మార్చుకుంటేనే మనిషి!

మార్చుకుంటేనే మనిషి!
🌼🌻🌸🌼🌻🌸🌼🌻🌸🌼🌻🌸🌼
పూర్వం ఒక అరణ్యంలో జంతువులకు.. ‘భగవంతుడు సృష్టించిన సకల జీవరాశుల్లో మనిషికి అధిక ప్రాధాన్యం ఎందుకు?’ అన్న సందేహం కలిగింది. దానిని నివృత్తి చేసుకోవాలని మృగాలన్నీ నిశ్చయించుకున్నాయి. అన్ని మృగాలు వాటి వాటి బలాలు చెప్పుకొని మనుషుల కన్నా తామే గొప్పవారమని ఏకగ్రీవంగా తీర్మానించాయి. తమ తీర్మానాన్ని సమర్థించవలసిందిగా మృగాలన్నీ కలిసి అదే అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఓ మహర్షి దగ్గరకు వెళ్లాయి.

‘మహర్షీ! దేవుడు అన్ని ప్రాణులను సమంగా సృష్టించాడు కదా. మరి మనిషికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చాడు. మేమేం నేరం చేశామని మమ్మల్ని ఇలా తక్కువ చేసి చూపాడు’ అని ప్రశ్నించాయి మృగాలు. ఏనుగు లేచి.. ‘అయ్యా! నాకు మనిషి కన్నా.. వెయ్యింతల బలం ఎక్కువ. ఆకారంలోనూ మనిషి నా మోకాలికి సరిపోడు. నేనే ఎక్కువ కదా!’ అంది. సింహం లేచి.. ‘నా అరుపు విని మూర్చపోయే మనిషి నాకన్నా గొప్పవాడు ఎలా అవుతాడు?’ అని ప్రశ్నించింది. అన్ని మృగాలు ఒక్కో కారణం చెప్పి.. సమాధానం చెప్పాల్సిందిగా మహర్షిని కోరాయి. మృగాల ఆవేదనను అర్థం చేసుకున్న మహర్షి.. ‘మీ అనుమానం సహేతుకమైనది. అయితే ఒక విషయంలో మాత్రం మనిషి మీ కన్నా చాలా గొప్పవాడు. పుట్టుకతో వచ్చిన దుష్ట సంస్కారాలను మీరు మార్చుకోలేరు. మనిషి మార్చుకోగలడు. ఆ గుణమే మనిషిని సర్వ ప్రాణులలో శ్రేష్ఠుడిగా నిలిపాయి’ అని తెలిపాడు. ‘మీరు చెప్పినది నిజమే మహానుభావా! అయితే దుష్ట సంస్కారాలు మార్చుకోలేని మానవులు ఉంటారు కదా! వారి సంగతి ఏమిటి?’ అని ప్రశ్నించాయి. మహర్షి నవ్వుతూ... ‘అలా మార్చుకోలేని వాడు మానవాధముడు. పశువుల కంటే హీనంగా మిగిలిపోతాడు’ అని సెలవిచ్చాడు. పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరు. ఈ జీవన ప్రయాణంలో ఎన్నో దుష్ట సంస్కారాలు మనిషిని వెంటాడుతాయి. వాటిని పరిహరించుకుని తానను తాను మార్చుకుని ఉన్నత సంస్కారాలు అలవర్చుకున్నవాడే నిజమైన మనిషి అవుతాడు.
🍀🌾🌿🍀🌾🌿🍀🌾🌿🍀🌾🌿🍀

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది