానాన్ని వివరించింది. ధృతరాష్ట్రుడు " సుయోధనా ! పాండవ పట్టమహిషిని ఇలా అవమానించడం తగునా ? నీ కారణంగా పాండవులు దుఃఖితులైయ్యారు " అని ద్రౌపదిని పిలిచి " అమ్మా ! ద్రౌపది నా కోడళ్ళలో నీవు గౌరవించ తగిన దానివి. నీకు ఏమి వరం కావాలో కోరుకో ఇస్తాను " అన్నాడు. ద్రౌపది " ముందు నా భర్తను దాశ్యం నుండి విముక్తుని చేయండి " అని అడిగింది. ఇంకో వరం కోరుకో అన్నాడు. " ధర్మరాజు నలుగురు తమ్ములను దాస్యవిముక్తులను చేసి వారి వారి ఆయుధములను ఇప్పించండి " అన్నది. సరే ఇచ్చాను ఇంకో వరం కోరుకోన్నాడు. " వైశ్య సతికి ఒక వరం, క్షత్రియ సతికి రెండు వరాలు కనుక ఇక వరాలు కోర రాదు " అన్నది. ద్రౌపది ధర్మనిరతికి ధృతరాష్ట్రుడు సంతోషించి పాండవులను పిలిచి జూదంలో పోగొట్టుకున్న రాజ్యాన్ని సమస్త సంపదను తిరిగి ఇచ్చి " నేను బుద్ధి లేక జూదాన్ని ఉపేక్షించాను. వృద్ధుడను, అల్ప బుద్ధిని మీ తల్లి గాంధారి ముఖం చూసి దుర్యోధనాదులు మీ పట్ల చేసిన అపచారం క్షమించండి . మీరు ఇంద్రప్రస్థానికి వెళ్ళి హాయిగా రాజ్యం చేసుకోండి " అని దీవించాడు.
(సశేషం)