గోవర్ధనగిరి యజ్ఞం-శ్రీ విష్ణు పురాణము
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Part 14
రేపల్లెలో బలరామకృష్ణులు ఇలా విహారాలు సల్పుతూండగా వర్ష ఋతు వెళ్లిపోయి శరదృతువు ప్రవేశించింది. చేపలు తాపాన్నిపొందగా, మయూరములు యోగుల్లా మౌనంపూనాయి.
కారుమేఘాలు స్వచ్చంగా జ్ఞానుల్లా తెలుపురంగును పొందాయి. (శ్లేష) శరత్కాలభానుని వేడిచేత సరస్సులు ఎండాయి. సరస్సులు జ్ఞానుల మనస్సువలె యోగ్యతాలక్షణాన్ని పొందాయి.
నక్షత్రాల చేత విమలమైన ఆకాశంలో పూర్ణిమనాటి చంద్రుడు చరమదేహాత్ముడైన పూర్ణయోగిలా ప్రకాశించసాగాడు.
సరస్సులోని నీళ్లు మొదట పూరకం, తదుపరి కుంభకం, ఆపైన రేచకములనే ప్రాణామాయ సాధన చేస్తున్నవా అన్నట్లున్నాయి. అంటే మొదట వర్షఋతువులో నీటిని నిండించుకుని, తదుపరి ఆ నీటిని తమలో ఇంకించుకుని శరదృతువులో రేచకం వలె తగ్గుతున్నాయని పోలిక.
ఆకాశం, తారకలు విమలము అయిన శరత్కాలం రాగా రేపల్లెలో ఇంద్రుని ఆరాధించే ఉత్సవసంబరాలు మొదలయ్యాయి. ప్రజలు చేస్తూన్న సన్నాహాలు చూచి, ఇంద్రోత్సవమేమిటని అడిగాడు కృష్ణుడు.
"శతక్రతువైన ఇంద్రుడు మేఘాలకు - నీటికి ప్రభువు కుమారా! అతని ప్రేరణవల్లనే మేఘాలు వర్షిస్తాయి. వాటివల్లనే కదా మనకు పంటపండేది. మన పాడి ఆవులకు గడ్డిలభించేది. వీటన్నిటికీ హేతువైన ఆ ఇంద్రుడిచ్చే వర్షం ఆధారం. కనుకనే రాజులు యజ్ఞాలచేత, మనం ఉత్సవాలచేత సురాధిపతి అయిన ఇంద్రుడ్ని అర్చిస్తాము. మేఘాలు జనావాసాలున్న చోట సస్యవృద్ధికి అనుకులంగా కురిపించేది శక్రుడే -" అని చెప్పాడు నందుడు.
కృష్ణునికీ మాటలు రోషాన్ని తెప్పించగా, ఇలా అన్నాడు.
"ఏమితండ్రీ! ఏమిది? మనం మడిదున్నే కర్షకులం కాము. వర్తక వాణిజ్యాలు చేసే వ్యాపర జీవులం అంతకంటేకాము. మనం వనాల్లో తిరిగేవాళ్లం! మనకు గోవులేదైవం. ఆన్వీక్షకి (తర్కం), త్రయి, వార్త, దండనీతి (అర్థశాస్త్రం) అనేవి నాల్గువిద్యలు. వీటిలో మనకు మాత్రం వర్తించేది వార్త. భూమి దున్నడం అనేది వ్యవసాయకుల వృత్తి. (కృషి) క్రయ - విక్రయాలు జరిపే (పణ్యజీవుల) వృత్తిని చేపట్టేవారు వణిజులు. కనుక ఎవరు ఏవిద్యతో సంబంధంగలవారో దాన్నే పూజించడం శ్రేయస్కరం. కృషికి అవథి పొలిమేర. దానికి అవథి వనం. దానికి హద్దు గిరులు. కనుక - ఆ గిరులన్నీ మనకు పరమగతి. ఈ వనాలు - గిరులు కామ రూపాన్ని ధరిస్తాయని వింటున్నాము. వాటిపట్ల అపచారం చేయకూడదు. అలాచేస్తే అవి తమ తమ అడవుల్లో నివశించే వారిని సింహాది రూపాలతో తుదముట్టిస్తాయి. కనుక మనం చేయదగినది ఇంద్రయజ్ఞమో - వరుణ సంబరమోకాదు. మనకు పూజనీయమైన గోయజ్ఞమో గిరిసంబరమో జరుపుకోవాలి.
మంత్రప్రకాశితమైన దేవతాయజ్ఞంలో దీక్షితులు బ్రాహ్మణులు. నాగలితో దున్నే యజ్ఞం కర్షకులు చేయదగ్గది. కొండల్లోన - వనాలలోన ఉండే మనం గోయజ్ఞం చెయాలి. గోవు సర్వదేవతలకు నిలయం. ఇక - గిరులలో గోవర్థన శైలం అతిశ్రేష్ఠం! కనుక అది పూజనీయం!
ఇక పెక్కు ఆలోచనలు అనవసరం. రేపల్లెలోని సమస్తవస్తుసామాగ్రిని తెచ్చి, అర్చన, బోజనాదులు గావించండి. హోమాలూ - ద్విజ సంతర్పణలూ చేయండి. శరత్కాలంలో పూచే పూలను గోవులకు అలంకరించండి. వాటిని అర్చించండి! ఇది ఆచరించినట్లయితే గోవులకు - నాకు ప్రీతికరం" అని చెప్పాడు వాసుదేవుడు.
నందవ్రజంలోని వాళ్లందరికీ ఈ మాటలు బాగా నచ్చాయి. అవునంటే అవునని గిరియజ్ఞం చేయడానికి సంసిద్ధులై, అలాగే చేశారు. ద్విజసంతర్పణం గావించారు. గో - వృషభసమూహాల చేత గిరిప్రదక్షిణం జరిపించారు. ఆ కొండవద్దనే కృష్ణుడు నిలిచి, నేనే గోవర్థన గిరినంటూ గోపశ్రేష్ఠులు తెచ్చినవన్నీ నిండుగా ఆరగించాడు. మరోవైపు మానుషరూపంలో తానూ గిరియజ్ఞం నిర్వర్తించిన వారితో పాటు, (యజ్ఞకర్తలతో గూడ) పాల్గొన్నాడు. ఆ లీలామానుషధారికి ఏది అసాధ్యం? అందరు సంతృప్తిగా ఈ గోవర్థనశైల యజ్ఞాన్ని చేసి, సంతుష్టాంతరంగులై రేపల్లెకు తిరిగివచ్చారు.
ఇంద్రునికి ఈ చర్యలు అమితమైన ఆగ్రహాన్ని కలిగించాయి. తన అదుపాజ్ఞలలో ఉన్న మేఘాలన్నిటినీ రప్పించి "సంవర్తక మేఘాల్లారా! అక్కడ గోకులంలో గోపకులంతా దుర్బుద్ధితో కృష్ణుడు చెప్పినట్లు గిరియజ్ఞం చేశారు. ఇంతకాలంగా మనలను అర్చిస్తూ వచ్చినవారు కనీసం మనను తలవనైనా లేదు. ఏ గోవుల్నయితే వారు జీవనాధారంగా భావిస్తున్నారో వాటిని అధికవర్షం చేత బాధించండి. నేను కూడ వాయు - జల ఉపద్రవాలతో మీకు సహాయంగా నిలుస్తాను" అనేసరికి, ఇంద్రాజ్ఞ చేత మేఘాలు ఆ ప్రకారమే ప్రవర్తించాయి. గో - గోపి - గోపాల సంఘమంతా ఈ అకారణ ఉపద్రవానికి తల్లడిల్లింది. 'కృష్ణా! ఇది ఆ ఇంద్రుని దెబ్బే! సందేహంలేదు. తనను అలక్ష్యం చేశామని కోపగించుకున్నాడు. నీవే రక్ష' అని వేడుకున్న ఆ గోకులాన్నంతటినీ గోవర్థన గిరిని కేవలం తన అరచేత ఎత్తిపట్టి "మీరు అందరూ ఈ గిరి క్రిందకు రండి! గొడుగువలె ఇది ఎంత మందినైనా సరే కాపాడగలదు" అని యాదవులందరినీ రక్షించాడు శ్రీకృష్ణుడు.
ఏడురాత్రులు ఏకరాత్రిగ చేసి కుండపోతగా కురిసిన ఆ వర్షానికి గోపాలకులను బాధించడం వశం కాలేదు. మేఘాలన్నీ వట్టిపోయాయి. ఇంద్రునికీ, శ్రీకృష్ణుని మహిమ అర్థమై సాక్షాత్ విష్ణుడని గ్రహించి తన మేఘాలను వెనక్కురప్పించగా, గోవర్థనగిరిని యథాస్థానంలో విడిచాడు కృష్ణుడు.
ఇంద్రునిచే గోవిందునికి పట్టాభిషేకం
"యాగభంగం చేసినందుకు ఈర్ష్యపడి, నీపై ఆగ్రహమూని గోపాలురను బాధించాను. నా తప్పిదం మన్నించు! నిన్ను గోకులానికి ప్రతినిధిగా అభిషేకించ వచ్చాను" అని ఇంద్రుడే స్వయంగా దిగివచ్చి, సకల గోపాలుర సమక్షమున 'గోవిందుడని' పిలిచి అభిషేకించాడు.
తన అంశన అర్జునుడు భూలోకంలో అవతరించాడని - అతడ్ని కాపాడవలసిందని కోరి ఇంద్రుడు చెప్పగా 'మహాభారతయుద్ధం జరిగేకాలంలో ఈ భూభారం చాలా భాగం తగ్గనున్నది. అందుకు అర్జునుని నేను రక్షించవలసి ఉన్నది' అని అభయం ఇచ్చి ఇంద్రుని పంపించేశాడు శ్రీకృష్ణుడు.
కృష్ణుడు దేవుడో, యక్షుడో, గంధర్వుడో అయి ఉండాలి. లేకుంటే మానవ మాత్రులకు సాధ్యంకాని ఇన్ని మహిమలెలా చూపుతాడు? అనుకుంటూ అంతలోనే ఆ విమర్శకు చింతిస్తూ "ఏమయితేనేం? మాలో ఒకడివి! మాకు బంధువువు. నీకు వందన" అని గోపాలకులు ప్రస్తుతించారు.
అనంతరం కృష్ణుడు గోపికలతో రమించాలని మనసుపడ్డాడు. గోపికలా మురళీమోహనుని చేరుకున్నారు. గోవిందునికి అందరానిది ఉందా?