ధర్మ, అర్థ, కామములు
మిణుగురు పురుగు చీకటిలో ప్రకాశిస్తుంది. సూర్యచంద్రులున్నపుడు ఆ మిణుగురు పురుగుల కాంతి కన్పించదు. వాటిని గుర్తించలేం కూడా. పెద్ద వెలుతురు ముందు కొవ్వొత్తి కాంతి కన్పించదు. సూర్యచంద్రుల కాంతి స్థిరం. ఎవడు సృష్టికర్తయో, ఎవడు లయకర్తయో, ఎవడు రక్షణ కర్తయో వారే ఈ శాస్త్రమునకు ఆధారం. లోకాచార రీతిగా ఎవరు ఏ వస్తువ్ఞను సృష్టిస్తాడో అతనే దానికి అధికారి. ఒక వ్యక్తి కొన్ని పండ్ల మొక్కలనో, పూలమొక్కలనో పెంచాడనుకుందాం.
ఆ మొక్కలను పోషించు అధికారి, రక్షించు అధికారి, కాయలు పండ్లు కోయు అధికారి అతనే. అతనికే సర్వహక్కులు ఉంటాయి. అతడే సర్వాధికారి. అలాగే ఈ బ్రహ్మాండమునే సృష్టించిన పోషకుడు, అతనికే అన్ని సంపూర్ణ అధికారములు ఉంటాయి. ఆయనే శాస్త్ర శాసనకర్త. ఆ శాసనములన్నియు అనుగ్రహమునకేగాని, ఆగ్రహ సంబంధమైనవి కావ్ఞ. ఈ శాసనములకు ఎవరు బద్ధులై ఉంటారో, వారే భగవంతుని ముద్దుబిడ్డలు. తన శాసనవచనములైన శాస్త్రములను ప్రమాణ ముగా తలంచి, ఆచరించేవారే ఆయన ముద్దు బిడ్డలు. అట్టి ముద్దుబిడ్డల నిలయమే మన భారతదేశం. తండ్రి ఆజ్ఞకు లోబడి పిల్లలు ప్రవర్తిం చాలి. తండ్రి జన్మనిచ్చి పోషించువాడు గనుకఆజ్ఞకు లోబడి, ఇంట్లో వారందరూ ప్రవర్తించాల్సి ఉంది.
మన భారతీయులు కొన్ని సిద్ధాంతములను పద్ధతులను పాటిస్తారు. అవియే ధర్మ, అర్థ, కామములు. ధర్మం వలన ఆముష్మికములో శుభస్థితియు, అర్థం వలన ఇహలోకమున సుఖ జీవితమును, ధర్మ ప్రవర్తనమును, కామము వలన ప్రజోత్పత్తియు జరుగుచున్నవి. వీటికోసం జీవ్ఞనకు స్వర్గ, స్థితి,లయములను అవస్థలు ఏర్పడినవి. పుట్టిన తర్వాత జీవించుట స్థితి. సుఖశాంతులు లేనివారి స్థితి దుఃఖమయమగును. ప్రజలు శుభ స్థితిని పొందుటకు ధర్మాది త్రివర్గములే ఆధారము. శాస్త్రము ప్రజల శుభస్థితికి అనుకూలములను తెల్పును. పరమాత్మ బ్రహ్మను పుట్టించి, వేదము లను అనుగ్రహించెను. ఆ వేదముల ఆధారముగా, బ్రహ్మ శుభస్థితికి సాధనమైన ధర్మ అర్థ, కామములను వివరించెను. ధర్మశాస్త్రమును మనువ్ఞ, అర్థశాస్త్రమును బృహస్పతి, కామశాస్త్ర మును నందీశ్వరుడు, నచికేతుడు లోకమునందలి ప్రజలకు తెల్పిరి. అలాగే శ్రుతి, స్మృతి, పురాణ ఇతిహాసములు ఉపనిషత్తులు మొదలైనవి ఆయా కాలములలో రుషులు, వివరముగా వేదముల ద్వారా ప్రవచించిరి.
ఈ విధముగా సృష్టి ఆది నుండియు సంభవించినది. పురుషుడైన పరమాత్మ నుండి వేదములు, వేదముల నుండి కర్మలు, కర్మల ద్వారా యజ్ఞయాగాదులు, వీటి వలన వర్షము, వర్షం ఆధారంగా ఆహారం, ఆహారం ద్వారా శరీరం, ఇలా ప్రాణి, ప్రకృతిని అనుభవిస్తుంది. అనుభవించుటకు శరీరము కారణమైనందున దాని శుభస్థితులకు అనువైన ధర్మ, అర్థ, కామములను ప్రజాపతి వివరించెను. ఈవిధముగా భారతభూమి వేద భూమియై, వేదములందలి ప్రవచనముల ఆధారంగా లోకకళ్యాణం కొరకు సర్వుల సుఖసంతోషముల కొరకు ఆది నుండియు ఆదర్శవంతమైయున్నది.