నెయ్యి శరీరానికి అవసరమా, కాదా? సేవించవచ్చా, సేవించకూడదా? అవసరమైతే ఏ నేతిని వాడాలి?





ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో నెయ్యి శరీరానికి అవసరమా, కాదా? సేవించవచ్చా, సేవించకూడదా? అవసరమైతే ఏ నేతిని వాడాలి?

మనిషి ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే, పోషకవిలువలు ఉన్న ఆహారం, తగురీతిలో వ్యాయామం అత్యంతావశ్యకం. కాలమాన పరిస్థితుల ఎలా ఉన్నా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి హానికరమైన జీవనశైలికి దాసోహం అనడం సరికాదు. నెయ్యి శరీరానికి చాలా అవసరం. నెయ్యికి సంస్కృతంలో ఇతర పర్యాయ పదాలు... ఘృతం, ఆజ్యం, సర్పిః, హవిః, పవిత్ర మొదలగునవి. ఏ జంతువుకి సబంధించిన నేతికైనా సాధారణ గుణధర్మాలు ఈ కింది విధంగా ఉంటాయి.

* సప్తధాతువులకు పుష్టిని కలిగిస్తూ, ఓజస్సును వృద్ధి చేస్తుంది. దేహకాంతి, తేజస్సు, లావణ్యాలను పెంపొందిస్తుంది. కంఠస్వరాన్ని మెరుగుపరుస్తుంది. మేధావర్ధకమై ధారణశక్తిని పెంచుతుంది. ఆయుష్కరం.
* స్నిగ్ధం (జిడ్డుగా ఉంటంది), గురువు (ఆలస్యంగా జీర్ణమై, దేహాన్ని బరువెక్కిస్తుంది), స్వల్పంగా ‘అభిష్యంది’కరం (స్రోతస్సులకు అవరోధం కలిగిస్తుంది), కఫకరం, వాతపిత్తహరం. శీతవీర్యం (చలవచేస్తుంది), విషహరం, కళ్లకు మంచిది, రుచిగా ఉంటుంది. ఆకలిని పెంచుతుంది (దీపనం).
* ఉన్మాదం వంటి మానసిక వికారాలను తగ్గించడంలో ఉపకరిస్తుంది. ఉదరశూల, జ్వరం, కొన్ని చర్మరోగాలను పోగొడుతుంది. కృమిహరం (ఇన్ఫెక్షన్లను హరిస్తుంది).
విశేష గుణాలు : గేదెనెయ్యి, వృష్యం (శుక్రవర్ధకం), కామోత్తేజకం, మేకనెయ్యి దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. గొర్రె నెయ్యి ఎముకలకు పుష్టినిస్తుంది, మూత్ర విసర్జక  వ్యవస్థలో రాళ్లు పెరగకుండా చూస్తుంది.
* ఇక ఆవునెయ్యి (గోఘృతం) అన్నింటిలోనూ శ్రేష్ఠం. వయస్థాపకం (ముసలితనాన్ని దూరం చేస్తుంది). మంచి పరిమళం ఉంటుంది. రసాయనం (శారీరక మానసిక శక్తివర్ధకం).

భావప్రకాశ సంహితలోని శ్లోకం :
‘‘గత్యం ఘృతం... బల్యం, పవిత్ర మాయుష్యం, వయస్థాపకం, రసాయనం ॥
సుగంధం రోచనం చారు సర్వాజ్యేషు గుణాధికం॥‘‘
- పురాణఘృతం (ఒక సంవత్సరం దాటిన నెయ్యి): చాలా వ్యాధులను పోగొడుతుంది. ఉదా: మూర్ఛ, అపస్మారక, ఉన్మాద, తిమిర (కంటి చూపు తగ్గడం), చర్మరోగాలు మొదలైనవి.
- నవీన ఘృతం (కొత్త నెయ్యి) : నీరసాన్ని, పాండురోగాన్ని (అనీమియా), నేత్రరోగాలను తగ్గిస్తుంది.
- బాలురు, వృద్ధులు, ఆకలి తక్కువగా ఉన్నవారు, అజీర్ణం, మలబంధ వికారాలు కలిగి ఉన్నవారు నెయ్యిని చాలా మితంగా సేవించాలి.
గమనిక : నెయ్యి వేడి చేస్తుందనడం అపోహ మాత్రమే. వాస్తవానికి అది చలవచేసి అనేక పిత్త దోష వికారాలను తగ్గిస్తుంది. (ఉదాహరణకు రక్తస్రావం, తలతిరగడం, మంట వంటివి). ఆవు నెయ్యిని ‘మితం’గా ప్రతిరోజూ సేవిస్తూ, తదనుగుణంగా ఏదో రీతిలో ప్రతిరోజూ తగినంత వ్యాయామం చేస్తుంటే, ఎంతో ఆరోగ్యప్రదం.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది