పడవ ప్రయాణం
ఓ రాజుగారు కుక్కలతో నౌకాయానం చేస్తున్నారు. ఆ పడవలో రాజుగారితోబాటు మరికొంత మంది, ఓ సాధువూ కూడ ప్రయాణిస్తున్నారు. కుక్క ఎప్పుడూ అంతకు ముందు పడవ ప్రయాణం చేయకపోవడం వల్ల, తేడా తెలియక అటుఇటూ గెంతుతూ అరుస్తూ తిరుగుతూంది. ఎవరినీ కుదురుగా కూర్చోనివ్వడంలేదు. పడవ నడిపేవాడికి మాత్రం తిరిగే కుక్కను చూసి గాభరా వేసింది, ఎందుకంటే ఈ హడావిడిలో పడవలో ఉన్నవాళ్ళు ఒక్కవైపున గుమికూడితే పడవ ఒరిగి పోతుంది. దాంతో తనూ మునుగుతాడు, ఇతరులూ మునిగిపోతారు.
కానీ ఇదేమీ తెలియని కుక్క మాత్రం దాని ఇష్టం వచ్చినట్లు తిరుగుతోంది. పరిస్థితి చూసిన రాజుగారికీ కోపం వచ్చింది. కానీ కుక్కను ఎలా ప్రశాంతంగా ఉంచాలో ఆయనకు పాలుపోవడంలేదు. గదమాయించినా వినడం లేదు. రాజుగారి ఇబబందిని గమనించాడు పడవలోనున్న సాధువు.
'రాజా మీకు అభ్యంతరం లేకపోతే, అనుమతిస్తే నేను ఈ కుక్కను భయపెట్టి సముదాయిస్తా' నన్నాడు. రాజు అందుకు వెంటనే ఒప్పేసుకున్నాడు.
సాధువు పడవలోనున్న కొంతమంది సహాయం తీసుకుని, కుక్కను పట్టుకుని నీళ్ళలోకి విసిరేశాడు. కుక్క ఈదుకుంటూ వచ్చి పడవ చెక్కను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడది తన ప్రాణాలు కాపాడుకోవడమెలా అనే యావలో మునిగి పోయింది.
కొంచెం సేపటి తరవాత సాధువు ఆ కుక్కను నీటిలోంచి లాగి పడవలోకి విసిరాడు. బ్రతుకుజీవుడా అనుకొన్న కుక్క ఒక మూలకెళ్ళి కదలకుండ పడుకుండి పోయింది.
నావలో ప్రయాణిస్తున్న యాత్రికులతోబాటు రాజుగారు కూడ ఈ వ్యవహారాన్నంతటినీ ఆశ్చర్యంగా గమనించేరు.
రాజుగారు సాధువుతో ఇలా అన్నారు, 'చూడు కుక్క అంతకు ముందెంత గడబిడ చేసిందో ఇప్పుడెలా మేకపిల్లలా పడుకుండిపోయిందో'..
అప్పుడు సాధువు ఇలా అన్నాడు-'రాజా ఇతరుల కష్టాలు మన స్వానుభవంలోకి వస్తేగాని అవతలివారి ఇబ్బందిని అర్ధంచేసుకోలేము. ఈ కుక్కకు నేను దాన్ని నీళ్ళలోకి విసిరివేసినపుడు మాత్రమే నీళ్ళవల్ల వచ్చే ప్రమాదం, పడవ ఉపయోగం అవగాహనకొచ్చాయి.'
----------------
మనం తోటివారి పట్ల ఎలా ఉండాలో విదురుడు ఒక శ్లోకం ద్వారా చక్కగా చెప్పారు.
పరుల ఏ పనుల వల్ల మనకు బాధ, దుఃఖం కలుగుతాయో, తిరిగి మనము ఆ పనులను పరులకు చేయకుండా ఉండటమే పరమ ధర్మమని విదురుడు బోధించాడు.
"ఒరులేవి యొనరించిన
నరవర యప్రియము తన మనమునకు దా
నొరులకు నవిసేయ కునికిప
రాయణము పరమ ధర్మ పథముల కెల్లన్"