మాంధాతృ వంశ వర్ణనము-శ్రీ విష్ణు పురాణము
🌺🌺🌼🌼🌸🌸🌼🌼🌺🌺
Part 26
"ఇప్పుడు మాంధాత సంతతిని గురించి వినుము! ఈ చక్రవర్తి తనయుడే అంబరీషుడు. ఇతని పుత్రుడు యువనాశ్వుడు. అతనికి ఉదయించిన వాడు హరితుడు. అతని పేరనే అంగిరసులు హారీతులను ప్రసిద్ధి చెందారు.
పాతాళంలో 6 కోట్లమంది గంధర్వులు (కశ్యపముని, అతని పత్ని, వారి సంతానం - మౌనేయులు) ఉన్నారు. వారు నాగకులాధిపత్యాన్ని కూడా స్వాధీనపరచుకోవడంతో నాగులు విష్ణుని శరణువేడారు. నిద్రిస్తూన్న విష్ణు భగవానుని స్తుతులతో మేల్కొలిపి తమకొచ్చిన ఆపద, భీతిచే విన్నవించుకున్నారు.
అద్యంతాలు లేనివాడు, పురుషోత్తముడు అయిన భగవానుడిలా సెలవిచ్చాడు - "నేను మాంధాతృసుతుడైన పురుకుత్సుని రూపంలో గంధర్వ గణాలను అంతమొందిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి" అన్నాడు. అభయాన్ని ప్రసాదించాడు.
నాగేంద్రులు తిరిగి నాగలోకానికి వచ్చి, పురుకుత్సుని ప్రేరేపించడానికి నర్మదా నదిని సహాయం అర్థించారు. నర్మద పురుకుత్సుని పాతాళానికి తీసుకెళ్లింది.
పురుకుత్సుడు పాతాళానికి వెళ్లి, భగవత్తేజంచేత వృద్ధిపొందింపబడిన వజ్రదేహుడై గంధర్వుల మదమణచి సర్పరాజుల రత్నాలు తిరిగి వారు పొందేలా చేశాడు. తమకింత సహాయం చేసిన నర్మదా నదిని నాగరాజులు స్తుతించి, నర్మదను స్మరించిన వారికి సర్పవిషభయం కలగదని వరం ఇచ్చారు.
అట్లే - తమకింత సాయం చేసిన పురుకుత్సునికి ఎన్నడూ సంతతి విచ్చేదం కలగకుండేలా నాగులు వరం ఇచ్చారు. పురుకుత్సునికి నర్మద వల్ల త్రసదస్యుడు, అతనికి అనరణ్యుడు జన్మించారు. అతనికి పృషదశ్వుడు, అతనికి హర్యశ్వుడు కలిగారు. హర్యశునికి హస్తుడు జన్మించాడు. హస్తునికి సుమనుడు - త్రిధన్వుడు - త్రయ్యారుణి - సత్యవ్రతుడు జన్మించారు. ఈ సత్యవ్రతునికే కొంతకాలం చండాలత్వం ప్రాప్తించడం - త్రిశంకుడనే పేరిట కల్పిత స్వర్గంలో వ్రేలాడటం ఇతనికే జరిగిన ఘటనలు.
ఈ సత్యవ్రతుని (త్రిశంకుని) కొడుకే హరిశ్చంద్రుడు. ఇతని సత్యనిష్ఠ జగద్విదితం. పురుకుత్స వంశం అవిచ్చన్నంగా విస్రరిల్లగలదని నాగులు ఇచ్చిన వరం వల్ల ఇతని పుత్రుడైన లోహితాశ్వుడు (మాయ) పాముకాటువల్ల బాల్యంలో మృతిచెందినా, దేవతల వల్ల తిరిగి బ్రతికాడు.
లోహితాశ్వునికి హరితుడు, విజయుడు అనే ఇద్దరు పుత్రులు. హరితుడుకి చంచువు అనే పుత్రుడు. చంచువుకు వసుదేవుడు అనే పుత్రుడు.
విజయునికి రురుకుడు అనే పుత్రుడు. రురుకునికి వృకుడు అనే పుత్రుడు. వృకునికి బాహువు అనే పుత్రుడు. బాహువునికి సగర చక్రవర్తి...ఇలా ఈ వంశం విస్తరించింది. సగరుడు అనగా విషముతో కూడ గర్భంనుంచి బైటపడిన వాడు అని అర్థం. ఔర్వమహర్షి ఆశ్రమంలోన పెరిగిన ఈ బాలుడు వేదశాస్త్రాలతోపాటు భార్గవమనే ఆగ్నేయాస్త్రాన్ని ఆ మహర్షి వద్ద నుండి పొందాడు.