💕💕💕💕💕💕💕💕💕💕💕💕
🍁ఎవరు గెలిచారు?!🍁
కళింగ రాజ్యాన్ని వసంతుడు పాలించేవాడు. అతను కళలకు ఎంతో విలువనిచ్చేవాడు.
ఒక సారి రామప్ప అనే సంగీత విద్వాంసుడు సభలోకి వచ్చి ‘నన్ను సంగీతంలో ఓడించగలవారు మీ రాజ్యంలో ఉన్నారా?’ అని సవాలు విసిరాడు. రాజు రామప్పను సాదరంగా ఆహ్వానించి ‘మీ గురించి ఎంతో విన్నాము. కొన్ని రోజులు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. పోటీలో తమరిని ఓడించేవారు మా రాజ్యంలో బహుశా లేరనే అనుకుంటున్నాను’ అన్నాడు.
‘అంటే.. మీ రాజ్యంలో సంగీత విద్వాంసులే లేరా?’ అన్నాడు రామప్ప. ‘ప్రభాకరుడు అనే వారు ఉన్నారు. కానీ ఈ మధ్యే జబ్బుపడ్డారు. కాబట్టి పోటీ ప్రసక్తే లేదు. మీరే విజేత’ అన్నాడు రాజు. ‘అలా వీలు లేదు. నాతో పోటీలో ఎవరో ఒకరు పాల్గొనాల్సిందే. ఊరికే విజేతగా నేను అంగీకరించను’ అన్నాడు రామప్ప.
అప్పుడే మంత్రి సుబుద్ధి అక్కడకు వచ్చి ‘ప్రభాకరుడి ప్రియశిష్యుడు, మనవడైన విజయుడికి సంగీతంలో కాస్త ప్రవేశం ఉంది. మీకూ అతనికి పోటీ నిర్వహిస్తాం. అప్పటి వరకు మీరు విశ్రాంతి తీసుకోండి’ అని రామప్పను ఒప్పించి అతనికి, వెంట వచ్చిన ఇద్దరు వాద్య కళాకారులకు ప్రత్యేక మందిరంలో విడిది ఏర్పాటు చేశాడు.
‘మహామంత్రీ! ఆ పిల్లవాడు ఈయనతో పోటీ పడగలడా?’ అని సందేహం వెలిబుచ్చాడు రాజు.
👉‘మహారాజా! మరో మార్గం కనబడలేదు. పిల్లవాడు ఓడినా ఇబ్బంది లేదు. మహా విద్వాంసుడితో పోటీపడ్డాడు అన్న పేరు మిగులుతుంది’ అని అన్నాడు మంత్రి. ‘మీరు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు’ అన్నాడు రాజు.
పోటీ రోజు రానే వచ్చింది. సభ కిటకిటలాడసాగింది. ఒక వైపు రామప్ప తన ఇద్దరు వాద్య కళాకారులతో కూర్చున్నాడు. మరో వైపు పదమూడు సంవత్సరాల వయసున్న విజయుడు కూడా ఇద్దరు పెద్ద వారైన సంగీత వాద్య కళాకారులతో కూర్చున్నాడు.
విజయుణ్ని చూసి ఆశ్చర్యపోయాడు రామప్ప. పోటీ ప్రారంభించండి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు.
ముందుగా రామప్ప ఒక పాట పాడాడు. విజయుడు మొదటగా మానవజన్మ ప్రసాదించిన ఆ దేవుణ్ని ప్రార్థిస్తూ పాట పాడాడు. రామప్ప రెండో పాట రాజును పొగుడుతూ పాడితే, విజయుడు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద పాడాడు.
మూడు, నాలుగో పాటలుగా రామప్ప సంగీతంలో తాను సాధించిన విజయాలపై పాడితే.. విజయుడు మూడో పాటగా ప్రజలను కన్నబిడ్డలుగా పాలిస్తున్న రాజు గురించి, నాలుగో పాటగా అతిథి అయిన రామప్ప గురించి పాడాడు.
సభలోని వారు ఇద్దరి పాటలకూ మంత్రముగ్ధులై హర్షధ్వానాలు చేశారు. ‘నాలుగు పాటలతోనే ఆపేస్తున్నాను. ఇక నేను పాడలేను’ అన్నాడు రామప్ప.
‘ఎవరు విజేతనో న్యాయనిర్ణేత చెప్పాలి’ అన్నాడు రాజు. ‘మహారాజా! రామప్పే విజేత’ అని ప్రకటన చేశాడు న్యాయనిర్ణేత.
‘మహారాజా! ఈ తీర్పును నేను ఒప్పుకోవడం లేదు. నా మీద గౌరవం కొద్దీ నేను గెలిచానని చెబుతున్నారు. నేను ఎన్నో సభల్లో పాల్గొని ఎందరినో ఓడించాను. ఎప్పుడూ అపజయం పొందలేదు. నా కంఠం బాగుంటుందని ఎందరో అన్నారు.
👉ఆ గర్వంతో నాకు తోచిన పాటలను పాడేవాడిని.
విజయుడి గురువుగారికి నేను ముందుగా వందనం చేస్తూ వారు త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. శిష్యుడు ఎలా ఉండాలి అన్నదానికి విజయుడే సాక్ష్యం. వరుసగా భగవంతుడు, తల్లిదండ్రులు, మహారాజు, అతిథి.. వీటిని అంశాలుగా చేసుకుని పాటలు పాడాడు.
నేను ఏ రోజూ ఈ క్రమంలో ఒక్క పాట కూడా పాడలేదు. విజేత విజయుడే’ అని చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ లేచి వెళ్లి విజయుణ్ని అక్కున చేర్చుకున్నాడు రామప్ప. విజయుడు పాదాభివందనం చేశాడు.
‘మహారాజా! నేను గెలుచుకున్న బంగారు కడియం విజయుడికి కానుకగా ఇస్తున్నాను. ఇతనికి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంది’ అని చేతికున్న కడియాన్ని విజయుడి మణికట్టుకు తొడిగాడు రామప్ప. ‘రాజుగారి సమక్షంలో మీరు ఇచ్చిన కానుకకు కృతజ్ఞతలు’ అని రామప్పకు మరోసారి పాదాభివందనం చేశాడు విజయుడు.
‘మీలాంటి వారిని సత్కరించుకోవడం మా అదృష్టం’ అని మహారాజు స్వయంగా వచ్చి రామప్పను తీసుకుని వెళ్లి ప్రత్యేక ఆసనం మీద కూర్చోబెట్టి సత్కరించాడు.
తర్వాత విజయుడిని కూడా తగిన రీతిన సన్మానించాడు. సభలోని వారు హర్షధ్వానాలు చేశారు. ‘మహారాజా! మీకూ, సభలోని వారికి నా ధన్యవాదాలు.
వెళుతూ వెళుతూ విజయుడి గురువుగారిని దర్శించుకుని వెళతాను. అనుమతి ఇవ్వండి’ అన్నాడు రామప్ప. ‘తప్పకుండా మీకు తోడుగా మంత్రిగారిని పంపుతాను’ అని రాజు వీడ్కోలు పలికాడు.🍁
- యు.విజయశేఖర రెడ్డి
❣❣❣❣❣❣❣❣❣❣❣❣