సంస్కార పరిమళం

*సంస్కార పరిమళం*
-----------------------

మనమెలాంటి వారమో మన చుట్టూ ఉన్నవారినీ, మన స్నేహితులనీ మనం పెరిగే వాతావరణాన్నీ, మన పరివారాన్నీ బట్టి అంచనా వేయొచ్చు అనేది నిత్యసత్యం. 

మనం ఏర్పరచుకునే పరిస్థితుల మేరకే మన వ్యక్తిత్వం మంచిగానో, చెడుగానో పరిణమిస్తుంది. వ్యక్తిత్వం నిర్మాణంలో మన వంతు పాత్రతో పాటు మనల్ని పెంచిన వారి సంస్కారం, మనం పెరిగే వాతావరణం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయాన్ని తేటతెల్లం చేస్తుందీ కథ.

పావన నదీ తీరాన ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవిలో ఓ చెట్టుమీద రామచిలుకలు గూళ్ళు కట్టుకొని జీవిస్తున్నాయి. ఒక రామచిలుక తన గూట్లో గుడ్లను జాగ్రత్తగా ఉంచి ఆహారాన్వేషణకై వెళ్ళింది. అంతలో తుపాను మొదలైంది. దాని తాకిడికి ఆ గుడ్లలోంచి ఒకటి కిందపడి దాంట్లోంచి ఒక చిలుకపిల్ల బయటకు వచ్చి ఎగరలేక నిస్సహాయంగా ఉన్న సమయంలో అటుగా వెళ్తున్న వేటగాడి కంట పడింది. వాడు దానిని చేతిలోకి తీసుకొని దీనిని ఇలాగే వదిలేస్తే ఏదైనా పక్షి ముక్కుతో పొడిచి చంపేస్తుంది. కాబట్టి తీసుకెళ్ళి నేనే పెంచుకుంటానని అనుకొని, జాగ్రత్తగా ఆ చిలుక పిల్లను తన బుట్టలో పెట్టుకొని తన గుడిసెకు తీసుకెళ్ళాడు. 

కొంత సేపటికి ఆ తుఫాన్ ఉధృతికి రెండో గుడ్డు గూడు నుండి జారి చెట్టుకు మరొకవైపు పడిపోయింది. ఆ గుడ్డు కూడా పగిలిపోవడంతో ఒక చిలుక పిల్ల బయటికి వచ్చి నిరాదరణతో అల్లాడిపోతుంది. అంతలో అదే దారిన వొస్తున్న ఒక సన్యాసి అప్పుడే పుట్టిన చిలుక పిల్లను చూసి, ఇది ఇలాగే ఉంటే ఇతర పక్షులకు ఆహారం అయిపోతుంది. దీనిని ఆశ్రమానికి తీసుకెళ్ళి పెంచడమే తరుణోపాయం అని భావించి, దాన్ని ఆశ్రమానికి తీసుకెళతాడు. ఒక తల్లికి పుట్టిన రెండు రామచిలుకలు ఒకటి వేటగాడి గుడిసెలో, మరొకటి సన్యాసి ఆశ్రమంలో పెరిగి పెద్దవై రామచిలుకల్లోనే అందమైనవిగా తయారైనాయి. అలా అవి వేటగాడు, సన్యాసి ఆదరణలో పెరుగసాగాయి.

కొంతకాలానికి ఆ అడవికి ఒక రాజు వేట కోసం వచ్చాడు. అది వేసవి కాలం కావడంతో ఎండకు అలసిపోయిన రాజు దారి తప్పిపోతాడు. దాహంతో అలమటిస్తూ నీటి కోసం వెతుకుతుండగా వేటగాడి గుడిసె కనిపిస్తుంది. గుడిసెలోకి వెళ్ళి నీరు అడిగి తాగుదామని వెళితే అక్కడ వేటగాడు లేడు. నీటి కోసం చూస్తుండగా వేటగాడు పెంచుకున్న చిలుక రాజును చూసీ చూడగానే *"ఎవరో దొంగ లోపలికి వచ్చాడు, వీడిని బాగా కొట్టాలని"* అరుస్తుంది.

ఆశ్చర్యపోయిన రాజు ఎందుకొచ్చిన గొడవనుకొని గుడిసె నుంచి బయటకు వచ్చి మరికొంత దూరం వెళతాడు.

అక్కడ ఆశ్రమం కనిపిస్తుందా రాజుకి. ఆశ్రమంలోకి వెళ్ళి చూస్తే అక్కడా సన్యాసి లేడు. లోపలికి వెళ్ళాలా? వద్దా? అని ఆలోచిస్తుండగా రాజును చూసి ఆ ఆశ్రమంలోని చిలుక *"రండి మీకు స్వాగతం, సన్యాసుల వారు బయటకు వెళ్ళారు. మీరు లోపలికి వచ్చి కూర్చొని అక్కడే ఉన్న పళ్ళూ పాలు ఆరగించండని"* అని ఆహ్వానిస్తుంది. ఆ రామచిలుక సంస్కారానికి సంతోషపడిన మహారాజు ప్రశాంతంగా సేద తీరుతాడు.

*వేటగాడు పెంచిన రామచిలుక, సన్యాసి ఆశ్రమంలో పెరిగిన రామచిలుక రెండూ ఒకే తల్లి పిల్లలు. కానీ, అవి పెరిగిన వాతావరణం, పెంచిన వారి అభిప్రాయాలూ, విలువలు పెరిగిన చిలుకల సంస్కారంపై ప్రభావం చూపించాయి.*

అందుకే అంత తారతమ్యం.

*మురికినీరు మురుగు కాలువలో చేరితే అది మురికినీరుగానే ఉండిపోతుంది. అదే గంగానదిలోకి వెళ్తే పవిత్రమవుతుంది.*

తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచిపోషించే విధానంలో సంస్కారానికి పెద్దపీట వేస్తే వారి వ్యక్తిత్వాలే సుసమాజ నిర్మాణంలో మరింత వన్నెలీనుతాయి. "యథారాజా తథా ప్రజా" అన్నట్లు తల్లిదండ్రుల సంస్కారం, వారు కల్పించిన వాతావరణం చెడుకు దూరంగా, మంచికి బాసటగా ఉన్నట్లయితే భావిపౌరులు సుసంస్కారంతో మంచి సమాజానికి కారకులవుతారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది