ఉగాది శుభాకాంక్షలు - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు




ఉగాది శుభాకాంక్షలు

మానవజన్మ అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనది. భగవంతుని పొందడానికి యోగ్యమైన వ్యవస్థ కలిగినటువంటిది. మనుష్యుడు ఉపాసన చేసి భగవంతుని పొందడానికి వీలుగా ఋషులు కాలమును విభాగము చేసారు. అటువంటి కాలములో రోజు, వారము, పక్షము, నెల, ఆయనము సంవత్సరము, పగలు, రాత్రి, గంట, అరగంట, నిమిషము, యామము అని ఎన్నో విభాగములు వచ్చాయి. అన్నిటిలో 365 రోజులతో, 12 మాసములతో కూడిన సంవత్సరము ఒక ప్రధానమైన విభాగము. చాంద్రమానమును అనుసరించి మనకు మొదటి నెల అయిన చైత్రమాసములో శుక్ల పక్షములో, మొట్టమొదటి తిథి అయిన పాడ్యమినాడు కొత్త సం|| ప్రారంభము అవుతుంది. 60 సం || లు అవే మళ్ళీ వృత్తముగా తిరుగుతూ ఉంటాయి. మొట్ట మొదటి నెల అయిన చైత్రమాసములో, మొట్ట మొదటి పక్షమైన శుక్లపక్షములో, మొట్ట మొదటి తిథి అయిన పాడ్యమినాడు కొత్త సంవత్సరము ప్రారంభము అవుతుంది. ఋషులు దానిని అనుష్టించి తత్సంబంధమైన ప్రయోజనములను పొందడానికి కావలసిన రీతిని నిర్ణయము చేసారు. సంవత్సరాదిని ఒక ప్రత్యేకమైన విధానములో జరుపుకోవాలి. 

ఆరోజున విధింపబడిన ప్రధానమైన కర్తవ్యము సూర్యోదయమునకు ముందే నిద్రలేచి ప్రధమయామములో స్నానము పూర్తి చెయ్యాలి. ఒక యామమునకు మూడుగంటలు. 8x3 =24 గంటలు. ఒక రోజులో 8 యామములు ఉంటాయి. ఈ కాలములో ప్రధమయామమును బ్రాహ్మీముహూర్తము అంటారు. ఆ సమయములో అభ్యంగన స్నానము చెయ్యాలి. అభ్యంగన స్నానము అంటే తల మొదలుగా పాదముల వరకు నీరు పోసుకుని స్నానము చెయ్యడము. తలంటి స్నానము అంటారు. స్నానము చేసేముందు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ చేత నువ్వులనూని మాడు మీద పెట్టించుకుని ఆశీర్వచనము చేయించుకుంటారు. ఎందుచేత అనగా తైలాభ్యంగన స్నానము చేసినందువలన అలక్ష్మి పరిహారము అయి, లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది. శ్రీసూక్త పఠనము చేసేటప్పుడు అడుగుతూ ఉంటాము మా ఇంట్లో ఆకలి, దప్పిక, మలినము వంటివి ఉండకూడదు. లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టిన జ్యేష్టాదేవి స్వరూపమైన దారిద్ర్యము తొలగిపోవాలి. నేను పుత్రులతో, మిత్రులతో, సంపత్తితో, వాహనములతో, భోజనము చెయ్యాలని సంకల్పము చేసినప్పుడు కావలసిన పదార్థములతో, దానిని జీర్ణము చేసుకోగలిగిన ఆరోగ్యవ్యవస్థతో నేను సంతోషముగా ఉండాలి అలా ఉండేట్లుగా నన్ను అనుగ్రహించు అని మనము తెల్లవారి లేస్తే శ్రీసూక్త మంత్రములతో పరదేవతను అడుగుతూ ఉంటాము. అలా అడగడానికి పర్యవసానముగా సంవత్సరాదినాడు బ్రాహ్మీముహూర్తములో తలంటుస్నానము ఆచరిస్తారు.

స్నానము తరవాత నూతన వస్త్రాలు ధరించాలి. ధరించేటప్పుడు ఒక ప్రత్యేకమైన విషయము ఉన్నది అంచుకలిగిన బట్ట కట్టుకోవాలి. అంచుకలిగి, ఖండము కాని బట్ట ఏది ఉంటుందో అటువంటి బట్టయందు సమస్త దేవతలు ఆవహించి ఉంటారని వేదవాక్కు అదే మనకు ప్రమాణమైనది. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే శాస్త్రమును ప్రమాణము చేసుకుని చెయ్యాలి శాస్త్రమే వేదము. అంచుకలిగిన బట్టకట్టుకున్నందు వలన దేవతల అనుగ్రహము కలిగి ఆ కారణము చేత దీర్ఘాయువును పొందుతాడు.

నూతన వస్త్రములు ధరించి ఇంట్లో ఉన్న కులదైవానికి నమస్కారము చేస్తారు. ఆ రోజున ప్రత్యేకించి చేసిన ప్రసాదమును భగవంతుడికి నివేదన చేసి దానిని పుచ్చుకుంటారు. ఆరోజు భగవంతుడికి నివేదన చేసే ప్రసాదము ఒక విశేషముతో కూడుకున్నదై ఉంటుంది. అది ఎలా తయారు చెయ్యాలి అన్నదానిని కూడా శాస్త్రమే మనకు చెప్పింది. ‘నింబ సుమం’ వేపచెట్టుకి పూసిన పువ్వులు ప్రధానముగా ఆ పదార్ధములో ఉండాలి. వేపచెట్టుకి కొన్ని విశేషములు ఉంటాయి ఆరోగ్యమును ఇవ్వకలిగినది వేపచెట్టు. నింబ వృక్షము గురించి వ్యాఖ్యానము చేస్తూ ఎంతో గొప్పదైన వేపచెట్టుని ఆశ్రయించి ఉండటము, దాని కింద పడుకోవడము, ఆ గాలి పీల్చడము ఆరోగ్యానికి కారణములు అయి ఉంటాయి, అది పరదేవత యొక్క అనుగ్రహము అని అమరకోశము అంటుంది. వసంతఋతువు వస్తుంది అనగానే అది పువ్వు పూస్తుంది. అందులో విశేషమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. 

ఆ వేపపువ్వుని నీటిలో కలుపుతారు. ‘శర్కర’ ఇక్కడ బెల్లము అని అర్ధము చేసుకోవాలి. బెల్లము ఒక్కదానికి నిలవదోషము లేదు. అందుకే ఏదైనా భగవంతునికి నివేదన చేసినప్పుడు సంబారములతో ఒక బెల్లంగడ్డ కూడా నివేదన చేస్తారు. అది ఒక మంగళద్రవ్యమే కాక నిలవదోషము లేనిది. వేపపువ్వు వేసిన నీటిలో బెల్లంగడ్డ వేసి, ‘ఆమ్ల’ అనగా చింతపండు చిక్కగా కలపిన పులుసులో వేపపువ్వు వేసి, బెల్లంగడ్డ వేస్తే బెల్లముక్క నాని కరుగుతుంది. వేపపువ్వు పైకి తేలుతుంది. అందులో ‘ఘృతైర్వుతం’ ఆవునెయ్యి కలపాలి. లోకములో ఆవునెయ్యి, మంచినీళ్ళను, అమృతముతో సమానముగా చెపుతారు.



లోకములో ఏ చెట్టుకి కూడా భగవంతుని యొక్క పేరు లేదు ఒక్క మామిడిచెట్టుని మాత్రము రసాలము అంటారు. భగవంతునికి పేరు ‘రసోవై సః’ అంటారు. దాని ఆకులు మాత్రము ప్రతి మంగళకరమైన కార్యక్రమములకు వినియోగపడతాయి. దాని యందు ఎంతో ఓషధీశక్తి ఉన్న కారణము చేత దానిని ఊరగాయగా కూడా నిలవ ఉంచుకుని తింటారు. ఉగాది ప్రసాదములో మామిడి ముక్కలను కూడా కలుపుకోవడము సంప్రదాయములో అలవాటుగా ఉన్నది. ఈ పదార్ధమును తెల్లవారు ఝాముకాలములో ఈశ్వరుడికి నివేదన చేసి మొదటి యామములో ప్రసాదముగా తినాలి. ఈశ్వరుడికి నివేదన చెయ్యాలి అంటే దానికి పూర్వాంగములోనే స్నానాది కార్యక్రమములు పూర్తయిపోవాలి. అలా ఈశ్వరప్రసాదముగా ఎవరైతే పుచ్చుకుంటున్నారో వాళ్ళకు
‘తద్వర్షమ్ సౌఖ్యదాయకమ్’

ఆరోజు కొత్తగా చేయించుకున్న భూషణములను ధరించి రాజ దర్శన ము చెయ్యాలి అని శాస్త్రము. సృష్టిప్రారంభము అయినది అని యుగాది అని అంటారు. భూమిని పరిపాలించేటువంటి ఆయన విష్ణు అంశ లేకపోతే పృథ్వీపతి కాలేడు. ఇప్పుడు మనము రాజ దర్శనము చెయ్యాలి అంటే రాజులకు రాజు రాజ శేఖరుడు పరమేశ్వరుడు. జగదంబ పరమేశ్వరునికన్నా అధికులు ఎవరూ ఉండరు ఆ రోజు శివాలయమునకు వెళ్ళి పార్వతీ పరమేశ్వరులు కానీ, విష్ణు ఆలయానికి వెళ్ళి లక్ష్మీ నారాయణుల దర్శనం కానీ చెయ్యాలి. ఈ జగత్తు అంతటికీ తల్లి తండ్రులు వాళ్ళు. శివ కేశవుల మధ్యలో భేదము చూడకూడదు.

ఆరోజు ప్రధానముగా చెయ్యవలసినది గోపూజ చేసి, వృషభ పూజ చెయ్యాలి. ఎందు చేత అనగా ఎద్దుయొక్క డెక్కలనుండి స్రవించిన అమృత బిందువుల వలన పంట బాగా వృద్ధిలోకి వచ్చి చక్షు సంబంధమైన వ్యాధులు రాకుండా ప్రజలను కాపాడుతుంది అంత గొప్ప ముఖభాగము చేత ఆనుగ్రహించకలిగినది వృషభము. పృష్ట భాగము చేత అనుగ్రహించకలిగినది గోవు. సమస్తదేవతలు గోవు యొక్క శరీరమును ఆవహించి ఉంటారు. అందువలన ఆరోజు గోవుకి నమస్కరించి ప్రదక్షిణము చేసి గోగ్రాసము పెట్టి వృషభపూజ చేసి వస్తే విశేషమైన ఫలితము కలుగుతుంది.

ఆ రోజున తప్పకుండా పంచాంగమునకు పూజ చేస్తారు. తిధి, వారము, నక్షత్రము, కారణము, యోగము ఐదు అంగములు కలిగినది పంచాంగము అని అర్ధము. ఒక సంవత్సర కాలము ప్రమాణము చేసుకుని కాలము నందు గ్రహములు ఎలా కదిలి ఏ ఏ ఫలితములు ఇవ్వబోతున్నాయో, దాని చేత ఆయా నక్షత్రముల యందు జన్మించిన జాతకులు పొందబోయే శుభాశుభ ఫలితములను ఎలా ఉంటాయో ఆదాయ, కందాయ వివరములు ఎలా ఉంటాయో, రాజపూజ్యము, అవమానము ఎలా ఉంటాయో అన్నీతెలియ చెప్పబడతాయి. 

ఎందుకు ఇవన్నీ చదువుకోవడము అంటే గ్రహములకు స్వాతంత్ర్యము లేదు అవి ఈశ్వరుడికి వశవర్తి అయి ఉంటాయి. రాబోయే కాలము ఎలా ఉంటుందో తెలిసినప్పుడు బెంగ పెట్టుకునే అవసరము ఉండదు. భగవంతుడిని భక్తితో ఆరాధన చేస్తే ప్రసన్నుడై పరమాత్మ గ్రహములను ఆదేశిస్తాడు. ఆ వ్యక్తి భక్తితో జీవిస్తున్నాడు కనక వారికి తీవ్రమైన ఫలితములను ఇవ్వకు తట్టుకోగలిగిన కష్టమును ఇచ్చి అనుగ్రహించమని శాసించ గత జన్మలలో చేసిన కర్మల వలన పొందవలసిన భయంకరమైన దుఖమును భరించకలిగేట్లుగా మార్చి అక్కడితో పరిమార్చ కలిగేట్లుగా చెయ్యకలిగిన దివ్య శక్తి సంపన్నుడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వర ఆరాధన చేసి తననూ, తన కుటుంబమును, దేశమును రక్షించుకోవడానికి కావలసిన మార్గ దర్శనము పంచాంగ పూజ చేత, శ్రవణము చేత లభిస్తుంది. 

ప్రతిరోజూ పంచాంగము ఎవరైతే పరిశీలించి చూస్తారో వారికి సంపద, పాపనాశనము, దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యసిద్ధి, విజయము లభిస్తాయి. అందువలన ఆ రోజు పంచాంగము పూజామందిరములో ఉంచి, పూజించి, తీసి ఇంట్లో ఉన్నవారి అందరి రాశిఫలితాలనూ చదువుకుని బాగా కలసి వచ్చే కాలమైతే ఏ విధమైన అహంకారము, అతిశయము పొందకుండా దాని భగవంతుని ప్రసాదముగా స్వీకరించి సమతుల్యముతో కూడుకున్న బుద్ధితో ప్రవర్తించాలి. ఒకవేళ ఏదైనా ఉపద్రవము పొంచి ఉన్నాడని చెప్పబడినప్పటికీ బెంగ పెట్టుకోకుండా దానినుంచి ఉద్ధరించ కలిగిన శక్తి సంపన్నుడైన పరమేశ్వరుని పాదారవిందములను ఆశ్రయించి కష్టముల నుంచి పైకి వచ్చి సంతోషముగా జీవితమును గడిపి భక్తియందు మరింత దృఢముగా ఊన్చుకుని నిలబడకలిగిన శక్తిని పొందుతారు. 

ఆరోజు అందరూ పంచాంగ శ్రవణము చెయ్యాలి మన తెలుగు జాతి యొక్క సంస్కృతి కట్టు బొట్టూ పాటించాలి. పంచ కట్టుకోవడము తెలుగు జాతి యొక్క సంప్రదాయము. దేవాలయమునకు వెళ్ళి ఈశ్వరుని సందర్శించాలి. ఇంట్లో పెద్దలైన తల్లి తండ్రులకు ప్రదక్షిణ నమస్కారము చేసి ఎక్కడ ఉన్నా గురువుగారికి నమస్కరించి ఆశీర్వచనము పొందాలి. ఇవి అన్నీ మనము చెయ్యవలసిన విశేషాలు. వసంతనవరాత్రులు ప్రారంభము అవుతాయి కనక వసంత ఋతువు ఎంత లక్ష్మీ కారకమో వాతావరణము కొద్దిగా భరించడానికి ఇబ్బందికరముగా ఉండే కాలము కనక విసిన కర్రలూ అందుబాటులో ఉంటే మామిడిపళ్ళు, మల్లెపూలదండలు, పన్నీరు, పానకము మొదలైన వాటిని పదిమందికి అందించడము జనులు దాహార్తిని పొందే కాలము చలివేంద్రములు ప్రారంభించడము చెయ్యాలి. 

చల్లటినీరు ఇచ్చేవారు విశేషమైన ఫలితమును పొందుతారు. మనకు కలిగినంతలో పదిమందికి చలవచేసే పదార్దములు మజ్జిగ వంటివి ఇవ్వకలిగిన స్థితిని ఏర్పాటు చేసుకోవడము దేశ కాలముల యందు తరించడానికి, పుణ్యమును సముపార్జించుకోవడానికి యోగ్యమైన విశేషాలు. వసంత నవరాత్రులు చేసి భగవంతుని అనుగ్రహమును పొంది అందరూ తరించేటువంటి యోగ్యమైన కాలము. ఈ నూతనసంవత్సరము వచ్చింది అంటే ఇంద్రియముల యొక్క ప్రకోపమును శాంతింప చేసుకోవడానికి అనుసరిచే విదానముగా కాకుండా అర్ధము లేని విధానములను పాటించకుండా శాస్త్ర ప్రోక్తమైన పద్ధతిని పాటించి కొత్త సంవత్సరము ప్రారంభము అవుతున్నది కనక భగవంతుని అనుగ్రహముతో ఆ సంవత్సరములో యావత్ ప్రపంచము పరమప్రశాంతతో ఉండడానికి కావలసిన రీతిలో ఈశ్వరారాధన చేసి అనుగ్రహమును పొందాలి.

 -- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది