మహాస్వామి - ఖురాన్

సుమారు 10 - 12 సంవత్సరాల క్రితం ఒక మహమ్మదీయుడు నా క్లినిక్ కు వచ్చాడు. నా గదిలో ఉన్న పరమాచార్య స్వామివారి చిత్రపటం చూసి, భక్తితో తలవంచి స్వామివారి పటానికి నమస్కరించి, ‘మహాస్వామి వారు చాలా గొప్ప వారు, వారు నడిచే దేవుడు’ అని అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యమేసి “నీకు మహాస్వామి వారి గురించి ఎలా తెలుసు?” అని అడిగాను. ఆ ముస్లిమ్ పెద్దమనిషి మహాస్వామి వారితో తన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు.

“అయ్యా ముప్పై సంవత్సరాల క్రితం నేను విద్యుత్తు శాఖలో లైన్ మేన్ గా పని చేసేవాణ్ణి. ఒకసారి మేము ఒక ఐదు ఆరుగురు బృందం కలిసి కంచి మఠం వెళ్ళాము. ఏదో చిన్న విద్యుత్ లోపం ఉంటే దాన్ని సరిచేయడానికి వెళ్ళాము. అక్కడ కూర్చున్న మహాస్వామి వారు చేతితో సైగచేసి నన్ను దగ్గరకు రమ్మన్నారు. నేను వెళ్ళి వారి ముందు నిలుచున్నాను. రోజూ ఐదు పూట్ల నమాజ్ చేస్తున్నావా? అని అడిగారు.

వారు నా మతము గురించి ఏమి అడగకుండానే నేను మహమ్మదీయుడనని గుర్తుపట్టినందుకు నాకు చాలా ఆశ్చర్యమేసింది. కానీ అది నాకు కలగబోయే ఆశ్చర్య పరంపరకు ఆరంభం మాత్రమే. అప్పుడు మహాస్వామి వారు పవిత్ర ఖురాన్ నుండి కొన్ని వాక్యాలు చెప్పారు. మేము తమిళులం కాబట్టి మేము ఖురాన్ చెదివితే అరబిక్ లో మా తమిళ యాస కొట్టొచ్చినట్టు కనబడుతుంది.

కానీ మహాస్వామి వారు ఒక అరబ్బీ వ్యక్తి ఎలా తమ మాతృభాషను మాట్లాడతాడో, అంత స్వచ్చంగా చదివారు. వారి ఉచ్ఛారణ నిజంగా అద్భుతం. నేను ఇదే గొప్ప అనుకుంటే మళ్ళా నేను ఆశ్చర్యపోయేలా చేసారు.

మహాస్వామి వారు ఒక విషయం చెప్పి, “ఖురాన్ లో ఎన్ని సార్లు నమాజ్ చేయమని చెప్పబడింది?” అని అడిగారు?

అది అందరికి తెలిసిన విషయం కావున “ఐదు సార్లు” అని చెప్పాను. అప్పుడు మహాస్వామి వారు స్థానిక ఖాజి దగ్గరకి వెళ్ళి అడిగి తెలుసుకుని రమ్మన్నారు. నేను కనుక్కుని వచ్చి వారితో అదే చెప్పాను. కానీ స్వామివారు నన్ను మద్రాసులో ఉన్న ప్రధాన ఖాజిని కలిసి, వారిని అడిగి తెలుసుకుని రమ్మన్నారు. ఆయన ఐదు సార్లు అని చెప్పడమే కాకుండా ఇటువంటి పనికిమాలిన ప్రశ్న అడిగినందుకు నాకు చివాట్లు పెట్టి పంపించారు. స్వామివారికి నేను అదే చెప్పాను.

అప్పుడే ఒక అద్భుతం జరిగింది. మహాస్వామివారు ఒక ఖురాన్ తెప్పించి వెంటనే ఒక పుటను తీసి నాకు చూపిస్తూ దాన్ని చదువుతూ ఖురాన్ లో రోజుకు ఆరు సార్లు ప్రార్థన చెయ్యమని ఉంది అని చెప్పారు. కానీ ఆరవ సారి చేసే ప్రార్థన రాత్రి 11:30కు చెయ్యాలి, కాబట్టి దాన్ని చాలామంది వదిలేసారు. అప్పుడు స్వామి వారు నువ్వు ఇకనుండి ఆరు సార్లు చెయ్యి. చేస్తే ఫలితం బాగా ఉంటుంది అని చెప్పారు. సర్ ఇది నిజం, స్వామి వారు చెప్పింది అక్షర సత్యం. నేను విద్యుత్ శాఖ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరుగా రిటైర్ అయ్యాను.

మళ్ళా నేను ఎప్పుడైనా పని మీద కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్తే మహాస్వామి వారు నన్ను గుర్తుపట్టి నేను ఎన్ని సార్లు నమాజ్ చేస్తున్నానో కనుక్కునేవారు!!”

ఏమి మహాస్వామి వారి విజ్ఞానం. వారు నడిచే ఎన్సైక్లోపీడియా.

సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు అయిన ఆ ఈశ్వరుడు మానవ రూపంలో ఈ భువి పై నడయాడారు.

మహాస్వామి వారు కుల మత జాతి వర్గ విచక్షణ లేకుండా ఎందరినో ఉధ్ధరించారు.

జయ జయ శంకర హర హర శంకర

--- డా. వెంకటరాఘవన్, కంటి వైద్యులు

‪KanchiParamacharyaVaibhavam

‪‎కంచిపరమాచార్యవైభవం‬

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది