రాసక్రీడా విహారాలు, వృషభాసుర వథ-శ్రీ విష్ణు పురాణము
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Part 13
ఒక గోపిక అతని వేణుగానానికి అనుకూలంగా లయాత్మకంగా పాట పాడింది. మరో సుందరి ఆ పాటకు అనుగుణంగా నృత్యం చేయగా, ఇంకొక ముగ్ధ కృష్ణా అని అతడిని పెనవేసుకుంది. ఒక గోపిక ప్రణయాంతరంగిణి కాగా, మరొక గోపస్త్రీ ప్రేమాంధ అయి అతని సరసన చేరింది. ఒక గోపకన్య అరమోడ్పుకళ్లతో కృష్ణునితో శయ్యాసుఖానుభూతిని పొందగా, ఇంకొక గోపస్త్రీ కృష్ణుని చేరబోయి, వాకిట తమ ఇంటిపెద్దను చూసి తటపటాయిస్తూనే కళ్లు మూసుకుని గోవిందుని ధ్యానించు కుంది. అది వారి పూర్వజన్మపుణ్యఫలం.
గోపికలు చుట్టూ పరివేష్టించి ఉండగా, కృష్ణుడు రాసక్రీడారంభరసోల్లాసి అయి భాసించాడు. బృందావనం నలుదెసలనుండి గోపికలు కృష్ణుని వెతుక్కుంటూ తిరుగసాగారు.
శ్రీకృష్ణుని లీలలను అనుకరిస్తూ ఆ గోపికలు, మురళి పాటను అభినయిస్తూ ఆ వనమంతటా వేణుగానలోలుని గన, సంచరించసాగారు.
ఒక గోపిక భూమినే చూస్తూ పరిశీలించగా "ఇదిగిదిగో! ఇవి కృష్ణుని అడుగులే! ఈ పద్మచిహ్నాలు ఆ నల్లనివాడివే" అని నిర్థారించగా, లీలా విలాసగమనంతో వెళ్ళిన ఆ సుందరి ఎవరో? ఈ చిన్నదాని పాదాలగుర్తులు చూడు అని ఇంకో గోపిక అడుగుజాడలకు అర్థాలు తీయసాగారు.
'ఇక్కడే ఏ చిన్న దానికి పూలుకోసి సిగలో తురిమాడో! సగం పాదం మాత్రమే కనిపిస్తోందిక్కడ! చూడవే సఖీ! ఆ అదృష్టవంతురాలెవతయో' అని ఇంకొక గోపస్త్రీ ఈర్ష్యపడసాగింది. 'లేదులేవే! దాన్నిట దిగవిడిచి నంద నందునుడింకెవ్వతెనో చేపట్టి జారుకొన్నట్టున్నాడు. సరిగ్గా చూడు' అని ఇంకొక చిన్నది ఆమెను ఊరడించసాగంది.
చాల్లే! ఆ మాయా మోహనాంగుని మీద మోజుపడి చేరవచ్చిన ఈ పిల్లని మాయచేసి ఎక్కడో దాగున్నాడు కాబోలు! ఈ అడుగులు వెనుదిరిగిపోతూన్నట్లు లేవూ అని ఇంకొకతె అడుగుజాడలను పరిశీలించి సమన్వయపరచసాగింది.
ఈ విధంగా నిరాశలయి, ఆ యమునాతీరాన సైకతస్థలిపై విరహవేదనతో కృష్ణుని గానక, కృష్ణచరిత్రనే కొందరు గానంచేస్తూ సంతృప్తి చెందసాగారు.
ఇంతలో వాళ్లందరి ముఖాలూ వికసించేలా కృష్ణుడు చక్కని ముఖారవిందంతో కనిపించాడు.
సర్వజీవ సుఖ విలాసుడు, త్తైలోక్యరక్షకుడు శ్రీకృష్ణదర్శనమే ఆ గోపికలకు మహదానందం గూర్చగా, ఆర్తిగా పిలిచి అతనిలో ఓదిగిపోయారు.
ఇలాగే ఒక్కొక్క గోపిక తన శృంగారాభిలాష వ్యక్తం చేయగా, అందరితోనూ - అన్నివిధాలా వారికి అనుకూలమైన కేళిసల్పి వినోదించాడు ఆ లీలామానుషవిగ్రహుడు. ఒకతెను కౌగలించుకుని ముద్దులిచ్చాడు. కిశోరప్రాయ లక్షణాన్ననుసరించి రతిప్రియలు ఆ స్వామితో రాత్రులందు క్రీడించడం సాధారణమైంది. అదో రాసలీలా విభూతి. ఆద్యంతాలులేనిది. (కృష్ణం గోపాంగనా రాత్రౌరమయంతి రతిప్రియాః)
(ఈ రాసక్రీడకు వేదాంతార్థం ఉన్నది. అందరియందు ఆ జగన్నాటక సూత్రధారి ఆత్మస్వరూపుడై క్రీడిస్తున్నాడని అర్థం. బాహ్యార్థం కంటె అంతరార్థాన్నిక్కడ అన్వయించుకోవాలి).
వృషభాసుర వథ:
సంధ్యాకాలం తర్వాత, కృష్ణుడు రాసక్రీడాకుతూహలుడైనపు డొకపరి, అరిష్టుడనే కంసానుచరప్రముఖుడు (వృషభ రూపుడై) పొగరుగా కోష్ఠంలోనికి ప్రవేశించాడు. నల్లని మేనుతో ఎత్తయిన మూపురంతో గోవులను బెదిరించసాగాడు.
ఒక్కొక్కప్పుడు ఈ రాక్షసుడే, వనాల్లో సంచరిస్తూ తాపసులను చంపుతూంటాడు. ఆ ఘోర రాక్షసుని చూసి గోపికలు - గోపాలురు మిక్కిలి భయపడి, కృష్ణా అని ఆక్రందన చేశారు. కృష్ణుడు సింహనాదం చేయగా, ఆ సవ్వడికి వృషభ రూపుడు కృష్ణుని పొట్టకు కొమ్ములను గురుచేసి పైపైకిరాసాగాడు.
తన దగ్గరకు రాగానే, ఒడుపుగా వాడి కొమ్ముల్ని ఒడిసిపట్టుకుని, మోకాళ్లతో వాని కడుపులో పొడిచాడు కృష్ణుడు. ఆ వెంటనే రెండు చేతులతోను వాడి మెడను చిక్కించుకుని తడిబట్ట పిండినట్లుగా పిండి, ఒక కొమ్ము ఊడబెరికి దాంతోనే వాడి కడుపులో పొడిచాడు. అరిష్టుడు నెత్తురు కక్కుకుని మరణించాడు. గోపజనుల హర్షధ్వానాలు మిన్నుముట్టగా శ్రీకృష్ణు డానందించాడు.