ధర్మమనగా నేమి?

ధర్మమనగా నేమి?

శ్లో|| ధారణా ద్ధర్మ మిత్యాహు: ధర్మో ధారయతే ప్రజా:  |
యత్స్యాద్ధారణ సం యుక్త: స ధర్మ ఇతి నిశ్చయ: || మ.భారతం.

ధర్మం అంటే ధరించునది. ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంటుంది. ఏది సంఘాన్ని, సమాజాన్ని ఒక చక్కని కట్టుబాటులో నిలప గలుగుతుందో అదే ధర్మమని పెద్దలు నిశ్చయించారు.కనుక ధర్మమే ప్రజలను నిలుపుతుంది. అదే ప్రజలను కాపాడుతుంది  అని మహా భారతం లో చెప్పబడినది.  దీనినే మానవజాతికి తొలిప్రభువైన మనుచక్రవర్తి ఇలాచెప్పాడు:

శ్లో|| ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత: |
తస్మాద్ధర్మో న హంతవ్యో మా నో ధర్మో హతో z వధీత్ ||   మను. 8-15.

ధర్మమును బాధించినట్లయితే అది తిరిగి మనలను బాధిస్తుంది.ధర్మాన్ని రక్షించినట్లయితే అది మనల్ని రక్షిస్తుంది.కాబట్టి ధర్మానికి ఎలాంటి హాని జరుగరాదు. ధర్మం నశించరాదు. మనం నశించాలి అని ఎవరమూ అనుకోము. అందువలన ధర్మమును కాపాడుకోవలసిందే.
ధర్మం నశించినది అంటే ప్రజలు యమయాతనలు అనుభవించెదరు.దేశంలో  కరువుకాటకాలు తాండవిస్తాయి. ధర్మం తప్పిన వారి కారణం గా హత్యలు, గృహదహనాలు , లూటీలు జరుగుతాయి. ఆకలి చావులు, ఆర్తనాదాలు ఎక్కువవుతాయి. రోగబాధలు ఉప్పెనలు భూకంపాలు ఇత్యాది ప్రకృతి వైపరీత్యాలు ముంచుకొస్తాయికనుక మానవుడెప్పుడూ అధర్మపథ గామి కాకూడదు. ధర్మ మార్గాన్నే నిలబడాలి.

శ్లో|| సత్యం దమస్తపశ్శౌచం సంతోషో హ్రీ: క్షమార్జవం |
జ్ఞానం శమో దయా ధ్యానం ఏష ధర్మ స్సనాతన: || మ.భారతం.

సత్యము, ఇంద్రియనిగ్రహము, తపము, శుచి, సంతోషము లజ్జ, ఓర్పు , ఋజుత్వము, జ్ఞానము, మనో నిగ్రహము, దయ, ధ్యానము, వీటిని ప్రతి మానవుడు కలిగి ఉండాలి. ఇది సనాతన ధర్మం.
ముఖ్యం గా గ్రహించ వలసిన అన్ని పురాణాల సారం  ఏమిటంటే పరోపకారం చేస్తే పుణ్యమని, పరపీడన చేస్తే పాపమని. ఎవరు పరులని పీడిస్తారో వారే రాక్షసులని.  దుష్ట సంహారమే అవతార ప్రయోజనమని ధర్మసంరక్షణచేసే వారే అవతార పురుషులని!  శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు కురుక్షేత్ర మహా సంగ్రామ సమయం లో ఇలా ప్రబోధం చేసారు.

శ్లో|| యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం ||
 
ఓ అర్జునా! ఎప్పుడైతే ప్రపంచం లో ధర్మానికి హాని జరుగుతుందో , అధర్మం పెచ్చు పెరుగుతుందో  అప్పుడు నన్ను నేనే సృజించుకుంటాను. ఎందుకనగా !

శ్లో|| పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం |
ధర్మ సంష్థాప నార్ధాయ సంభవామి యుగేయుగే ||

సత్పురుషుల యొక్క పరిరక్షణ కొరకు, దుష్టుల వినాశనం కొరకు మరి ధర్మాన్ని సంస్థాపించడానికి, అంటే సుస్థిరం చేయటానికి ప్రతియుగం లోను నేను అవతరిస్తాను-అని. యుగధర్మాల ననుసరించి ధర్మగ్లాని సంభవించినపుడు ఎటువంటి సమయంలో నైనాసరే అవసరాన్నిబట్టి భగవంతుడు ఎన్నిసార్లైనా అవతరిస్తూనే ఉంటాడు. యుగానికి ఒక్కసారే అవతరించాలనే నియమం లేదు. తనకు అవసరమని తోచినపుడల్లా పరమాత్మ మానవుల మధ్య ఒక ప్రత్యేక ప్రయోజనం సాధించడానికి అవతరిస్తూనే ఉంటాడు. ఈ కలియుగం లో అలా అవతరించిన వారే గౌతమ బుద్ధుడూ, పతంజలి మహర్షి, ఆది శంకరుడూ, శ్రీ రామానుజులు, చెన్నబసవన్న, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి  మొదలైన వారు.

శ్లో|| యద్యదాచరతి శ్రేష్ఠ: తత్ తదేవేతరో జనా: |
స యత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే || గీత.3-21.

శ్రేష్ఠ పురుషుడు ఏమేమి ఆచరిస్తాడో ఇతర జన సముధాయము కూడాదానినే ఆచరిస్తారు. దేనిని శ్రేష్ట పురుషుడు ప్రమాణం గా ప్రపంచం లో ప్రతిష్ఠిస్తాడో దానినే లోకులు కూడా అనుసరిస్తారు, దానిని ఆచరిస్తారు. అట్టి శ్రేష్ఠ పురుషునికి నిజమైన ఆప్త బంధువులెవరనగా ..

శ్లో|| సత్యం మాతా పితాజ్ఞానం ధర్మోభ్రాతా దయాసఖా|
శాంతి: పత్నీ క్షమా పుత్ర: షడైతే మమ బాంధవా: || 

సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి. ధర్మమే సోదరుడు. దయయే సోదరి. శాంతమే భార్య . క్షమయే పుత్రుడు. ఈ ఆరుగురు మనిషికి ఆప్త బంధువులు.

శ్లో|| సత్యం బ్రూయాత్ప్రియంబ్రూయాత్  నబ్రూయాత్సత్యమప్రియం |
ప్రియంచ నా z నృతం బ్రూయాత్ | ఏష ధర్మ స్సనాతన: || మను.4-138.

సత్యమునే పలకండి. సత్యమే అయిననూ ప్రియముగానే పలకండి. ప్రియము కదా అని అసత్యం చెప్పకూడదు. అబద్ధాలు రుచిగానే ఉండవచ్చునేమో కాని వాటిని విసర్జించవలసినదే! ఇది సనాతన ధర్మం. 

శ్లో|| ధర్మం శనై: సంచినుయాత్ వల్మీకమివ పుత్తికా: |
పరలోకే సహాయార్థం  సర్వభూతా న్య పీడయన్ || మను.4-2.

చెదలు పుట్టలను పెట్టినట్లుగా నెమ్మది నెమ్మది గా మానవుడు ధర్మ సముపార్జన చేస్తూ ఉండాలే గాని మానకూడదు. ఏ ప్రాణినీ హింసించక  పరలోకమును పాథేయముగా పెట్టుకుని ధర్మ సంగ్రహమును చేయవలెను. ఆర్ష ఋషులు ఇటువంటి సనాతన ధర్మాచరణకొరకు తమ జీవితాలను అంకితం చేసారు. 

శ్లో|| సత్యం మృదు ప్రియం ధీరో  వాక్యం హితకరం వదేత్ |
ఆత్మోత్కర్షం తథా నిందాం  పరేషాం పరి వర్హయేత్ || -ఆర్యధర్మం.

మృదువుగా, ప్రియంగా, హితకరంగా ఉండేలా చెబితే సత్యం అర్థమవుతుంది.  కొందరు నిజం చెప్పటానికి భయ పడతారు. అలాకాకుండా నిజాన్ని నిర్భయం గా చెప్ప గలగటం , అనగా అబద్ధమాడకుండా ఉండటం , నిజమే చెప్పటం  అదికూడా సమాజానికి హితకరంగా ఉండటం ధర్మానికి లక్షణాలు.ఇందులో గమనించవలసినది  ఆత్మోత్కర్ష - ఎంత సేపటికి తనను గురించే తాను చెప్పుకోవటం పనికి రాదు . అది ధర్మ లక్షణం కాదు. అలాగే ఎల్లపుడూ ఇతరులను నిందించటం - యితరుల తప్పులను మాత్రమే వెతుకుతూ ఉండటం కూడా ధర్మ లక్షణం కాదు. అలాగే " అహింసాయైవ భూతానాం " జీవులను హింసించమని సనాతన ధర్మం బోధించలేదు. అనేక పురాణాలు వ్రాసి వేద ధర్మ ప్రచారం చేసిన వ్యాసమహర్షి చివరకు ఇలా అన్నాడు:

శ్లో|| ఊర్థ్వ బాహుర్వి రౌమ్యేష న చ కశ్చిచ్ఛృణోతి మాం |
ధర్మా దర్థశ్చ కామశ్చ  స ధర్మ: కిం న సేవ్యతే || మ.భా. స్వర్గారోహణ.8-5.
ధర్మము వలన మాత్రమే నిజమైన అర్ధ, కామములు కలుగుతున్నాయి - అట్టి ధర్మమును ఆచరించండయ్యా - అని చేతులెత్తి ఆక్రోశిస్తున్నాను. కాని నా ఆక్రోశాన్ని ఎవరూ వినటం లేదు అని వ్యాసుడంతటివాడు వాపోయాడు.

జై సనాతన ధర్మం!!
హరి ఓం తత్ సత్ !!

🌹🙏🌹

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది