ఆదిపర్వము – 12
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
కచ, దేవయానిల వృత్తాంతం
"జనమేజయ మహరాజా, వృషపర్వుడు అనే రాక్షస రాజు ఉన్నాడు. ఆయనకు గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. వృషపర్వుని కుమార్తె శర్మిష్ట.
దేవతలకు గురువైన బృహస్పతి కుమారుడు కచుడు. శుక్రాచార్యునికి మృతసంజీవని విద్య తెలుసు. ఆ విద్యతో, దేవాసుర యుద్దంలో చనిపోయిన రాక్షసులందరిని తిరిగి బతికిస్తున్నాడు శుక్రాచార్యుడు. దానితో రాక్షసుల బలం పెరిగిపోతూ ఉంది.
దేవతలందరూ కచుని వద్దకు వెళ్ళి "ఓ కచుడా, మృతసంజీవని వలన, మనం ఎంత మందిని చంపినా, రాక్షసుల బలం తగ్గకుండా ఉంది. అందువలన నువ్వు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి ఆ మృతసంజీవని విద్యను తెలుసుకొని రావాలి. దానికి ఒకే మార్గం ఉంది. శుక్రాచార్యునికి తన కుమార్తె దేవయాని అంటే ఎంతో ప్రేమ. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. నువ్వు ముందు ఆమె అభిమానాన్ని పొంది, దాని ద్వారా ఆ మృతసంజీవని విద్యను గ్రహించాలి" అని చెప్పారు.
దానికి కచుడు సరే అన్నాడు. దేవతల కోరిక మేరకు శుక్రుని వద్దకు వెళ్ళాడు. శుక్రాచార్యుని చూచి నమస్కరించి "మహాత్మా, నేను దేవగురువు బృహస్పతి పుత్రుడను. నా పేరు కచుడు. నేను తమ వద్ద విద్య అభ్యసింప వచ్చాను" అన్నాడు. దానికి శుక్రుడు సంతోషించి, తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఇది మిగిలిన రాక్షసులకు నచ్చలేదు. వారు ఎలాగైనా కచునికి అపకారం తలపెట్టాలని నిశ్చయించారు. కచుడు మాత్రం గురువుగారు చెప్పిన పనులన్ని చేస్తున్నాడు. ముఖ్యంగా దేవయాని చెప్పిన పనులను శ్రద్ధగాచేస్తూ ఆమె ప్రేమను పొందుతున్నాడు.
ఒక రోజు, కచుడు మిగిలిన రాక్షస శిష్యులు అడవికి వెళ్ళారు. అదే అదనుగా భావించి, ఆ రాక్షసులు కచుడిని చంపి, ఆ శవాన్ని ఒక చెట్టుకు కట్టేసారు. తరువాత ఆశ్రమానికి వెళ్ళారు. ఎంత రాత్రి అయినా కచుడు రాలేదు. దేవయానికి కంగారు ఎక్కువ అయింది.
తండ్రి వద్దకు వెళ్ళి "తండ్రీ, రాత్రి చాలా పొద్దు పోయింది. అందరూ వచ్చారు కాని కచుడు రాలేదు. అతనికి ఏమన్నా ఆపద కలిగిందేమో అని నాకు భయంగా ఉంది" అని చెప్పింది.
శుక్రుడు తన దివ్య దృష్టితో చూచాడు. కచుడు చనిపోయాడని తెలిసింది. వెంటనే శుక్రుడు, దేవయాని కచుడు చచ్చిపడి ఉన్న చోటికి వెళ్ళారు. శుక్రుడు తన మృతసంజీవని విద్యతో కచుడిని బతికించాడు. దేవయాని సంతోషించింది. కచునితో ఆశ్రమానికి వచ్చారు.
కొన్ని రోజుల తరువాత, ఒకరోజు కచుడు, మిగిలిన రాక్షసులు పూలు తెచ్చేందుకు అడవికి వెళ్ళారు. అక్కడ రాక్షసులందరూ కలిసి కచుడిని చంపి, అతని శవాన్ని కాల్చి బూడిద చేసారు. ఆ బూడిదను మద్యంలో కలిపారు. ఆ మద్యాన్ని శుక్రుడికి ఇచ్చారు. ఇది తెలియక శుక్రుడు ఆ మద్యాన్ని సేవించాడు.
రాత్రి పొద్దు పోయింది. కచుడు రాలేదు. మరల రాక్షసులు చంపేసారేమొ అని దేవయానికి అనుమానం కలిగింది. తండ్రి వద్దకు వెళ్ళి ఏడుస్తూ ఉంది. అప్పటికే శుక్రుడు మద్యం మత్తులో ఉన్నాడు.
"పోనిలేమ్మా, బతికి ఉంటే వస్తాడు. చస్తే ఉత్తమ లోకాలకు పోతాడు. ఎందుకు ఏడుతావు" అన్నాడు.
దానికి దేవయాని "తండ్రీ, అంగీరసుని మనుమడు, బృహస్పతి పుత్రుడు అయిన కచుడు రాక్షసుల చేత చస్తే ఏడవకుండా ఎలా ఉండమంటావు. కచుడు ఇంటికి వస్తే గాని నీను ఆహారం, నీళ్ళు ముట్టను" అని ఏడుస్తూ కూర్చుంది.
కూతురి ఏడుపు చూసి శుక్రుడు చలించిపోయాడు. తన దివ్య దృష్టితో చూసాడు. కచుడు ఎక్కడా కనపడలేదు. చూడగా, చూడగా బూడిద రూపంలో. మద్యంతో కలిసి తన కడుపులో ఉన్న కచుడిని చూసాడు.
అప్పుడు తెలిసింది రాక్షసులు కచుడిని చంపి, బూడిద చేసి, మద్యంలో కలిపి తనతో త్రాగించారని. చాలా బాధ పడ్డాడు. "అహా! మద్యం ఎన్ని అనర్థాలు కలిగిస్తుంది. అందువల్ల నేటి నుండి బ్రాహ్మణులు గాని, ఇతరులు గాని మద్యపానం చేస్తె, వారికి పాపం చుట్టుకుంటుంది. నరకానికి పోతారు" అని శాపం పెట్టాడు.
వెంటనే, తన మృతసంజీవని వుద్యతో తన పొట్టలో ఉన్న కచుడిని బతికించాడు. అప్పుడు పొట్టలో నుండి కచుడు "మహాత్మా, మీ దయవలన నేను బతికాను. కాని నేను ఎలా బయటకు రావాలి" అని అడిగాడు.
శుక్రుడు ఆలోచనలో పడ్డాడు.కచుడు తన పొట్ట చీల్చుకుని బయటకు వస్తే తను చచ్చిపోతాడు. మరల తను బతకాలంటే కచునికి మృతసంజీవని విద్య రావాలి. అందుకని తన పొట్టలొ ఉన్న కచునికి మృతసంజీవని విద్య ఉపదేశించాడు. వెంటనే కచుడు శుక్రుని పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు. చనిపోయిన శుక్రుని మృతసంజీవని విద్యతో బతికించాడు. ఆ విధంగా కచుడు శుక్రుని వలన మృతసంజీవని విద్యను సంపాదించాడు.
కొంత కాలం గడిచింది. వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంక తను వెళ్ళిపోతానన్నాడు కచుడు. శుక్రుడు సరే అన్నాడు, కాని దేవయాని మాత్రం ఒప్పుకోలేదు. కచుడు వెళ్ళిపోతాడు అనే మాట విని ఏడ్చింది.
కచుని చూచి "నీకు పెళ్ళి కాలేదు, నాకు పెళ్ళి కాలేదు. నేను నిన్ను ప్రేమించాను. నా తండ్రి వలన నువ్వు మృతసంజీఅవని విద్య స్వీకరిచావు. ఆయన కుమార్తెనైన నన్ను కూడా స్వీకరించు" అని అడిగింది.
దానికి కచుడు " అమ్మా దేవయానీ, నీ తండ్రి నాకు గురువు. అనగా నాకు పితృ సమానుడు. ఆయన పుత్రికవు నువ్వు నాకు సోదరీ సమానురాలవు. ఇది ధర్మం కాదు, అందువల్ల నన్ను పెళ్ళి చేసుకోవడం నీకు తగదు" అని అన్నాడు.
దానికి దేవయాని కోపించి "అట్లైన నా తండ్రి వల నువ్వు పొందిన మృతసంజీవని విద్య నీకు పని చేయదు" అని శాపం ఇచ్చింది.
కచుడు దేనయానిని చూచి "సోదరీ, మృతసంజీవని నాకు పని చెయ్యకపోయినా, నేను మరొకరికి ఉపదేశిస్తే, వాళ్ళకు పని చేస్తుంది కదా. కాని నేనూ నీకు శాపం ఇస్తున్నాను. నువ్వు ధర్మం తప్పి, నన్ను పెళ్ళాడమని కోరావు కాబట్టి నీకు బ్రాహ్మణుడితో వివాహం కాదు" అని ప్రతి శాపం ఇచ్చాడు. తరువాత కచుడు దేవలోకం వెళ్ళిపోయాడు.