మోడు వారిన చెట్టు ఎప్పటికీ అలాగే ఉండదు. చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలాల్నిస్తుంది...





మోడు వారిన చెట్టు ఎప్పటికీ అలాగే ఉండదు. చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలాల్నిస్తుంది...
 అంటే సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. అలాగే జీవితంలో కష్టనష్టాలూ మనుషుల్లో రాగద్వేషాలూ కలకాలం నిలిచి ఉండవు. గతం గతః... అనుకుని బంధాలను చిగురింపజేసుకుంటూ పెంచుకుంటూ వర్ణభరితంగా జీవించడమే హోలీ పండగలోని అర్థమూ పరమార్థమూ. అందుకే ఆ రోజున అంతా వీధుల్లోకొచ్చి రంగులు చల్లడం ద్వారా అపరిచితులతోనూ దోస్త్‌ అనేస్తారు. మిఠాయిని పంచి ప్రేమతో బంధం కలిపేస్తారు. దాంతో అందరిలో ఏదో ఆనందం... తెలియని ఉత్సాహం... అదే హోలీ సంరంభం...

హోలీ హోలీల రంగహోలీ చెమ్మకేళీల హోలీ, రంగేళీ హోలీ... హంగామా కేళీ.., హోలీ ఆయీరే కన్హాయీ.., రంగ్‌ బర్సే...అంటూ హోరెత్తించే పాటలూ చిందులేసే నృత్యాలూ డప్పువాద్యాలూ డోలు బాజాలూ...చిన్నాపెద్దా ఆడామగా పేదాగొప్పా తేడా లేదు. అందరిలో ఒకటే హుషారు... ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఒకటే కేరింతలు... అంతా ఆ రంగుల మహాత్మ్యమే. అందుకే హోలీ పండగ ఇప్పుడు దేశ సరిహద్దుల్ని దాటి అంతర్జాతీయంగానూ రంగుల్ని విరజిమ్ముతోంది. అమెరికా, బ్రిటన్‌, కెనడాల్లో ఉన్న మనవాళ్లనే కాదు, విదేశీయుల్నీ ఈ రంగులు చిమ్ముకోవడం బాగా ఆకర్షించింది. దాంతో ఆయా దేశాల్లో ప్రధాన వేదికలను ఏర్పాటుచేసుకుని ముఖ్యంగా హిందూదేవాలయాల దగ్గర హోలీ ఆడుకుంటున్నారు. సంగీత వేడుకల్లా ఈ రంగులపండగని జరుపుకుంటున్నారు.

పౌరాణిక కథనాలెన్నో... 
విష్ణు భక్తుడన్న కారణంతో ప్రహ్లాదుణ్ణి హతమార్చేందుకు అన్ని ప్రయత్నాలూ విఫలమైపోగా సోదరి హోలిక సాయంతో అతణ్ణి అంతం చేయాలనుకుంటాడు హిరణ్యకశ్యపుడు. మంటల నుంచి రక్షించే తివాచీని కప్పుకున్న హోలిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టి దహనం చేయబోగా, ఆ నారాయణుడి మహిమవల్ల హోలిక కప్పుకున్న శాలువా గాల్లోకి ఎగిరి ప్రహ్లాదుణ్ణి చుట్టుకోవడంతో ఆమె దహనమై, ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు. చెడుమీద మంచి గెలిచిందన్న గుర్తుగా ఉత్తరాదిన హోలికాదహనం చేసి, రంగులు చల్లుకుంటూ చేసుకునే సంబరమే హోలీ.

యోగసమాధిలో ఉన్న పరమశివుడిమీద పూలబాణం వేసి పార్వతీపరమేశ్వరుల వివాహానికి కారణమవుతాడు మన్మథుడు. తనలోని ఆ కామవికారానికి కారణమైంది మన్మథుడు అని దివ్యదృష్టితో గ్రహించిన ఆ ముక్కంటి, తన క్రోధాగ్నితో అతణ్ణి భస్మం చేస్తాడు. అందుకే క్షణికమైన కోరికలకు అడ్డుకట్ట వేయాలన్న కారణంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో ముందురోజు కాముణ్ణి కాల్చి రంగులు చల్లుకుంటారు... అదే కాముని పున్నమి.

రాధ తనని నల్లనివాడు అంటుందంటూ ఉడుక్కుంటోన్న కృష్ణయ్యకు రాధ మొహంమీద కాస్ల నల్లని రంగు రాయమని చెబుతుంది యశోదమ్మ. దాంతో రాధతోబాటు ఆమె చెలికత్తెలమీద రంగులు చల్లిన రోజే హోలీ పండుగగా మారిందనేది మరో కథనం. రంగుదేముంది... అందరం ఒక్కటే అన్న భావనతో కృష్ణుడు పుట్టిపెరిగిన మధుర, బృందావనం, నందగావ్‌, బర్సానాల్లో సుమారు 16 రోజులపాటు ఈ వేడుకను వైభవంగా చేసుకుంటారు. నందగావ్‌, బర్సానాలో స్త్రీలు రాధలుగానూ; కవ్వించే మాటలతో వాళ్లను ఏడిపించే గోపీలుగా పురుషులూ మారిపోతారు. దాంతో రాధలంతా కలిసి గోపీల్ని సరదాగా కర్రలతో కొడుతుంటే వెంట తెచ్చుకున్న డాలుతో గోపీలు తమను కాపాడుకుంటూ ఉల్లాసంగా ఈ పండగ జరుపుకుంటారు. అందుకే అక్కడ దాన్ని లాఠ్‌మార్‌ హోలీ అంటారు. పశ్చిమబెంగాల్లో మాత్రం ఈ పండగ వసంతోత్సవ్‌ పేరుతో కనువిందు చేస్తుంది. ఉదయాన్నే తెలుపు లేదా పసుపురంగు దుస్తులతో మెడలో పూలమాలలతో బయటకు వచ్చి సంగీత వాద్యాలతో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ వసంతరుతువుని స్వాగతిస్తూ ప్రకృతిలో లీనమవుతారు. దీన్నే వాళ్లు దోల్‌ పూర్ణిమ అనీ అంటారు. నేపాల్‌, శ్రీలంక, సురినామ్‌... ఇలా చాలాచోట్ల తమదైన పద్ధతుల్లో హోలీ వేడుకను జరుపుకునే ఆచారం ఉంది.

రంగుల్లోని ఆరోగ్యం! 
పురాణకథనాలెలా ఉన్నా ఈ ఆనందకేళిలో ఆరోగ్యమూ దాగుందంటారు ఆయుర్వేద వైద్యులు. చలికాలం వెళ్లి వేసవి వచ్చే వేళలో గాలిమార్పు కారణంగా జ్వరాలూ జలుబులూ వచ్చే అవకాశం ఎక్కువ. అవేమీ రాకుండా ఉండేందుకే వేప, బిల్వ ఆకులూ; మోదుగ, మందార, అగ్నిపూలు... ఇలా ఔషధగుణాలున్న రకరకాల ఆకులూ పువ్వుల పొడుల్ని చందనం, పసుపూకుంకుమలతోపాటుగా నీళ్లలో కలిపి చల్లుకునే ఈ వేడుక పుట్టిందని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు అనేకం. అందుకే వేసవిరాకను తెలిపే మోదుగపూలనే హోలీ పూలనీ పిలుస్తారు. ఈ నీళ్లు శరీరాన్ని చల్లబరిస్తే, ఆ తరవాత చలువచేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరిచేరవని చెబుతారు. మనదగ్గర శ్రీరామనవమికి బుక్కాపిండి, పసుపునీళ్ళవసంతం చల్లుకోవడమూ ఇందులో భాగమే. అయితే ఆనాటి ఆరోగ్యకర సంప్రదాయం రంగుల పండగగా మిగిలిపోయింది.

పర్యావరణప్రియంగా..! 
ఆనందం శృతిమించినా ప్రమాదమే. అలాగే ఈ రంగులకేళిలో కృత్రిమ రంగుల్ని వాడితే ఆరోగ్యానికి అనర్థదాయకమే. వాటిల్లోని టాక్సిన్లవల్ల కళ్లు దెబ్బతినడం, చర్మక్యాన్సర్లు రావడం జరుగుతుంది. అలాంటివేవీ తలెత్తకుండా ఉండేందుకు సహజమైన పూలూ ఆకులతో చేసిన గులాల్‌ వాడకం గురించి సోషల్‌ మీడియాతో సహా అన్ని ప్రసార మాధ్యమాలూ విస్తృతంగా ప్ర




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది