వాట్సప్ ! హేట్సాఫ్ ! హేండ్సప్





వాట్సప్
బొమ్మా - బొరుసు
**********************
అభిప్రాయాలను పంచుకోడానికి
అరచేతిలో అవతరించిన
అద్భుత వ్యవస్థ ! వాట్సప్ !
నీకు హేట్సాఫ్ !

హితులు, సన్నిహితులు
స్నేహితులు, బంధు జనులు
బృందాలుగా ఏర్పడి
బంధాలు నిలబెట్టుకునే
ఆత్మీయ రూపం ! వాట్సప్ !
నీకు హేట్సాఫ్ !

వార్తా విశేషాలను
వర్తమాన సంఘటనలను
రెప్పపాటులో చేరవేసే
సమాచార విహంగం ! వాట్సప్ !
నీకు హేట్సాఫ్ !

చిత్ర విచిత్రాలను
వినూత్న ఆవిష్కరణలను
తాజా ఇమేజులుగా అందించే
సామాజిక మాధ్యమం ! వాట్సప్ !
నీకు హేట్సాఫ్ !

దూరాలను దగ్గర చేస్తూ
సమభావాలు చేరవేస్తూ
వారధిగా మారే సారధి ! వాట్సప్ !
నీకు హేట్సాఫ్ !

శుభోదయంతో  ప్రారంభమై
శుభరాత్రితో  అంత్యమై
అంతులేని సందేశాలను మోసే
అలసటలేని వాయు జీవి ! వాట్సప్ !
నీకు హేట్సాఫ్ !

నిన్ను బొరుసు వైపు చూస్తె  ........

కాలాన్ని హరించి
మతుల్ని పోగొట్టి
బద్దకాన్ని పెంపొందించి
వ్యర్ధ జీవుల్ని తయారుచేసే  వాట్సప్ !
నీకు హేండ్సప్!

వినోదం పేరుతో
భావితరాలను  నాశనం చేసి
విచ్చలవిడి వాడకంతో
బానిసల్ని తయారుచేసే  వాట్సప్ !
నీకు   హేండ్సప్!

అరచేతిలో అతుక్కుపోయి
వేలికొనలతో  నాట్యం చేయించి
వశీకరణ మంత్రంతో
బందీలను చేసే  కరపిశాచి వాట్సప్ !
నీకు హేండ్సప్!

నీవుంటే మాకు ఆనందమే
మేము నీకు దాసోహమే
వదిలేసినా ఆనందమే
మేము నీకు గులామే !

వాట్సప్ ! హేట్సాఫ్ ! హేండ్సప్





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది