*వృద్ధాశ్రమాలలో తల్లితండ్రులు*
మన తల్లితండ్రులను, నాన్నమ్మలను , అమ్మమ్మలను, తాతయ్యలను వృద్ధాశ్రమాలాలో కాక వారు మన ఇంటిలోనే ఉంటే, ఆలోచించండి మనము మన తల్లి,తండ్రుల ఋణమును కొంతవరకైనా తీర్చుకొన్నవారము అవుతాము. తల్లికి ఎంత సేవ చేసినా తల్లి ఋణము తీరేదికాదు. తల్లితండ్రులకు సేవలు, సపర్యలు, చేయడం ఎంత గౌరవం ఎన్ని జన్మజన్మల పుణ్యమో, తల్లి ఋణము తీర్చుకునే భాగ్యము మనకు కలుగుతుంది. అందుకే “నేను ఇంకా మా అమ్మకు అన్నం పెడుతున్నాను” అని ఎప్పుడు కానీ పొరపాటున కూడా అనరాదు. అంతకంటే దౌర్భాగ్యపు బ్రతుకు, మానవత్వము ను మరచిన బ్రతుకు, మరొకటి లేదు. కృతఘ్నతకు ఇంత కంటే నిదర్శనము మరోటిలేదు. తల్లి సాక్షాత్తు పరదేవత. నేను ఇంకా ఇంత వయసు వచ్చినా(55 సం|| 60 స|| వచ్చినా అంటే తల్లి తండ్రులు కలిగి వున్నవారు) “నేను ఇంకా మా అమ్మ చేతి అన్నం తింటున్నాను” అని సగర్వంగా త్రికరణశుద్దిగా చెప్పుకొని పొంగి పోయే జన్మము ధన్యము. తల్లి తండ్రుల అవసరాలు తీర్చుచూ వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
ఇక్కడ మరో విషయం బాగా ఆలోచించండి. తల్లి తండ్రులను మనం సేవించడం వలన మనకు పుణ్యప్రదము మరియు వయో వృద్ధులు , జ్ఞానవృద్ధులు అనుభవ వృద్ధులు ఐన తల్లితండ్రులు ఇంటిలో ఉండడం వలన వారి ద్వారా మన పిల్లలకు మనము అపారమైన, విలువ కట్టలేని, ఆధ్యాత్మికమైన, ధార్మికమైన, పురాణ విషయ సంపదలు, అనుభవపూర్వ కమైన మంచి చెడు విషయములు, అందించినవారమౌతాము. వాటి యొక్క విలువలు మనకు ఇప్పుడు తెలియవు. మన పిల్లలు ప్రయోజకులై ఈ ప్రపంచంలో బ్రతుకు తెరువుకై వెళ్ళినపుడు మాత్రమే అవగతమవుతాయి. ఈ సమాజంలో ప్రతి మనిషి ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ పరంగా ఉదయం నుండి సాయంకాలంవరకు, మరీ రాత్రి వరకు బయట అలసి సొలసి విశ్రాంతికై ఇంటికి చేరుతారు. అప్పుడు మన పిల్లలు సందేహాలు, ధర్మ విషయాలు, న్యాయాన్యాయ విషయాలు, సమాజ విషయ సందేహాలు మనల్ని అడిగితే, మనము మన శారీరక, మానసిక, బడలికల వలన విసుగు ప్రదర్శించడం. లేదా మీ టీచర్లను అడగండి అనడం, మరీ మరీ అడిగితే ఇప్పుడు కాదు, అని విసిగించుకోవడం జరుగుతుంది. ఔనా? మరి మన పిల్లల సందేహాలు మన పిల్లల భవిష్యత్తు ఏమిటి? ఎలా తెలుసుకుంటారు ఆలోచించండి.
కాబట్టి ఇంటిలో అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు ఉన్నట్లయితే మనకు ఈ శ్రమ ఉండదు కదా? మరియు పిల్లలకు తల్లి దగ్గర, నాన్నమ్మ, అమ్మమ్మ దగ్గర ఉండే చనువు, ప్రేమ, విశ్వాసము అపారము అనిర్వచనీ యము. ప్రతీది బిడ్డ తల్లితో చర్చిస్తుంది. తల్లిని అడుగుతుంది. మరియు తల్లులు తన బిడ్డల నడవడి, చేసే పనుల పట్ల తనకు తెలియకుండానే చాలా అప్రమత్తతతో ఉంటారు.