'మీ అమ్మాయికి వంటొచ్చా ?' పిల్లాడి తల్లి
'పెద్దగా అవసరం పడలేదండి .. నేనున్నాను కదా .. మెల్లగా నేర్పిస్తాను ' పిల్ల తల్లి
'అయ్యో ..అలా అంటావేంటి మమ్మీ .. హైద్రాబాద్ లో నేనొక్కదాన్నీ ఎలా survive అవుతున్నాననుకున్నావు ?.. నాకు కొద్దిగా వంటొచ్చు ఆంటీ ' వంచిన తలెత్తకుండా పిల్ల
'అమ్మాయికి బాగా సిగ్గనుకుంటా ..కొంచెం తల పైకెత్తమ్మా ' పిల్లాడి తండ్రి
'సిగ్గెందుకు అంకుల్ .. ఖాళీ గా ఉన్నాను కదా అని ఫ్రెండ్స్ తో వాట్సాప్ లో ఉన్నాను ' చేతిలో ఉన్న ఫోన్ చూపించి , తల పైకెత్తి , మళ్ళీ బుర్ర వంచేసింది పిల్ల
'వావ్ ..మీరు కూడా నాలాగే samsung ఫాన్ అన్నమాట ' తన చేతిలోని ఫోన్ చూపించి అన్నాడు పెళ్ళికొడుకు
'అవునన్నయ్య గారూ .. ఈ తరం పిల్లలు బుర్ర వంచేరు అంటే అదేమీ సిగ్గో అగ్గో కాదండి .. వాట్సాప్ లో ఉన్నారని అర్ధం ' పిల్ల తల్లి
'ఇందాక వంటొచ్చు అన్నావు కదా ..చెప్పు ఏమిటేమిటి వండగలవు ?' పిల్లాడి తల్లి ఆరా
'నూడుల్స్ వచ్చు ఆంటీ .. గ్రీన్ టీ కోసం వాటర్ బాయిల్ చెయ్యడం వచ్చు ' పిల్ల చెప్పింది .. మళ్ళీ బుర్ర వంచుకుని
'నూడుల్స్ అంటే ? హక్కా ..సింగపూర్ , అమెరికన్ చోప్సే .. వచ్చా ?' బుర్ర వంచుకుని అడిగింది పిల్లాడి అక్క (ఈ మధ్యనే వెకేషన్ కోసం అమెరికా నుంచి ఇండియా వచ్చింది )
'ఆ .. అవి రావు ' పిల్ల తలెత్తకుండా
'మరి ?' పిల్లాడి అక్క ..తలెత్తకుండానే ..
'నూడుల్స్ అంటే .. మాగ్గీ నూడుల్స్ , క్నోర్ నూడుల్స్ , యిప్పీ నూడుల్స్ వచ్చు ' పిల్ల
'మరి.. రోజూ నీకు తిండి ఎలాగమ్మా ?' పిల్లాడి తల్లి
'రోజూ కూరలు కొనుక్కుని , కుక్ చేసుకోవాలి అంటే టైం ఉండదాంటీ.. మీకు తెలుసు కదా వెజిటబుల్స్ ఎంత ఎక్సపెన్సివ్ ఐయ్యాయో .. అందుకే నేను కర్రీ పాయింట్ మీద డిపెండెంట్ ' పిల్ల
'అవును మమ్మీ ..మా జనరేషన్ వాళ్లందరమూ కర్రీ పాయింట్ మీదే డిపెండెంట్ .. ' పిల్లాడు ఫోన్లోనుంచి తలెత్తకుండానే
'మీరు కొత్తగూడ జంక్షన్ లో ఉన్న పృథ్వి కర్రీ పాయింట్ ట్రై చేశారా ' పిల్ల
'థట్స్ మై ఫేవరెట్ .. అక్కడ పాలకూర పప్పు సూపర్ ' పిల్లాడు
'అవునా .. నేనెప్పుడూ అక్కడ సాంబార్ అండ్ ఎగ్ కర్రీ మటుకు తీసుకుంటాను ' పిల్ల
'ఈసారి పాలకూర పప్పు ట్రై చెయ్యండి ..ఆసమ్ టేస్ట్ .. అలాగే హఫీజ్ పేట కెళ్లే దారిలో రాయలసీమ రత్తాలు కర్రీ పాయింట్ ట్రై చెయ్యండి .. అక్కడ మాంగో తొక్కుడు పచ్చడి అదుర్స్ ' పిల్లాడు
'మాంగో తొక్కుడు పచ్చడా ..అంటే అసహ్యం గా వాళ్ళ కాళ్లతో మాంగోస్ ని తొక్కుతారా ?' పిల్ల
'ఐ థింక్ ..వాళ్ళు కాళ్ళు కడుక్కుని తొక్కుతారనుకుంటాను .. ' పిల్లాడు
'ఇద్దరికీ మాటలు బాగానే కలిసాయి .. ఇంక మీరు సంబంధానికి ఓకేనా ?' మధ్యవర్తి
'మీ ఇద్దరి మాటలూ సరే ... మరి రేపు మీ పెళ్లయ్యాక .. మీ ఇంటికొచ్చేననుకో .. మా సంగతేంటి ?..నాకా వెర్రి కర్రీ పాయింట్లు పడి చావవు ' పిల్లాడి తల్లి
'భలేవారే ఆంటీ .. మీరొకవేళ మా ఇంటికొస్తే డే టైం మీరు వంట చేస్తారు .. మా మమ్మీ ని కూడా పిలుస్తాను .. తను రాత్రి వంట చేస్తుంది ' పిల్ల
'ఒక వేళ మా ఇద్దరికీ వొంట్లో బాగోలేకపోతే ?' పిల్లాడి తల్లి
'చట్నీస్ ఉందిగా !!!' పిల్ల , పిల్లాడు
✨✨✨✨✨✨✨✨