పాపం త్యాగం గురించి చెప్పుకోవాలంటే "ఇడ్లీ పిండి " గురించే చెప్పుకోవాలి... మానవుని ఆకలి తీర్చడానికి అది ఎన్నెన్ని రూపాలెత్తుతుందో, ఎన్నెన్ని కష్టాలు పడుతుందో పాపం.. !! రుబ్బిన వెంటనే, వట్టి ఉప్పుతో కలిసి ఆవిరిలో ఉడికి "ఇడ్లీ" అవుతుంది.... మర్నాడు పొద్దుట ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా వీలైతే కేరెట్, కొత్తిమీర వగైరాలతో పెనం మీద కాలి " ఊతప్పం" అవుతుంది...ఇంట్లో పెద్దవాళ్ళు, బాలెంతలు ఉంటే ఆవిరి కుడుము అవుతుంది.. ( కుడుము వట్టి మినప పిండి తోనే చేసేవారు ఇదివరకు.. ఇప్పుడు ఇడ్లీ పిండి తో కూడా వేసేస్తున్నారు.. ) ఇంకా మిగిలితే సాయంత్రానికి మళ్ళి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తో కలిసి సలసల కాగే నూనెలో వేగి "గట్టి పుణుకు" అవుతుంది.... ఇంకో పూట పచ్చి సెనగపప్పును కూడా తోడు తీసుకుని,
" గుంట పొంగణాల " రూపం ధరిస్తుంది... ఇంట్లో హార్ట్ పేషంట్లు ఉంటే వారికి ఉడికిన ఇడ్లీయే ఉప్మా గా మారుతుంది ( నూనె ఎక్కువ లేకుండా ) మొత్తానికి సాత్విక, రాజస, తామస --- ఆహారం యొక్క మూడు అవతారాలూ ఇందులోనే ఉన్నాయి.. అలాగే స్టీం కుకింగ్, డీప్ ఫ్రై, హాలో ఫ్రై, ఇలా అన్ని విధాలుగానూ వేగుతుంది... నెయ్యి, రెండు రకాల చట్నీలు పూసుకుని, కారప్పొడి కోటింగ్ వేసుకుని, సాంబార్ సముద్రం లో డుబుక్కున మునుగుతుంది.. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా, ఎవరికైనా జ్వరం వచ్చి పథ్యం పెట్టాలన్నా, పంచదార తొడుగు తొడుక్కుంటుంది.. ఇలా ఉదయం, సాయంత్రం , రాత్రి అని వేళా పాళా లేకుండా అందరి ఆకలి తీర్చే " ఇడ్లీ పిండి" కి నమోన్నమ:
ఇప్పటి పిల్లలు ఇడ్లీ డెడ్లీ అంటున్నారు కాని, అసలు ఇడ్లీ ఎన్నిరకాలుగా ధైర్యాన్నిస్తుందో తెలుసా... ప్రయాణాల్లో తోడుండేది అదే.. కొత్త చోటుకి వెళ్ళామంటే కడుపు చెడకుండా నిబ్బరంగా తినగలిగేది ఇడ్లీనే.. అనుకోని వేళ అతిథులు వచ్చినా, ఫ్రిజ్ లో రుబ్బిన ఇడ్లీ పిండి ఉంటే ఇంటి ఇల్లాలికి ఎంత ధైర్యంగా ఉంటుంది? బరువు పెరగకుండా హాయిగా తినగలిగేదీ దీనినే.... చవకగా దొరికేది, హోటళ్ళలో కూడా ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండేది వేడి వేడిగా నైనా, కుసింత చల్లారినా తినగలిగేదీ ఇడ్లీ కాక ఇంకోటేముంది ? నూనె, నెయ్యి వాడకుండా కూడా తినొచ్చునే..బి.పి, మధుమేహం, గుండె జబ్బులు, అనీమియా, జ్వరం, గ్యాస్త్రిక్ సమస్యలు,--- ఇలా ఏ వ్యాధి ఉన్న రోగులైనా ధైర్యంగా తినగలిగేది ఇడ్లీ.. ఏ సమయంలో నైనా తినగలిగేది ఇడ్లీ.. ప్రత్యేకంగా ఇదే కావాలి అనుకోకుండా, రకరకాల చట్నీలు, కారప్పొడులు, సాంబారు, పంచదార, ఆఖరికి ఆవకాయ తో కూడా తినగలిగే ఏకైక టిఫిను ఇదే.. అసలు మన తమిళనాడులో రోజూ తినే ఇడ్లీ, సాంబారుని, అన్ని రకాల పోషకాలు కలిగిన ఏకైక ఉదయపు అల్పాహారం గా ప్రపంచమే గుర్తించింది... తమిళ ఇడ్లీ కి తెలుగు రూపం " ఆవిరి కుడుము." ఇందులో మాత్రం అన్ని నంచుకోరు.. పంచదార లేదా ఆవకాయ.. అంతే..
ఉడికినా కూడా రంగు మారకుండా, తెల్లగా, స్వచ్చంగా ఉండి, మనసుకి ఆహ్లాదాన్ని, కడుపుకి నిండుదనాన్ని చేకూర్చే " ఇడ్లీ" ని అల్పాహారాల్లో రాజు గా గుర్తించి, సంవత్సరానికి ఒకసారి ఓ వారం పాటు "ఇడ్లీ వారోత్సవ" సంబరాలు జరుపుకోవాలని నేను మిమ్మల్నదరినీ కోరుకుంటున్నాను..