బలరామకృష్ణుల విద్యాభ్యాసం-శ్రీ విష్ణు పురాణము

బలరామకృష్ణుల విద్యాభ్యాసం-శ్రీ విష్ణు పురాణము
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Part 10

సర్వ విజ్ఞానవేత్తలు, సర్వజ్ఞులు అయినప్పటికీ - మానుషదేహధారులై నందువల్ల, ఉచితరీతిన వర్తింప సంకల్పించారు బలరామకృష్ణులు. అందులో భాగంగానే గురుశిష్యభావం ఈ రీతిగా ఉండాలని లోకానికి వెల్లడించ సంకల్పించారు.

కాశీలో జన్మించి అవంతీనగరంలో నివశిస్తున్న 'సాందీపుడు' అనే గురుదేవుని సన్నిధానానికి వెళ్ళారు ఆ ఇద్దరూ. మొదట వేదాద్యయనాన్ని, తర్వాత ధనుర్విద్యను సరహస్యంగా నేర్చుకున్నారు.

కేవలం 64 రోజుల్లో సకల విద్యలను ఏకసంథాగ్రాహులై నేర్చుకున్నారు. సాందిపుడు ఆశ్చర్యపోయాడు. సూర్యచంద్రులే ఈ విధంగా వచ్చి నేర్చుకున్నారా! అనుకున్నాడు ఆ గురువరేణ్యుడు.

గురుదక్షిణగా, అతని పుత్రుడు ప్రభాసక్షేత్రంలో నీటమునిగి మరి కనిపించకుండా పోయిన వాడిని తిరిగి అప్పగించి పురజనులంతా ఎదురుచూస్తుండగా వారికి పరమానందాన్ని కలిగిస్తూ బలరామకృష్ణులు విచ్చేశారు. వారి రాక సందర్భంగా ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ చేసుకున్నారు.

జరాసంథుని ముట్టడి

జరాసంధుని కూతుళ్లయిన అస్తి - ప్రాస్తి కంసుని భార్యలు. తన కుమార్తెల భర్తను కృష్ణుడు చంపాడని పగకొద్దీ, బలరామకృష్ణులను నిర్జించాలని గొప్ప సేనావాహినితో కూడి మధురపైకి దండెత్తాడు జరాసంధుడు.

ఆ కౄర రాక్షసుని సామాన్యమైన ఆయుధాలు ఏమీ చేయజాలవు. అసలు అతని పుట్టుకే ఒక విచిత్రము. అదీగాక అతడు వరగర్వితుడు కూడా. ఆకాశమునుండి విష్ణ్వాయుథాలను రప్పించుకున్న శ్రీకృష్ణుడు, తనకు ప్రీతికరమైన ఆయుధాలు నాగలి - రోకలి చేబూనిన బలరాముడు ఆ మగధాధిపతిని ఎదుర్కొన్నారు.

యుద్ధంలో ఓడిపోయి, జరాసంధుడు పారిపోయాడు. ఇలాగే 18 సార్లు ముట్టడించి అల్పసైన్యం కలిగిన యాదవుల ముందు నిలువలేక, తన పెను సేనలను సహితం రణంలో కోల్పోయి పారిపోయాడు. వెన్ను చూపిన వాడిని విడిచిపుచ్చాలన్న రాజనీతి నెరిగినవాడు కాబట్టి, వెన్నుడు (విష్ణువు) అతడ్ని వదిలేశాడు గాని, లేకుంటే ఆ దుష్టరాక్షసుని నిర్జించడం ఆ లీలామానుషునికి కొక లెక్కా?

సృష్టినీ - జగత్సంహారాగీ చేయగలిగిన ఆ చక్రాయుధునికీ జరాసంధవథ ఏపాటిది? నరుడిగా అవతరించినందున, మానుషధర్మరీత్యా ప్రవర్తించడానికే కట్టుబడినాడు కృష్ణుడు.

ముచుకుందానుగ్రహం

ఒకప్పుడు నిండుసభలో గర్గ్యమహర్షిని అతని బావమరిది నపుంసకుడని హేళన చేయగా, ఆ బ్రాహ్మణుడు దక్షిణాపథానికి వెళ్లిపోయి యాదవులపై గల కక్షచేత, వారికి భయంకరుడైన పుత్రుడు తనకు కలగాలని తీవ్రతపస్సు చేశాడు. శంకరుని కృపచేత ఆ మహర్షి 'కాలయవనుడు' అనే కుమారుని పొందగలిగాడు. అతడు నారదునిచేత ప్రేరేపితుడై కోట్లకొలది మ్లేచ్ఛజాతి వారిని కూడగట్టుకొని యాదవులతో పోరుకు సంసిద్ధుడయ్యాడు. అప్పటికే మాగధుడు అక్కడ కృష్ణునికి ప్రబల శత్రువు. కాలయవనునితో చేతులు కలిపి, పురుషోత్తమునిపైకి దండెత్తివెళ్లాలని అతని ఉపాయం.

శ్రీకృష్ణుడు సముద్రుని ప్రార్థించి, యాదవులకు సురక్షితమైన ఒక దుర్గాన్ని నిర్మించడానిగ్గాను పన్నెండు యోజనాలచోటు ఇమ్మన్నాడు. అక్కడ 'ద్వారకాపురి' నిర్మించాడు. స్త్రూలు కూడా అక్కడ సురక్షితలయి యుద్ధం చేయవచ్చు! ఇక పురుషుల సంగతి చెప్పనేల?

తస్మాద్దుర్గం కరిష్యామి యదూనాం అరి దుర్జయమ్‌ |
స్త్రీయో పి యత్ర యుధ్యేయుః కిం పున ర్వృష్ణి పుంగవాః ||

ఆ దుర్గ నిర్మాణం సకలసౌకర్యాలతో ఇంద్రుని పట్టణమైన అమరావతిని తలదన్నేలా ఉన్నది. మధుర వాసులందరినీ అక్కడకు రప్పించాడు హరి.

కాలయవనుడు బాహుయుద్ధంలో నేర్పరి అని విని, తానుకూడ మల్ల యుద్ధాది విశారదుడే గనుక నిరాయుధునిగా ఒక్కడే అతడ్ని ఎదుర్కొన్నాడు కృష్ణుడు. ఒకానొక దశలో కృష్ణుడు తరుముతూండగా కాలయవనుడు ఒక గుహలో ప్రవేశించి, చీకట్లో కానరాక అందు నిద్రిస్తున్న ముచుకుందుడను వానిని తన్నాడు. అతనికి దేవతలవల్ల వరం ఉంది. అతనిని ఎవరైనా నిద్రలేపితే, వారు వెంటనే మాడి మసైపోతారు అన్నదే ఆ వరం. కాలయవనుని సంహరించడానికి హరి పన్నిన ఉపాయం అది. ముచుకుందుడా శ్రీకృష్ణుని తెలుసుకొని స్తుతించాడు.

"నీవు సాక్షాద్విష్ణువువని తెలిసికొన్నాను. 28వ మహాయుగంలో నీవు అవతరిస్తావని గర్గ్యమహర్షి చెప్పనే చెప్పాడు. మానవులకు మేలు చేయదలచి వచ్చిన నీ మహత్తర తేజ మేమని స్తుతింతును? దేవాసుర యుద్ధంలో దైత్యులకు నా తేజమొక దుర్నిరీక్ష్యమే! కాని నీ తేజము ముందు నేనేపాటి. పురుషోత్తమా! ప్రాణేశ్వరా! నీ నుంచి దేవ, పితృ, యక్ష, గంధర్వాదులు, ఆపీలిక బ్రహ్మ చరాచరము సర్వము జనించినది. స్థూల సూక్ష్మ, మూర్తామూర్త రూపుడివైన నిన్ను మించింది లేదు.

ఈ సంసారచక్రంలో నేను ఎన్నో భ్రమణాలు చేసి తాపత్రయం వల్ల కలత చెంది ఉన్నవాడిని. ఎండమావులను చూసి జలాశయాలనుకొని పరుగెత్తిన చందంగా ఎన్నెన్నో దుఃఖాలనే సుఖాలుగా భావించి పరుగుతీశాను. ఈ బంధాలన్నీ నాకు పరితాపాలనే కలిగించాయి. చివరికి వీటన్నిటినీ త్యజించి దేవలోకానికి వెళ్లగా, అక్కడ దేవతలూ నా సహాయాన్నే అర్థించారు. దైత్య ఆదితేయ సంగ్రామంలో నావంతు కృషి నిర్విరామంగా జరిపి దేవతలచేత వరంపొంది ఇక్కడ పెనునిద్రపోయాను. ఈ రక్కసుడెవ్వడో నా కాలు త్రొక్కి నాకు నిద్రాభంగం కలిగించి, నాకు దేవతలు దయచేసిన వరంవల్ల నిలువునా మండి బూడిద (బుగ్గి) అయిపోయాడు. ఇదంతా నీ లీల అని ఎరుగుదునయ్యా మహానుభావా! జగత్ప్రభూ! శరణుశరణు" అంటూ చేతులు జోడించి పలికాడు ముచుకుందుడు.

"నా అనుగ్రహబలంచేత నీవు ఇహలోక భోగములనుభవింప ఇచ్ఛగల వాడివైతే అది నెరవేరుగాక" అని దీవించాడు కృష్ణుడు. ముచుకుందుడు గుహవెలుపలకు వచ్చి, అంతా దివ్యదృష్టితో పరికించి, రానున్నది అల్పాకారులయిన నరులకు నిలయంకాగల కలియుగమని గుర్తించి, తపస్సు చేసుకోడానికి నరనారాయణ స్థానమైన బదరీక్షేత్రానికి వెళ్లిపోయాడు.

కాలయవనుడికే కాలంతీరిపోయిందని తెలిసి మగథాధిపతి మళ్లీ కృష్ణుని మీదకు దండెత్తే సాహసం చేయలేకపోయాడు. మధురాపురీ వాసులపట్ల మక్కువచేతనే, తిరిగి వ్రజభూమిని దర్శించండని గోపికలు నిష్ఠురాలాడగా, హరి వారి మానసములనెల్ల చదివిన వాడైనందున, బలరామునితో కూడ నందగోకులానికి విచ్చేశాడు. గోపాలురతో పరిహాసాలు - గోపికా జనంతో సరస రాసవిహారాలు యధేచ్ఛగా ఎప్పటిలాగానే కొనసాగించాడు.

ఆ సమయమునందే బలరాముని పట్ల మక్కువ గొన్న యమునతో క్రీడించి, నందవ్రజమున ఉన్న భార్య రేవతితో కూడ ఉల్లాసంగా గడిపి బలభద్రుడు, ఉల్ముక అన్మితులనే పుత్రులను కన్నాడు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది