శకుంతల, దుష్యంతుల వివాహం

ఆదిపర్వము – 17
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
శకుంతల, దుష్యంతుల వివాహం
శకుంతల తాను విశ్వామిత్రుని కూతురు అని చెప్పగానే దుష్యంతునికి ఆమె మీద మనసు కలిగింది. విశ్వామిత్రుడు క్షత్రియుడు. కాబట్టి శకుంతల క్షత్రియ కన్య.
దుష్యంతుడు శకుంతలను చూసి "ఓ కోమలీ, నీవు అతిలోక సౌందర్యవతివి. నీవు ఈ నార చీరలు కట్టుకొని ఆశ్రమవాసం చెయ్య తగవు. నీవు అందమైన రాజ సౌధములలో, రాజ్య సంపదలు అనుభవింప వలసిన దానవు. నాకు నీ మీద ప్రేమ కలిగింది. నిన్ను ఎనిమిది రకాలైన వివాహ విధులలో ఒకటైన గాంధర్వ విధిప్రకారం వివాహం చేసుకుంటాను" అని అన్నాడు.
వివాహ విధులు ఎనిమిది రకాలు, అవి
1. బ్రాహ్మము
ఇందులో ఒకే కులానికి చెందిన అబ్బాయి, అమ్మాయికి వివాహం చేస్తారు. ఎటువంటి కట్నకానుకలు ఉండవు. కన్యాదానం ముఖ్యమైన ఆచారం.
2. దైవము
ఇందులో కూడా ఎటువంటి ఆడంబరాలు ఉండవు. సేవా సంస్తలు నిర్వహించే సామూహిక వివాహాలను ఉదాహారణగా చెప్పుకోవచ్చు. పేద వాల్ల కోసం జరిగే వివాహ విధానం.
3.ఆర్షము
ఇందులో వరుడి తల్లితండ్రులు వధువు తల్లితండ్రులకు కన్యా శుల్కం చెల్లిస్తారు.
4. గాంధర్వము
అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడి, కుటుంబ ప్రమేయం లేకుండా చేసుకునే పెళ్లి.
5. ఆసురము
అమ్మాయికి తగిన వరుడు కాకపోయినా, అమ్మాయి తల్లితండ్రులకు కన్యాశుల్కం చెల్లించి చేసుకునె పెళ్లి.
6. రాక్షసము
అమ్మాయికి ఇష్టం ఉండి, ఆమె తల్లితండ్రులు పెళ్లికి ఒప్పుకోనప్పుడు, అమ్మాయిని తీసుకెళ్ళి చేసుకునే పెళ్లి
7. ప్రాజపత్యము
వధూవరులు ఇద్దరూ చిన్నవారైనప్పుడు, వధువు తండ్రి, వరుని తండ్రికి వధువుని బహుమతిగా ఇస్తాడు.
8. పైశాచము
అమ్మాయికి ఇష్టంలేకపోయినా, అమ్మాయికి స్పృహలేని సమయంలో చేసి, బలవంతంగా పెళ్లి చేసుకోవడం.
"మహారాజా, నా తండ్రి ఆశ్రమములో లేరు వారు వచ్చి కన్యాదానము చేసిన నన్ను మీరు స్వీకరించవచ్చును" అని చెప్పింది.
"కోమలీ, గాంధర్వమునకు పెద్దల అనుమతి తోనూ, మంత్ర తంత్రములతో పని లేదు. అత్యంత రహస్యంగ జరిగేదే గాంధర్వము" అని ఆమెకు చెప్పి ఒప్పించాడు.
"దుష్యంత మహారాజా, నేను నిన్ను వివాహమాడిన, మనకు పుట్టబోయే పుత్రునినీ సువుశాల సామ్రాజ్యానికి మహారాజును చెయ్యడానికి తమరు అంగీకరించిన, నేను ఈ వివాహమునకు ఒప్పుకొందును" అని శకుంతల చెప్పింది.
దానికి దుష్యంతుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. శకుంతలా దుష్యంతులకు గాంధర్వ విధిన వివాహం జరిగింది. దుష్యంతుడు ఆమెతో కామ సుఖాలను అనుభవించాడు.
"శకుంతలా, నేను వెళ్లి నిన్ను సగౌరవంగా రాజధానికి తీసుకురావడానికి నా మంత్రులను పంపిస్తాను" అని శకుంతలను ఒప్పించి దుష్యంతుడు వెళ్లి పోయాడు.
ఈ విషయం తెలిస్తే తన తండ్రి కణ్వుడు కోపగిస్తాడేమో అని శకుంతల భయపడుతూ ఉంది.
కణ్వమహర్షి ఆశ్రమానికి వచ్చాడు. శకుంతలలో కనపడుతున్న సిగ్గు, హావ భావాలు చిత్రంగా కనపడ్డాయి. తన దివ్యదృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకున్నాడు.
శకుంతలను చూసి "అమ్మా, గాంధర్వ వివాహము శాస్త్ర సమ్మతమే. నీకు తగిన భర్తనే ఎన్నుకున్నావు. గర్భాదానం కూడా జరిగింది. నీకు పుట్టబోయే పుత్రుడు ఈ సువిశాల భరత సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు" అని దేవించి "అమ్మ శకుంతలా, నీవు కోరిన వరం ఇస్తాను కొరుకోమ్మా" అన్నాడు.
శకుంతల తండ్రికి నమస్కరించి "తండ్రీ, నా మనసు ఎప్పుడూ ధర్మం తప్పకుండా ఉండాలి. నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి ఉండాలి. మహాబలవంతుడై ఉండాలి. మంచి యశోవంతుడు కావాలి" అని అడిగింది.
ఆమె కోరినట్టుగా ఆమెకు వరాన్ని ప్రసాదించాడు కణ్వుడు. ఆమెకు చక్రవర్తి లక్షణాలతో భరతుడు జన్మించాడు.
భరతుడు మహాబలవంతుడు. చిన్నప్పుడే, అడవిలో ఉండే పులులను సింహాలను, ఏనుగులను పట్టి తెచ్చి చెట్లకు కట్టేసేవాడు. ఏనుగులపైన స్వారీ చేసేవాడు. అతని చేష్టలను చూసి ఆశ్రమంలో ఉన్న మునులు అతనికి "సర్వదముడు" అని పేరు పెట్టారు.
ఒకరోజు కణ్వ మహాముని శకుంతలను చూసి "అమ్మా శకుంతలా, ఆడపిల్ల పుట్టిన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండటం క్షేమం కాదు. పెండ్లి అయిన ఆడపిల్ల భర్త దగ్గర ఉండటమే ధర్మం. కాబట్టి నీవు నీ భర్త దుష్యంతుని వద్దకు వెళ్లు" అని చెప్పి తన శిష్యులను తోడు ఇచ్చి శకుంతలను దుష్యంత మహారాజు వద్దకు పంపాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది