* శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ.
అమ్మవారి సౌందర్యాన్ని లలితా సహస్రం మనకు చాలా చక్కగా చూపించింది. మొదట శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ. ఇక్కడ యేరూపమూ లేదు. మాత, రాణి, సింహాసనేశ్వరీ - మూడు విశేషణాలు. మాతా అంటే సృష్టికర్త; రాణి అంటే పాలనకర్త, సింహాసనేశ్వరీ అనగానే లయకర్త. సృష్టిస్థితి లయ కారణమైన ఒక చైతన్యం. ఇందులో మూడు పనులు మారాయి కానీ మారనిది శ్రీ. ఆ చైతన్యమే ఈ మూడు పనులు చేస్తున్నది. ఆ చైతన్యమే "చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా" - చిదగ్ని నుంచి ఆవిర్భవించినది. ఆవిర్భవించిన సౌందర్యాన్ని సగుణ స్వరూపాన్ని లలితా సహస్రం చాలా బాగా వర్ణించింది. "ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా" నుంచి అమ్మరూపమే వర్ణింపబడుతోంది.
కనత్కోటీరమండితా నుంచి శింజాన మణిమంజీర మండితశ్రీ పదాంబుజా వరకు అమ్మయొక్క రూపాన్ని స్కెచ్ వేసి చూపిస్తున్నారు. ఆ ఆవిర్భవించిన ఆ మహాస్వరూపం స్థూలసౌందర్యం అంటారు. మనం దేవతను తలంచుకోగానే ఒక ఆకారం ఒక విగ్రహం మనకి కనిపిస్తుంది. దానిని స్థూల సౌందర్యం అంటారు. ఈ సౌందర్యం తర్వాత మనం దర్శించేది సూక్ష్మ సౌందర్యం. దానిని మంత్రము అంటారు. ఏ మంత్రమున్నదో దేవతా ఆవిర్భవిస్తున్నది. మంత్రం దేవతయొక్క శబ్ద రూపం. మన స్థూల రూపానికి ఆధారమై యున్నది సూక్ష్మమైన మంత్ర రూపం. అటుతర్వాత సూక్ష్మతర రూపం.
ఈ సూక్ష్మతర రూపాన్నే కుండలినీ రూపం అని చెప్తారు. అదేవిధంగా అమ్మ రూపవర్ణన చేశాక అమ్మ లీల వర్ణించి భండాసుర సంహారాన్ని
"శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా,
కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ;
శక్తి కూటైక తాపన్న కట్యధోభాగధారిణీ;
మూలమంత్రాత్మికా మూలకూటత్రయ కళేబరా"
ఈ మొత్తం నామాలు కూడా అమ్మయొక్క సూక్ష్మరూపాన్ని చూపిస్తున్నాయి. అంటే మంత్రం దేవత ఎలా అవుతుంది? పంచదశీ మంత్రం మూడు కూటములతో కూడుకొన్నది. వాగ్భవ కూటం, కామరాజ కూటం, శక్తి కూటం. వాగ్భవ కూటం ముఖంలో, కామరాజకూటం కంఠంనుంచి కటివరకు, కటినుంచి పాదముల వరకు శక్తి కూటం. కనుక దేవత వెనకాల ఉండే సూక్ష్మరూపం మంత్రం. సూక్ష్మం అంటే మన కంటికి, స్థూలదృష్టికి గోచరించదు.
ప్రతివాడికీ బండగా కనిపించేది బయట రూపం. మనకు శరీరం కనిపిస్తోంది. దానిలోపల ఉన్న ప్రాణం గోచరించేది కాదు. ప్రాణం లేనిదే శరీరం లేదు. అలాగే దేవతాకృతికి వెనక ఉండే సూక్ష్మరూపం మంత్రం. అంటే మనం చూసే విగ్రహం వట్టి విగ్రహం కాదు. దాని వెనకాల మంత్రమున్నది. దాని వెనకాల ’కుళామృతైకరసికా కుల సంకేత పాలినీ, కులాంగనా కుళాంతస్థా కౌళినీ కులయోగినీ, అకులా సమయాంతస్థా సమయాచారతత్పరా; అని వర్ణించారే మూలాధారాంబుజా రూఢా - ఆ కుండలినీ స్వరూపం యేదైతే ఉందో అంటే సర్వప్రాణులయందు ప్రసరించే ప్రాణశక్తి స్వరూపం.
ప్రాణశక్తి స్వరూపమే అమ్మవారియొక్క సూక్ష్మతర రూపం. ఇది సూక్ష్మతర సౌందర్యం. సౌందర్యలహరి ఎన్నివిధాల ఉందో చూడండి. ఒక మహా సౌందర్యాన్ని మామూలు మానవుడు కూడా లోపలికి వెళ్ళిన వెంటనే నమస్కరించాలి అనే ఒక మహా సౌందర్యం మనకు కనిపించిందిక్కడ. ఆజగజ్జనని, ఆ లావణ్యం లలితా అంటేనే లావణ్యం; ఆ లావణ్యమంతా అక్కడ చూపిస్తే అమ్మా అని నమస్కరించావు. కానీ దాని వెనుక సూక్ష్మరూపమైన మంత్రము, సూక్ష్మతరరూపమైన కుండలినీ ఉన్నాయి.
వీటి వెనుక ఉన్నది సూక్ష్మతమ రూపం. ఆ రూపాన్ని లలితా సహస్రం "నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా" నిరాకారా - ఇక్కడ ఆకారం చూపిస్తుంటే నిరాకారం అంటారేంటి? అది సూక్ష్మతమ సౌందర్యం. ఆ సౌందర్యంలో "నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ, నిస్సంశయా సంశయఘ్నీ ..." ఇవన్నీ నిశ్శబ్దాలు. నిః అనే శబ్దంతో మొదలయ్యే నామాలు. ఇదీ అమ్మవారి సూక్ష్మతమరూపం. ఇలా లలితా సహస్రం స్థూల సౌందర్యం నుంచి సూక్ష్మతమ సౌందర్యం వరకు చూపించింది.