గెలిచామా.. ఓడామా.. కాదు! పోరాటమే ప్రధానం!!

గెలిచామా.. ఓడామా.. కాదు! పోరాటమే ప్రధానం!!

నీ దేహమే ఒక ఆయుధం అని నిరూపించాడు బ్రూస్‌లీ.
బ్రూస్‌లీ బతికింది 32 ఏళ్లే! కానీ, మార్షల్‌ ఆర్ట్స్‌ వీరుడిలానే కాదు..
ఓ తత్వవేత్తలా బతికాడు. అన్నట్టు.. వచన కవితలూ రాశాడు.

శిల లోపల వెన్న ఉంటుందంటే నమ్మలేం. బ్రూస్‌లీలో ఉన్నదదే. లీ పుట్టింది 1940లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో. తండ్రి హాంగ్‌కాంగ్‌ నివాసస్థుడు. తల్లి జర్మన్‌ సంతతి మహిళ. బ్రూస్‌లీ పుట్టినప్పుడు వృషణాలలో ఒకటి అపసవ్యంగా ఉంది. పైగా ఆరోగ్యం ఎప్పుడూ బాగుండేది కాదు. ఎప్పుడూ ఒక జ్వరంతోనో, జబ్బుతోనో బాధపడుతూ ఉండేవాడు.

బ్రూస్‌లీకి తల్లి.. గ్రేసీ పెట్టిన అసలు పేరు... లీ జున్‌ ఫాన్‌. చైనా భాషలో దీని అర్థం ఆడపిల్ల అని. అమ్మాయిలకు మాదిరి లీకి చెవులు కుట్టించింది. ఆడవేషం వేసి పెంచింది. అసలు బ్రూస్‌లీ తొలిసారి తెరమీద కనిపించింది ఆడపిల్ల వేషంలోనే. ఆ సినిమా పేరు ‘గోల్డెన్‌ గేట్‌ గర్ల్‌’! అప్పుడు లీ వయసు మూడు నెలలు.. బుజ్జిపాపగా బ్రూస్‌ లీ!
                                 *****
అలా పెరిగిన కుర్రాడు.. లేతదనంతో, అమాయకత్వంతో పెరిగిన కుర్రాడు.. శరీర దారుడ్యంలో ‘‘హా.. హా.. హూ.. హూ..’’ అంటూ వేళ్లనూ, చేతులనూ, కాళ్లనూ తిప్పుతూ.. విడుస్తూ.. ముడుస్తూ.. మడుస్తూ.. వదులుతూ.. కిక్‌లు ఇచ్చే వీరుడిగా ఎదగడానికి కారణం.. ఓ సంఘటన.

అప్పటికి బ్రూస్‌లీకి 13 ఏళ్లు.
ఒక రోజు స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా వెనుక నుంచి మీద పడ్డారు ఓ నలుగురు. ఎవరో తెలియదు. కానీ, లీని చిత్తుగా ఉతికి పారేశారు. అసలే బక్కపల్చగా, పీలగా ఉండే లీ.. ఆ దెబ్బలకు తట్టుకోలేకపోయాడు. ఎందుకు కొట్టారో తెలియదు. ఓ వారానికి గాయాలు మాయమయ్యాయి. కానీ, గుండెల్లో గాయం మానేదెలా?
ఆ అవమానమే లీలో కసిని పెంచింది. గుర్తుతెలియని వారు కొడితే.. ఏడుస్తూ కూర్చోకూడదని గట్టిగా అనుకున్నాడు. పిడికిలి బిగించి.. గాల్లోకి జుమ్మని దూసుకుపోయే పంచ్‌లు కొట్టాలన్న పట్టుదల పెంచుకున్నాడు.

ఆ రోజే ‘థామ్‌ చీ చువాన్‌’ అనే యుద్ధ విద్యని నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. 14 ఏళ్ల వయసులో సైపూ ఇప్‌మన్‌ దగ్గర శిష్యుడయ్యాడు. కుంగ్‌ఫూలో ఒక భాగం ‘వింగ్‌ చున్‌’. ఇందులో ఇప్‌మన్‌ని మించినవారు లేరు. మరోవైపు.. తన అన్న పీటర్‌ లీ నుంచి కత్తిసాము నేర్చుకున్నాడు. వెస్టర్న్‌ బాక్సింగ్‌లో ఛాంపియన్‌షిప్‌ పొందాడు. 18 ఏళ్ల వయసులో.. అప్పటికి మూడుసార్లు ఛాంపియన్‌ అయిన గ్యారీ ఎల్మ్స్‌ని మట్టి కరిపించాడు.
ఇదంతా నేర్చుకుంటూనే... ఓ పక్క సినిమాల్లోనూ నటించాడు.
                                        ***

ఓ విద్య తాను నేర్చుకోవడం మామూలే. ఇంకా మెరుగులు దిద్దుకోవాలన్నదీ సాధారణమే. నలుగురికీ దానిని నేర్పాలన్న తపన.. పరిపూర్ణత పొందినవారికే ఉంటుంది. 1965లో బ్రూస్‌లీ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీని స్థాపించాడు. చైనీయులకు మాత్రమే ఆ రోజుల్లో ఇతర అకాడమీలు మార్షల్‌ ఆర్ట్‌ని నేర్పేవి. కానీ, బ్రూస్‌లీ ఏ జాతి వారికైనా నేర్పేవాడు. తాను నేర్చుకున్న కుంగ్‌ఫూ సంపూర్ణం కాదని తెలుసు లీకి. అంతకన్నా మెరుగైన, తనదైన పోరాట కళను సృష్టించాలని అనుకున్నాడు. అమెరికన్‌ బాక్సింగ్‌ని, థామ్‌ కిక్‌ బాక్సింగ్‌ని, చైనీస్‌ కుంగ్‌ ఫూని, జపనీస్‌ కరాటేని.. కలగలిపి కొత్త యుద్ధ విద్యకు ప్రాణం పోశాడు. దాని పేరు ‘జీట్‌ కునె డు’. ఈ మార్షల్‌ ఆర్ట్స్‌ని అందరికీ నేర్పాడు. అంతేకాదు.. ఆ ఆర్ట్స్‌లోని వ్యూహాలను, మెలకువలను వివరిస్తూ ఓ పుస్తకమూ రాశాడు. దటీజ్‌ బ్రూస్‌ లీ.

‘‘నువ్వు నువ్వులా ఉండు. నీ మీద కొండంత నమ్మకంతో ఉండు’’ అంటాడు బ్రూస్‌లీ. అతగాడి ఇంట 2,500 పుస్తకాలు ఉండేవి. పుస్తకాల పిచ్చి అతనికి. జిడ్డు కృష్ణమూర్తి తత్వాన్నీ, టావోయిఇజాన్నీ, బౌద్ధాన్నీ ఆకళింపు చేసుకున్నాడు లీ.
అందుకే ‘‘గెలిచామా.. ఓడామా.. అన్నది మరచిపో! పోరాటం నుంచి మాత్రం పారిపోకు’’ అంటాడు బ్రూస్‌లీ. ‘‘పది వేల కిక్కుల్ని నేర్చుకున్న వ్యక్తి అంటే నాకు భయం లేదు. కానీ, ఒకే ఒక్క కిక్కుని పదివేల సార్లు ప్రాక్టీస్‌ చేసిన వ్యక్తి అంటే నాకు భయం’’ అంటాడు బ్రూస్‌లీ.

1973లో మరణించిన బ్రూస్‌లీ పలికిన చివరి మాట.. ‘‘నువ్వు ఉన్నంత వరకు మరణం నీ వెంటే ఉంటుంది. నువ్వు పోయాక అదీ పోతుంది. భయపడితే దూరం కాదుగా’’!
ఇది నిజం!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది