జీవితంలో విజయం సాధించటమంటే- ఆనందంగా జీవించటమే అంటారు స్వామి వివేకానంద. ఆ ఆనందం ఎలా వస్తుంది?- ఈప్రశ్నకు సమాధానంగా ఆయన ఐదు సూత్రాలు చెప్పారు. సంతోషకరమైన జీవనానికి అవసరమైన ఆ ఐదు సూత్రాలేమిటో చూద్దాం..
1. ప్రతి నాణానికి రెండు వైపులుంటాయి. అలాగే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు రెండు కోణాలుంటాయి. ఈ సంఘటనలను సానుకూల దృక్పథం నుంచి చూడాలా? ప్రతికూల దృక్పథం నుంచి వీక్షించాలా? అనే సంశయం చాలా సార్లు తలెత్తుతూ ఉంటుంది. అప్పుడు మనకు తర్కం అక్కరకు వస్తుంది. దీనితో పాటుగా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం మొదలుపెడితే ఎన్ని అవాంతరాలు ఎదురయినా విజయం సాధించగలుగుతాం.
2. ఈ ప్రపంచంలో పెద్ద పాపం- ‘‘నేను ఈ పనిని చేయలేను..’’ అనుకోవటమే. ఈ ప్రపంచంలో ఏ పని అసాధ్యం కాదు. నిబద్ధతతో, ఆత్మవిశ్వాసంతో ఒక ప్రణాళిక ఆధారంగా ముందుకు వెళ్తే ఏదైనా సాధ్యమే. ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణి ప్రత్యేకమైనదే. ఈ విషయాన్ని నమ్మినప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే మనను విజయపథం వైపు పరుగులు తీయిస్తుంది.
3. ఎవరికైనా ఆకలి వేసినప్పుడు అన్నంపెడితే వచ్చే తృప్తి, ఆనందాలకు వెలకట్టలేం. కేవలం అన్నం పెట్టడమే కాదు.. అవసరమైనప్పుడు సలహా ఇవ్వటం.. మన దగ్గర ఉన్నదానిని వారితో పంచుకోవటం కూడా ముఖ్యమే. ఎవరి నుంచైనా తీసుకోవటం కన్నా ఇవ్వటంలో ఉన్న ఆనందాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. ఇలాంటి ఆనందం ఉంటే జీవితంలో సాఫీగా సాగుతుంది. అప్పుడువిజయపథం వైపు దృష్టి సారించగలుగుతాం.
4. మనకు ఏం కావాలో మన మనసు చెబుతుంది. కానీ ఆ మనసు మాటలను వినే శక్తి మనకుండాలి. ఈ శక్తి అందరికీ ఉంటుంది. కానీ దానిని ఉపయోగించుకొనేవారు అతి కొద్ది మంది.మనసు మాటలు వినటానికి అంతర్ముఖులవ్వాలి. అప్పుడే వినగలుగుతాం. మనసు మాట విన్నవారందరూజీవితంలో విజయం సాధించినవారే. ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితుల్లోఉన్నప్పుడు మనసు చెప్పిన మార్గంలో నడుచుకోవటమే మంచిది.
5. జీవితంలో ఎవరైనా విజయం సాధించాలంటే వారు ప్రేమ మార్గంలో నడవాలి. మానవ జీవితంలో అత్యంత శక్తిమంతమైనది ప్రేమ. ఈ భావన నిస్వార్థంగా ఉంటుంది. జీవితంలో విజయం సాధించిన వారందరిలోను నిజమైన ప్రేమభావం కనిపిస్తుంది.
💐💐శుభం💐💐