శ్రీ మన్మహాభారతము - అరణ్యపర్వము - ప్రథమాశ్వాసము





*శ్రీ మన్మహాభారతము*
*అరణ్యపర్వము*

ప్రథమాశ్వాసము
*భాగము-17*

వనపర్వము లేదా అరణ్య పర్వము మహాభారతం ఇతిహాసంలోని మూడవ భాగము. సంస్కృతమూలం వ్యాసుడు రచించాడు. ఆంధ్ర మహాభారతంలో కొంత భాగాన్ని నన్నయ అనువదించాడు. నన్నయ మరణించడం వలన అది అసంపూర్తిగా ఉండిపోయింది. సుమారు 200 యేండ్ల తరువాత అరణ్య పర్వ శేషాన్ని ఎఱ్ఱన తెలుగులోనికి అనువదించాడు.

సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయడం ఈ పర్వంలో ముఖ్య కథాంశం.

ఆ ప్రకారం పాండవులు ఆయుధాలతో ద్రౌపది వెంటరాగా అరణ్వానికి బయలు దేరి ఉత్తర దిక్కుగా పయాణం సాగించారు. వారి వెంట వారి సేవకులు పధ్నాలుగు వేల రథాలతో తరలి వెళ్ళారు. వారి వెంట సుభద్ర, అభిమన్యుడు, ఉపపాండవులు వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూసి పురజనులు " ఎక్కడో ఉన్న పాండవులను పిలిపించి జూదం ఆడించి సర్వస్వం హరించి అడవులకు పంపడం భావ్యమా " అనుకుని కంట తడి పెట్టారు " భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు కౄరులైన దుర్యోదనాదులను ఎందుకు ఆపలేదు? ఇక్కడ ధర్మం ఎక్కడుంది. కనుక మేము మీతో అరణ్యాలకు వస్తాము " అని పౌరులు పాండవుల వెంట బయలు దేరారు. ధర్మరాజు " ఆయ్యలారా మీరు మా పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞులము. మీరు ఈ వన క్లేశం భరించ లేరు. మీరు మా వెంట రా వద్దు మరలి పొండి " అన్నాడు. ధర్మరాజు మన్నించి పౌరులు వెనుకకు మరలి వెళ్ళారు. తరువాత వారు గంగా తీరం చేరారు. కాని వారి వెంట నిత్యాగ్ని హోత్రులు వారి శిష్యులు వచ్చి చేరారు. ధర్మరాజు " బ్రాహ్మణోత్తములారా! మీరు పూజ్యులు. మేము అడవులలో కందమూలములు తింటూ బ్రతకాలి. మీరు మా వెంట కష్ట పడటం ఎందుకు? మరలి వెళ్ళండి " అన్నాడు. అందుకు వారు " అయ్యా మీరు లేక మేము బ్రతుక జాలము మీ వలె మేము కంద మూలాలు తింటూ ఉంటాము. మా ఆహారం మేము సంపాదించుకుంటాము. మీరు లేని హస్థినలో మేము ఉండజాలము " అన్నారు. అది చూసిన ధర్మరాజు దుఃఖిస్తూ " మంచి భోజనం తినే వీరు కందమూలాలను ఎలా తినగలరు? " అన్నాడు.

*శౌనకుడు*

అది విని శౌనకుడు " ధర్మరాజా ! ఇందుకు ఇంత చింతించ తగునా. వివేకులు ఎందుకూ దు॰ఖించరు, వికలురు కారు. ఈ బంధాలు తాత్కాలికాలు కనుక కలత చెందవద్దు. బంధం వలన అభిమానం, అభిమానం వలన కోరిక, కోరిక వలన కోపం, దాని వలన ఆశ పుడతాయి. ఆశ సమస్త దోషాలకు మూలం కనుక ఆశను వదిలి పెట్టు. ధనం మీద కోరిక కలవాడు పతనమౌతాడు. ధనవంతుని చుట్టూ బంధువులు చేరి అతనిని పీడించి ధనాన్ని హరిస్తారు. ధనం వలన గర్వం, అహంకారం, భయం కలుగుతాయి. కనుక ధనార్జనకు పాల్పడ వద్దు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండు " అని హితవు చెప్పాడు. అందుకు ధర్మరాజు " అయ్యా! ధనం నా కోసం కాదు. ఈ బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కదా! వారు మా అతిధులు. గృహస్తుకు అతిధి పూజ పరమ ధర్మం కదా! ఆర్తునకు శయ్య, భయంతో ఉన్నవాడికి శరణు, అలసిన వాడికి ఆసనం కూర్చడం గృహస్తు ధర్మం. తనకోసం మాత్రం వండుకొని తినడం పాపం. కనుక అతిధి సత్కారం చేయడం నా ధర్మం" అన్నాడు. అందుకు శౌనకుడు " ధర్మరాజా! ఇంద్రియాలు సుఖాలను కోరతాయి. ఎంతటి జ్ఞానులకైనా ఇంద్రియాలు లొంగవు. ఇంద్రియ సుఖాలకు లోబడి దేహదారులు సంసార చక్రంలో పడి తిరుగుతుంటారు. కానీ మహనీయులు ప్రేమ, అసూయలను వదలడం, చక్కని చిత్తవృత్తిని అలవరచు కోవడం, ఇంద్రియాలను వశపరచు కోవడం, తనకు నచ్చిన దీక్షను స్వీకరించడం, గురువులను సేవించడం, నియమంగా ఆహారం తినడం, విద్యను అభ్యసించడం, ఫలితం మీద ఆశ లేకుండా పనులు చేయడం అనే నియమాలను ఆచరించే వారు సంసార బంధాలను అధిగమిస్తారు. కనుక ధర్మరాజా నీవు కూడా గురుసేవా, పెద్దలు చెప్పినది వినడం విన్నదానిని అర్ధం చేసుకోవడం . అర్ధం చేసుకున్నదానిని మనసులో నిలుపుకోవడం, అవసరమైన దానిని ఆచరించడం , అవసరం లేనిదానిని వదిలివేయడం వీటిని ఆచరించు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, తపస్సు చేసి ఐశ్వర్యాన్ని పొందారు. కనుక తపస్సు చేసి నీ కోరికలు తీర్చుకో " అన్నాడు. ధర్మరాజు ధౌమ్యుడితో " అయ్యా ! ఇదేమో అడవి. బ్రాహ్మణులు మా మాట వినరు. వీరికి మేము ఆహారం ఎలా సమకూర్చగలను " అని అడిగాడు. ధౌమ్యుడు ధర్మరాజుతో " ధర్మరాజా! జీవకోటికి ఆహారాన్ని నీటిని ప్రసాదించేది సూర్యుడు. కనుక నీవు సూర్యుని ప్రార్ధించి నీ కోరిక నెరవేర్చుకో " అని చెప్పి ధర్మరాజుకు నూట ఎనిమిది ఆదిత్య నామాలు అర్ధంతో సహా ఉపదేశించాడు. ధర్మరాజు నిష్టతో సూర్యుని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి " ధర్మరాజా ! ఈ పన్నెండేళ్ళు అరణ్యవాసంలో మీరు అడవిలో సేకరించిన కంద మూలాలు ఫలాలు మీ భార్య ద్రౌపదిచే వండించిన, అది నాలుగు విధములైన వంటకములుగా ఏర్పడతాయి. అవి ఎప్పటికీ అక్షయంగా ఉంటాయి " అని వరం ఇచ్చి వెళ్ళి పోయాడు.

*హస్థినాపురం*

హస్థినా పురంలో ధృతరాష్ట్రుడు విదురునితో " విదురా పాండవులు ఏమి చేస్తుంటారు " అని అడిగాడు. దానికి విదురుడు " పాండవులు దైవసంభూతులు. జూదం వలన అన్నదమ్ములకు వైరం వస్తుందని చెప్పాను. నీవు విన లేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి వారి రాజ్యం వారికి ఇచ్చి ధర్మం నిలబెట్టు. కర్ణుడు శకుని మాటలు విని చెడు పనులు చేసే నీ కొడుకుని సుయోధనుని విడిచి పెట్టు. ద్రౌపదికి, భీమునికి దుశ్శాశనునితో క్షమాణలు చెప్పించు అన్నాడు. ఆ మాటలకు దృతరాష్ట్రుడికి కోపం వచ్చి " సుయోధనుడు నా కన్న కొడుకు వాడిని నేను ఎలా వదలను. నీకు నాకొడుకులంటే పడదు. వారు ఉన్నతులైతే సహించలేవు. నీ సాయం నాకు అక్కర లేదు. నీవు పాండవుల దగ్గరికే వెళతావో ఇంకెక్కడి వెళతావో నీ ఇష్టం " అన్నాడు. వెంటనే విదురుడు కామ్యక వనంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు తన పెద నాన్న గురించి అడిగాడు. విదురుడు జరిగినది చెప్పాడు. దృతరాష్ట్రునికి విదురుడు పాండవుల వద్ద ఉన్నాడని తెలిసింది. విదురుని విడిచి ఉండ లేక విదురుని కొరకు సంజయుని పంపాడు. సంజయుడు కామ్యకవనం వెళ్ళి విదురునికి నచ్చచెప్పి తీసుకు వచ్చాడు. దృతరాష్ట్రుడు " విదురా ! నీవు నీతి మంతుడవు. నాకు బుద్ధి లేదు. అందుకే నిన్ను వెళ్ళగొట్టాను నన్ను క్షమించు " అన్నాడు. విదురుడు "దృతరాష్ట్రా! నీవు నీ కొడుకులు ధర్మం తప్పి నడుస్తున్నప్పుడు మీకు ధర్మం చెప్పడం నా ధర్మం. మహా పరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు " అన్నాడు. విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడు నచ్చలేదు. కర్ణ, శకుని, దుశ్శాశనులతో చర్చిస్తూ " పాండవుల దగ్గరకు వెళ్ళిన విదురుడు మరల వచ్చాడు. మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు, దృతరాష్ట్రుడు కలసి పాండవులను తిరిగి రమ్మంటే ఏమి చేయాలి? " అన్నాడు. శకుని " సత్య సంధులైన పాండవులు ఎట్టి పరిస్థితిలో తిరిగి రారు. ఆ భయం నీకు వద్దు " అన్నాడు. కర్ణుడు " ఈ అదను చూసుకుని వారి మీద యుద్ధం చేసి వారిని హతమారుస్తాము. శత్రుశేషం లేకుండా చేద్దాం " అన్నాడు. కర్ణుని మాట విని దుర్యోధనుడు సేనలను సమీకరిస్తున్నాడు. పాండవులపై యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. ఇది తెలిసి వ్యాసుడు దృతరాష్ట్రుని వద్దకు వచ్చి " నీ కుమారుడు పాండవుల మీదకు యుద్ధానికి వెళుతున్నాడు. పాండవుల అరణ్య, అజ్ఞాత వాసం తరువాత ఎలాగూ యుద్ధం తప్పదు తొందరెందుకు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " మహత్మా! నన్ను ఏమి చెయ్యమంటారు. జూదం వలన చెడు జరిగింది. నేను పుత్ర వాత్సల్యం వలన నా కొడుకుని విడువలేను " అన్నాడు. వ్యాసుడు " దృతరాష్ట్రా! పుత్ర వాత్సల్యం ఉండవలసిందే కానీ అడవిలో ఉండే పాండవుల మీద దయ చూపించు. నాకు ఇద్దరూ సమానులే. ధర్మరాజు స్నేహంతో నీ కొడుకు సుయోధనుడు మారవచ్చు" అన్నాడు.ధృతరాష్ట్రుడు " అయ్యా! వాడు నా మాట వినడు. మీరే వాడికి నచ్చ చెప్పండి " అన్నాడు. వ్యాసుడు " మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుక్కు నచ్చ చెబుతాడు " అని వెళ్ళి పోయాడు.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది