ఎందుకు ఆయనకు వేంకటేశుడు అని పేరు ?

* ఎందుకు ఆయనకు వేంకటేశుడు అని పేరు ?

వేంకటమన్నది పర్వతం పేరు. ఆపర్వతంపై ఎవరు ఉంటారో ఆయనకి పేరు వేంకటాచలపతి అని. అట్లా ఆ పర్వతం సంబంధం వల్లే ఆయనకి వేంకటేశుడు అని పేరు. ఈశ్వరుడు అంటే నియమించు వాడు అని అర్థం. దేనిని నియమించు వాడు? అంటే వేంకటమును నియమించువాడు అని అర్థం. వేంకటము అంటే ఏమి ?  ఈ వెంకటేశ్వర అనే పదం ద్రవిడం మరియూ సంస్కృతం రెంటిలోంచి ఏర్పడింది. దీని అర్థం మనకు నమ్మాళ్వారు వివరించారు. 'వేంకడంగల్ మేయ్ మేల్ వినై ఉత్తమన్ తాంగల్ తంగర్కు నల్లనవే శేవాయ్ వేంగడ తురై వార్కు నమో వెన్నలాంకడమై అదిసుమందా అరర్కే' అని అంటారు. 'కటంగల్' అంటే ఋణములవలే మనం అనుభవిస్తే తప్ప తొలగని పాపములకి పేరు.

ఋణం అంటే ఏమి? మనం పుట్టగానే కొన్ని ఋణములతో పుట్టాం. మనం పుట్టుకతో స్వతంత్రులం కాదు. మనం కొన్ని బంధాలతో పుడుతున్నాం. ఎందరితోనో బంధులుగా కల్గి ఉన్నాం. ఈ బంధాలన్నీ మనం తెచ్చుకుంటే రాలేదు, వాటంతట అవి ఏర్పడ్డాయి. చివరికి భార్యా భర్తల బంధం కూడా భగవంతుడు ఏర్పరిచిందే అని అంటుంటారు. అందుకే పుట్టుకతో వచ్చిన ఈ బంధాలని తెలుసుకొని జాగ్రత్తగా ప్రవర్తించమని చెప్పారు మన పెద్దలు. మన భాద్యత ఏమిటో తెలుసుకొని ప్రవర్తించాలి. వీటిని ముఖ్యంగా మూడు భాగాలు చేసారు. ఆ మూడు రకాల ఋణాలని మనం  క్రమ క్రమంగా తీర్చివేవాలి అని చెబుతారు. మన స్మృతులలో మను అనే మహర్షి చెబుతాడు 'ఋణాని త్రీని అపా కృత్య మనో బ్రహ్మని నివేస్యచ' మూడు ఋణాలు తీసివేసుకొని, మనస్సును భగవంతుడిపై పెట్టాలి అప్పుడు మానవుడిగా తరించవచ్చు అని దీని అర్థం. మరి ఏమిటా ఋణాలు.

ఒకటి పిత్రు ఋణం. మనల్ని కన్న తల్లి తండ్రుల కోసం చెయ్యాల్సింది. రెండవది దేవ ఋణం. మనం బ్రతక గల్గుతున్నాం అంటే మనకు గాలి, నీరు , నేల ఇలా ఎన్నో దేవతలు సహాయం చేస్తే తప్ప సాధ్యం కాదు. ఇలా అన్నో కోట్ల దేవతలు ఉన్నారు అంటారు, అందుకే అన్నింటి మూలమైన శ్రీకృష్ణా పరమాత్మని ఆరాధన చేస్తే అందరికీ చేసినట్లే, అలా దేవ ఋణం తీరుతుంది. మూడవది ఋషీ ఋణం. పశువుల వలె కాకుండా మనకు ఒక క్రమశిక్షణాయుత సమాజాన్ని మన చుట్టూ ఏర్పరిచినది ఋషులు. వారికి కొంత చేయ్యడం ఋషీ ఋణం తీర్చు కోవడం వంటిది. ఈ మూడింటిని మనం తీర్చుకోకుంటే అవి మనల్ని దిగజారేట్లు చేస్తాయి అని మన ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ ఋణాలు అట్లా అయితే తీర్చుకుంటే కానీ తీరవో మనపై ఉండే పాపాలు అనుభవిస్తే కాని తొలగవు. అన్నీ అనుభవించి తొలగించుకోవాలి అనుకున్నా మనం అంత కాలం బ్రతకలేం. మరి ఈ పాపాలు ఎట్లా తొలగాలి ? ఇవన్నీ తొలగితే మనం మంచి స్థితిని పోందవచ్చు. మరి ఇప్పుడే తొలగించుకోవాలి అంటే ఎట్లా? దానికి సాధనం ఒకటి కావాలి.

మన మనస్సుకు పట్టిన ఈ పాపాలు అనే మళినాలను తొలగించే సాధనం నేను చెబుతాను రండి అని నమ్మాళ్వార్ అన్నారు. అదిగో కొండపై కూర్చున్నాడే ఆయనను 'వేంగడ తురైవార్కు నమః' అంటే వేంకటేశాయనమః అని అనమన్నాడు. ఎందుకాపేరు అంటే, ద్రవిడంలో  'కటంగల్' అంటే ఋణములన్నింటినీ 'వేం' కాల్చివేయును అని అర్థం. అలా మనపై ఉండే పాపాలని కాల్చివేయడాన్ని 'వేంకట' అని అంటారు. మరి కాల్చటం అంటే నిప్పు కూడా కాల్చగలదు కదా! కానీ అది కొంత మేరకే కాల్చగలదు. నిప్పుచే కూడా కాల్చబడని వాటిని కూడా కాల్చేవాడు పరమాత్మ కాబట్టి ఆయన కాల్చువాటి కన్నింటికీ నియంత. నియంత అంటే 'ఈశ్వర' అని అంటారు. అందుకే ఆయన పేరు 'వేంకటేశ్వర'.

అందుకే ఈ ఋణాలను కాల్చడంలో తనని మించినవారు లేరు కాబట్టి ఆయన పేరు వెంకటేశ్వర అయ్యింది. అలా పరమాత్మ వేంకటేశునిగా ఉన్నాడంటే కారణం ఏమి ? ఆనాడు నమ్మాళ్వార్ పాడారు కాబట్టి భగవంతుడు అక్కడ నిలిచాడు. భక్తుల ఆదేశానికి కట్టుబడి పరమాత్మ అక్కడ ఉంటాడు. కేవలం ఇక్కడే కాదు, నైమిశారణ్యంలో, భద్రికాశ్రమం లో 'హే భగవన్! నీవు ఇక్కడ ఇలా ఉండు'అని వేద వ్యాసుడు చెబితే అక్కడ స్వామి నిలిచాడు. కొన్ని దక్షిణ భారత దేశ దేవాలయాల్లో ఋషులు ప్రార్థన చేస్తే ఉన్నాడని, కొన్ని చోట్ల బ్రహ్మ ప్రార్థన చేస్తే ఉన్నాడని చెబుతుంటారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది