ఉమాదేవి ప్రశ్నలు : మహేశ్వరుని సమాధానాలు
ఉమాదేవి ప్రశ్నిస్తున్నారు :- ""భగవంతుడా! సర్వభూతనాథా! లోకంలో కర్మలను ఆచరించేటప్పుడు కొందరు సమస్తమూ దైవం వల్లనే జరుగుతున్నదని నమ్ముతుంటారు. మరికొందరు జరిగే ప్రతిపనికీ పౌరుషమే కారణమని విశ్వసిస్తారు. మహాదేవ! ఇలా రెండు బలమైన అభిప్రాయాలున్నప్పుడు ఏది నిజం? అనే సందేహం వస్తోంది. దీన్ని నివారించండి.
శ్రీ మహేశ్వరుడిలా చెబుతున్నారు:- మనుష్యలోకంలో రెండు విధాలయిన కర్మలు కన్పిస్తున్నాయి. మొదటిది పురాకృత కర్మ, రెండవది ఇహలోకంలో చేసే కర్మ. వానిలో లౌలికకర్మ దైవమానుష నిర్మితంగా చెప్పబడుతోంది.
వ్యవసాయంలో దున్నటం విత్తనాలు చల్లడం కన్పిస్తుంది. మొక్కలు పెట్టడం, పంటను కోయుటమూ కన్పిస్తుంది. ఇదంతా పౌరుషకర్మమే. అయితే దైవం కారణంగా ఒకప్పుడు ఫలితం లభించకపోవచ్చు. మరొకప్పుడు పురుష ప్రయత్నంలోని లోపాలు కారణం కావచ్చు. మంచి ప్రయత్నం చేస్తే సత్కీర్తి లభిస్తుంది. దుష్టయత్నాల వల్ల అపకీర్తి వస్తుంది. లోకంలో ఈ రెండూ మొదటినుండీ కన్పిస్తున్నవే.
నాట్లు వెయ్యటం, పంట కొయ్యటం. అలాంటివి మరికొన్ని పురుష ప్రయత్నాలే. సమయంలో వర్షాలు పడటం, పైరు బాగా వృద్ధిని పొందటం, దుబ్బు చెయ్యటం ఇలాంటివన్నీ దైవం అధీనంలో ఉంటాయి. పంచభూతాలు ఎలా ఉంటాయి? గ్రహనక్షత్ర సంచారం ఎలా ఉంటుంది? మొదలయిన విషయాలు బుద్ధిగోచరాలు కావు. హేతువాదానికందవు. అలాంటి వాటి కన్నిటికీ దైవమే కారణం. శుభమయినా, అశుభమయినా దైవమే కారణం. ఏ పని దేనిచేత చేయ్యటానికి సాధ్యమవుతుందో అది మాత్రమే పౌరుషం అని చెప్పబడుతోంది. ఫలాన్ని పొందటం అన్నది కేవలం దైవం వల్ల గాని, కేవలం పురుష ప్రయత్నం వల్ల కాని సాధ్యం కాదు.
ఆ రెండూ కలిసి పనిచేస్తున్నప్పుడు శీతోష్ణాలు రెండూ కలసినప్పటిలా అవసరమయిన ఫలితాలు పొందవచ్చు. బుద్ధిమంతుడు ముందుగా పురుష ప్రయత్నం చేయాలి. ఏది దానంతట అదే జరుగుతుందో అటువంటి పనిని ప్రారంభించిన మానవుడు కీర్తిని పొందుతాడు. లోకంలో ఏ విధంగా భూమిని తవ్వటం వల్ల నీరు లభిస్తుందో, అరణుల్ని మధించటం వల్ల అగ్ని లభిస్తుందో, అలాగే పురుషప్రయత్నం ద్వారా దైవసంపద కలిసివస్తుంది. ఏ పని చెయ్యని నరునికి దైవసంపద దరిచేరదు. కనుక ఏ పనికి సంబంధించిన ప్రారంభమైన దైవమానుష శక్తుల చేతనే ఏర్పడుతుంది.