ఆదిపర్వము – 10
🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏
వ్యాసుని వృత్తాంతం
జనమేజయుడు అడిగిన తరువాత వైశంపాయనుడు ఇలా వ్యాసుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు.
పూర్వకాలంలో వసువు అనే రాజు చేధి రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. ఒకరోజు అతను వేటకి అడవికి వెళ్లాడు. అక్కడ, తపస్సు చేస్తున్న మునులను చూసి అతను కూడ తపస్సు చేయడం మొదలుపెడతాడు.
ఇంద్రుడు వసు రాజు తపస్సు గురించి తెలుసుకుని, అతని వద్దకు వచ్చి "రాజా! నువ్వు రాజ్యాన్ని పాలించాలి. ఎందుకు ఇలా అడవిలో ఉంటూ తపస్సు చేస్తున్నావు? నేను నీకు దైవత్వాన్ని ప్రసాదిస్తున్నాను, దేవలోకానికి వస్తూ ఉండు" అని చెప్పి, దేవ విమానమును, ఇంద్రమాల(వాడిపోని పూల మాల) అలాగె వేనుయాష్టి (వెదురు కర్ర-తప్పు చేసిన వాళ్ళని దండిస్తుంది) ఇస్తాడు. వసురాజు వాటిని తీసుకుని, దేవలోకనికి వస్తూ, వెళుతూండేవాడు. అందువల్ల అతన్ని ఉపరిచర వసు అని కూడా అంటారు. అతను ప్రతీ సంవత్సరం ఇంద్రుని పండగను జరిపేవాడు.
అతని రాజ్యం పక్కగా సుక్తిమతి అనే నది పారుతూ ఉండేది. ఆ నది పక్కనే కోలహలం అనే పర్వతం ఉండేది. ఆ పర్వతం సుక్తిమతితో ప్రేమలో పడింది. ఒకసారి కోలహల పర్వతం సుక్తిమతి నదికి అడ్డంగా పడింది. అటుపక్కగా వెళుతున్న వసురాజు, ఆ పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తాడు. అప్పుడు సుక్తిమతికి, పర్వతానికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వారు మగ పిల్లవాడు వసు పాదుడు, ఆడపిల్ల గిరిక. సుక్తిమతి వారిని వసురాజుకు ఇస్తుంది. వసురాజు గిరికను పెళ్ళి చేసుకుని, వసు పాదున్ని తన సైన్యాధ్యక్షుడుగా నియమించాడు.
ఒకరోజు, వసురాజు వేటకు వెళ్లాడు. అడవిలో తిరుగుతూ తన భార్య గిరిక గురించి, ఆమె అందం గురించి ఆలోచిస్తూండగా అతనికి వీర్యస్ఖలనం జరిగింది. అతడు ఆ వీర్యాన్ని ఆకు దొప్పలో పట్టి, తన భార్యకి ఇవ్వమని ఒక గ్రద్ద మెడలో కట్టి పంపాడు. ఆ గ్రద్ద అలా వెళుతుండగా, ఇంకొక గ్రద్ద అది చూసి, తినే పదార్థం అనుకుని ఈ గ్రద్దపై దాడిచేస్తుంది. అప్పుడు ఆ వీర్యం కింద యమునా నదిలో,బ్రహ్మ శాపం వల్ల చేప రూపంలో ఉంటున్న ఒక అప్సర నోట్లో ఆ వీర్యం పడుతుంది. ఆమె పేరు ఆద్రిక. అప్పుడు ఆద్రిక గర్భవతి అవుతుంది.
ఒకరోజు ఒక మత్స్యకారుని వలలో ఆద్రిక పడుతుంది. అతడు ఆ చేపను కోసి చూసే సరికి ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల పుడతారు. ఆద్రిక తన పూర్వ రూపంలోకి మారి, దేవలఒకానికి వెళుతుంది. అతడు ఆ ఇద్దరు పిల్లల్ని దాశరాజుకు ఇస్తాడు. మగపిల్లవానికి మత్స్యరాజు అని పేరు పెడతారు. అతడు మత్స్యరాజ్యానికి రాజవుతాడు. ఆడపిల్లకు మత్స్యగంధి అని పేరు పెడతారు. ఆమే దాశరాజు దగ్గర ఉంటూ, యమునా నదిని దాటించడంలో తండ్రికి సహాయం చేస్తుంది.
అలా ఒకరోజు మత్స్యగంధి యమునా నది వద్ద ఉండగా, పరాశరుడు అనే ముని వస్తాడు. అతడు శక్తి ముని కొడుకు, వశిస్టునికి మనుమడు. ఆమెను చూసి మోహించి, తన కోరిక తీర్చమని అడుగుతాడు. దానికి ఆమె " నేను మత్స్యరాజు కుమార్తెను నా ఒళ్ళంతా చేపవాసన ఉంది, నా తండ్రికి ఏమని చెప్పాలి " అని అడుగుతుంది.
అప్పుడు పరాశరుడు ఆమెను యోజనగంధిగా మారుస్తాడు.(10 మైళ్ళవరకు వ్యాపించే వాసన కలిగినది). సత్యవతి అని కూడా అంటారు. ఆమె పరాశరుని కోరిక తీరుస్తుంది. ఫలితంగా ఆమె వ్యాసుడు పుడతాడు. అతను తన తల్లికి నమస్కరించి " నేను తపస్సుకి వెళుతున్నాను, నువ్వు పిలిచినప్పుడు తప్పక వస్తాను" అని చెప్పి వెళ్ళిపోతాడు.
వ్యాసుడు మహభారత రాయదలచి బ్రహ్మను ప్రార్థిస్తాడు, అప్పుడు బ్రహ్మ గణపతిని ప్రార్థించు అని చెప్తాడు. వ్యాసుని తపస్సుకి గణపతి మెచ్చి, నువ్వు ఆగకుండా చెప్తేనే నేను రాస్తాను అని షరతు విధిస్తాడు.అందుకు వ్యాసుడు సరేనని మహాభారతం చెప్పడం మొదలుపెట్టాడు. తనకి ఆలోచించుకోవడానికి సమయం కావాల్సినపుడు, క్లిష్టమైన శ్లోకాలను చెప్తూ ఉంటాడు.