ఇవేం పడవలు ? వీటినా మనపూర్వీకుల ఉపయోగించింది ?
మనిషి నాగరికత నేర్చుకొన్న తరువాత అనేక ఆవిష్కరణలు చేశాడు.వాటిలో ముఖ్యమైనవి ఆయుధాలు. ఈ ఆయుధాలలో విప్లవాత్మక సాధనం బాణం. ఇంకా నూతన ఆవిష్కరణలలో చక్రం ఎంతో ముఖ్యమైనది.చక్రాన్ని కనుక్కొన్న మానవుడు దానినో ప్రయాణసాధనంగా మార్చుకొన్నాడు.
ప్రయాణసాధనాలలో నేడు అనేకరకాలున్నప్పటికి, పూర్వీకుల ప్రయాణసాధనాలు సులభతరమైనవి.
మనవారు ఉపయోగించిన కొన్ని ప్రయాణసాధనాలేమిటో చూద్దాం.
గుర్రం, ఎద్దు, దున్న, ఏనుగు, ఒంటె, రథం ( బండి ) పల్లకీ, పడవ మొదలైనవిగా చెప్పుకోవచ్చు.
18 వ శతాబ్ధివరకు భారతీయనౌకలు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి. ఆంగ్లేయులు ఆవిరినౌకలను ప్రవేశపెట్టడంతో దేశీయనౌకలకు ప్రాముఖ్యత తగ్గి, రానురాను ఉనికినే కోల్పోయాయి.
మనవారు తయారుచేసి నడిపిన పడవల పేర్లను గమనిస్తే
కప్పలి, జోంగు, వల్లి,వళిక, సమ్మాన మొదలైనవి ప్రముఖమైనవి.
కప్పలి అనే పడవ పెద్ద సముద్రాలలో యానం చేయటానికి ఉపయోగించే వారు. ఇది పూర్తిగా భారతీయ తయారీ.
వేనిషియా దేశానికి చెందిన నికోలోకాంటి (1395 - 1462) అనే యాత్రికుడు ఒకటవ దేవరాయలకాలంలో విజయనగరాన్ని, మిగిలిన దక్షిణభారత భూభాగాలలో తిరిగాడు. అతని వ్రాతలనుబట్టి కప్పలి ఓడ రెండువేల బట్(Butt) సామర్ధ్యంతో నడిచేది. బట్ అంటే మనిషి లేదా పశువు అని అర్థం. అంటే నాటి ఓడలు టన్నులకొద్ది వర్తకసామగ్రతో పాటు అందులో 2000 మంది సరంగులు సిబ్బంది సైనికులు వర్తకులు సేవకులు ఉండేవారన్నమాట.
కప్పలికి ఐదు కొయ్య స్థంభాలతోపాటుగా 5 పెద్దపెద్ద తెరచాపలు ఉండేవి. నాణ్యమైన కలపతో మూడువరుసల చెక్కపలకలతో బయటి గోడలను నిర్మించేవారు. తుఫానులు వంటి విపత్కర పరిస్థితులలో బయటి వరుసలలో ఒక్కటి పాడైనప్పటికి లోపలి వరుసలు భద్రంగావుండి సముద్రప్రయాణం సజావుగా జరిగేది.
నివాస, సరుకుల గదులు కూడా అరలు అరలుగా వుండేవి. ఒక అరపాడైనప్పటికి మరో అర లోనికి సామాగ్రిని తరలించి సురక్షితంగా ఉంచేవారు.ఇవి ఐరోపా, ఆఫ్రికా వంటి సుదీర్ఘ ప్రయాణానికి అనువైనవి.
ఇక చైనా మరియు ఇతర తూర్పుదేశాలు అనగా సుమిత్ర, జావా, కాంభోడియా, మలక్కా, మలయా వంటి దేశాలమధ్య వర్తక వ్యాపారాలకు ఉపయోగించే పడవల పేర్లు జోంగు. ఇందులో నాలుగు నుండి పన్రెండు వరకు తెరచాపలు వుండేవి.
12 వ శతాబ్ధంలో భారతదేశాన్ని సందర్శించిన మొరాకో దేశవాసి ఇబన్ బటూట నమోదుచేసిన దానిని బట్టి పెద్దనౌక పేరు జోంగు, మధ్యస్థాయి నౌకపేరు రాజులు, చిన్న తరహావి కకమ్.
వీటి తెరచాపలను ఎప్పుడు కూడా దించరు, లంగరు వేసినా సరే ఇవి ఎగురుతూనే ఉంటాయి..గాలివాటును బట్టి వాటిని తిప్పుతారు. తెరచాపలను పేకలాగా నూలుదారంతో నేస్తారు.
ఈ జోంగు రకం ఓడలలో వేయిమంది వరకు కళాసులు( సేవకులు) రక్షణకొరకు వున్న సైనికులుంటారు. ఈ సైనికులలో విల్లంబులు డాలులు వేడినూనెను చిమ్మేవారు మొదలైనవారు వుంటారు. సముద్రపు దొంగలనుండి, భూమిమీదనున్న దోపిడి దొంగలనుండి నావికులను వర్తకులను సామాగ్రిని రక్షించేభారం వీరిదే.
ఓడలు 3 నుండి నాలుగు అంతస్తులు కలిగివుంటాయి. గదులలో వర్తకులు తమ భార్యలతో ఉంపుడుగత్తెలతో సేవకులతో వుంటారు. సేవకులకు ప్రత్యేక గదులుంటాయి. గదులకు తాళాలు వేసుకొవచ్చు.
ముఖ్యసరంగుకు రాజభోగాలే.
ఈ ఓడదిగి నడిచేటపుడు విచ్చుకత్తుల, కాహళ నాదాలతో పహారా వుంటుంది., ఒల్లిడి (గొడుగులాగా) పడతారు.
వంటశాలలు, స్నానాలగదులు,మరుగుదొడ్లుంటాయి.బట్టలు ఉతుక్కోవచ్చు. కొయ్యతొట్టిలుంటాయి.వాటిల్లో కూరగాయలు, ఆకుకూరలు, అల్లంవంటి దుంపలు పండించుకొంటారు. మాంసాహారం కొరకు కోళ్ళు, మేకలు, గొర్రెలు వెంటబెట్టుకు వెళతారు.
వళ్ళి, వళిక అనే నావలగురించి ప్రస్తావనలున్నాయే తప్ప వాటి ఆకారం, వర్ణనలగురించి వివరాలు అందుబాటులో లేవు.
సమ్మాన్ అనే నౌకలగురించి కూడా పూర్తి వివరాలు లేనప్పటికి మలయాదేశానికి వర్తకవాణిజ్యాల కొరకు వీటిని ఉపయోగించేవారు.
దిక్సూచిలు లేవు కనుక సూర్యచంద్ర నక్షత్రగమనాలను బట్టి దిక్కులను, దూరాన్ని లెక్కించేవారు. ఒకసారి పడవ ఎక్కితే మరలా భూమిమీద కాలుమోపేటంతవరకు ప్రాణాలకు కాని, సరుకులకు కాని నమ్మకంలేదు.
సుగంధ ద్రవ్యాలను పట్టుబట్టలను నూలువస్త్రాలను ఎగుమతి చేసేవారు. బంగారు, గుర్రాలు వంటి వాటిని దిగుమతి చేసుకొనేవారు.