కలి అత్యంత భయంకరమైనది. అలాంటి కలికాలాన్ని భగవంతుడు ఎందుకు ఉపేక్ష చేశాడు?
వారి వారి కర్మలను అనుసరించి కాలాన్ని, సృష్టిని నడుపుతూ ఉంటాడు భగవానుడు.
కలియుగంలో గొప్ప లక్షణం ఒకటి ఉంది గనుకనే భగవంతుడు కలిని ఉపేక్షించాడు. దీనిని బట్టి ఎంత కాని కాలం అనుకున్నా ఎంత పనికి రానిది అనుకున్నా దాంట్లో పనికొచ్చే లక్షణం ఒకటి ఉంటుంది అని తెలుసుకోవాలి. అందుకే సృష్టిలో పనికిరానిది ఏదీ లేదు. ఆ సుగుణం ఏదో మనం పట్టుకొని దానిని వాడుకోగలగాలి.
కలిస్సాధుః – కలి చాలా గొప్పది (వ్యాసుల వారు).
కలిలో కొద్దిపాటి ధర్మాన్ని ఆచరించినా గొప్ప ఫలం ఇస్తుంది. కనుక కలి గొప్పది. దోషనిధియైన కలిలో ఒక సుగుణం ఉన్నది గనుకనే భగవంతుడు దానిని ఉపేక్షించాడు.
ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞైః త్రేతాయాం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతిః కలౌ సంకీర్త్య కేశవం!! – కృతయుగంలో ధ్యానాలు చేసి, త్రేతా యుగంలో యజ్ఞాలు చేసి, ద్వాపర యుగంలో అర్చనలు చేసి, ఏ మహాఫలాన్ని పొందుతారో కలియుగంలో కేశవుని కీర్తించి అదే ఫలితాన్ని పొందవచ్చు. అంటే యజ్ఞయాగాదుల కంటే గొప్పది కేశవ కీర్తన.
కాసింత సత్కార్యం కూడా గొప్ప ఫలితాన్ని ఇవ్వగలదు కలియుగంలో.
కలియుగంలో ధర్మం స్మరిస్తే ఫలితం వస్తుంది. కలియుగంలో పాపం క్రియారూపంలో చేస్తేనే ఫలితం వస్తుంది.
కనీసం భగవత్ సంకీర్తన కూడా చేయాలి అనే బుద్ధి కూడా పుట్టనివ్వని యుగం కలియుగం.
అత్యంత దుష్టస్య కలేః అయమేకో మహాన్ గుణః
కీర్తనా దేవకృష్ణస్య ముక్త బంధః పరం వ్రజేత్!!(వ్యాసమహర్షి)
కలిలో కృష్ణ కీర్తనతో పరమును పొందవచ్చు. కనుక భగవత్ సంకీర్తన కలిలో సర్వ కల్మషాలను పోగొట్టి తరింప జేస్తోంది గనుక అటువంటి దివ్య నామములు, దివ్య గుణములు కలిగిన భగవానుని స్మరిద్దాం.