ఫణిరాజు కాళీయ మర్దనం-శ్రీ విష్ణు పురాణము

ఫణిరాజు కాళీయ మర్దనం-శ్రీ విష్ణు పురాణము
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Part 15

ఒకసారి బలరాముడు తోడులేకుండా, శ్రీకృష్ణుడొక్కడే బృందావనంలోకి వెళ్లాడు. అక్కడకు దగ్గర్లోనే ఉంది కాళింది అనే మడుగు. కెరటాలతో ఒడ్డుల్ని ఒరుసుకుని అందులో నీరు పుష్కలంగా ఉంది.

అందులో మహాదుష్టుడైన కాళీయుడనే ఫణిరాజున్నాడు. దప్పికగొన్న వారికీ సర్ప భయం వల్ల దాహంతీరక నిరుపయోగంగా ఉంది. శ్రీకృష్ణు డా సంగతి గుర్తించి, మడుగులో దూకి ఆ ఫణిరాజు పని పట్టాడు.

గోపబాలురది చూసి, గబగబ పరుగెత్తుకుని వెళ్లి, యశోదాది తల్లులందర్నీ పిలుచుకొని వచ్చేలోగా, ఆ ఫణిరాజు పడగలపై నాట్యం చేస్తూ అతడిని వశంచేసుకున్నాడు శ్రీకృష్ణుడు.

కృష్ణుని పాదాల తాకిడిచేత కాళీయుని తలప్రాణాలు తోకకువచ్చాయి. ఆ బాగుని పడగలపై కృష్ణుడు నర్తించడంతో అతడు మూర్ఛిల్లే స్థితిలో పడ్డాడు. కాని, గోపబాలకుల పిలుపులవల్ల ఆ మడుగుదగ్గరకు పరుగున చేరుకున్న గోపికలు, యశోద "అయ్యో! ఎక్కడ - ఎక్కడ కృష్ణుడు" అని అడుగులు తడబడ అందరూ ఆ మడుగును చుట్టుముట్టారు.

నందుడు మొదలగు గోపాలకులంతా సర్పరాజు పాము పడగలమీద నాట్యంచేస్తూన్న కృష్ణూని వంక నిశ్చేష్టులై బిక్కముఖాలతో చూడసాగారు. గోపికలు ఒకరితో ఒకరు ఇలా అనుకుంటున్నారు...

యశోదతోకూడ అందరం ఈ కాళీయుని మడుగులో దిగుదాం. ఇక రేపల్లెకు ఏం వెళ్తాం? కృష్ణుడు లేని గోకులంలో సంచరించగలమా? వికసంచిన తామరపూవురేకుల్లా ఉండే ఆ మహత్త్వపూర్ణ బాలుని కన్నులు చూడక, దీనంగా ఆ కళ లేని గృహాల్లో మనం ఉండగలమా? మధుర మధురంగా సంభాషించే తన పలుకులతో ఆకట్టుకొనే ముద్దుమోముగల చిన్ని కృష్ణునిక్కడ వదలి నందగోకులంలో ఎలా ఉండగలం? అని, ఈ విధంగా పలవరిస్తూన్న ఆ గోపకాంతల పలుకులు విన్నాడు బలరాముడు. దిగులుగా తనవైపే చూపులు నిలిపి చూస్తూన్న గోపాలకులను - మూర్చపోతూ, అంతలోనే తెలివివచ్చి పలవరిస్తున్న యశోదను సాభిప్రాయంగా చూశాడు. కృష్ణుని మహిమను గుర్తుపట్టిన వాడు కావడం వల్ల "ఏమిటిది దేవా? ఈ మానుషవర్తనమింతగా నటింతువేమి? నీ అంశమున నీకు అన్నగా పుట్టినవాడను! నా మాటవిను! ఇక్కడ అవతరించిన మనకు చుట్టాలు ఈ గోపీగోపకులేకదా! వారిని ఇంకా బాధింతువా? నీవు హరివి. మాయా మానుష భావముతో బాల్యచేష్టలూ కలగలిపి చూపుతున్నావా? చాలునిక" అని కేవలం శ్రీకృష్ణుని తన చూపులతోనే హెచ్చరించాడు.

ఆ విధంగా, బలరాముని హృదయగత స్తోత్రాన్ని - అతడట్లు చేసిన జ్ఞప్తిని మన్నించి, కృష్ణుడా కాళీయుని తన బంధంనుంచి విముక్తం చేయదలచి, ఆ ఫణిరాజు పడగలను వంచి చేస్తూన్న నాట్యానికి అతడు మూర్చపోతూండగా, రక్తంగ్రక్కుకొంటూండగా, వాని భార్యలు బాలరూపుడైన శ్రీహరిని వేడుకుని కరుణ చూపమని ప్రార్థించేసరికి, కొంత మెత్తబడ్డాడు శ్రీకృష్ణుడు.

'దేవేశుడవు, జ్ఞానతేజోమూర్తివి. పురుషోత్తముడవు, పరంజ్యోతివి, అనన్యభవుడవు, వేల్పులే నిన్ను స్తుతింప సమర్థులు కారు. అట్టి నీవంటి స్వరూపాన్ని నా వంటి సామాన్యురాలు ఎలా స్తుతించగలదు? ఓ స్థితికర్తా! నీకు నమస్కృతులు. నీవు జగదాధారుడవు. ఇతడు మరణించేస్థితికి చేరుకున్నాడు. దయచేసి మాకు పతిబిక్ష పెట్టు! వేదాంతవేద్యా! ఇక మాపై దయతలుచు' అని వేడుకున్నారా నాగపత్నులు.

తదుపరి కాళీయుడు కూడా, కృష్ణుని ప్రార్థించడంతో పాటు స్తోత్రం కూడా చేసినవాడై 'నా విషాన్ని - వీర్యాన్ని కూడా హరించిన హరిరూపుడా! దయచేసి ప్రాణాలనైనా నాకు ప్రసాదించు' అని వినతిచేయగా 'నీవు సబాంధవంగా సముద్రంలోనికి పోయి అక్కడ నివశించు! నీ తలమీద గల నా పాదచిహ్నాలను చూడటం వల్ల గరుడుడైనా గాని నీకు హాని తలపెట్టడు' అని ఆ ఫణిరాజును విడిచిపుచ్చాడు. ఆ తరువాత, అందరూ కలిసి, గొప్ప ఆపద తప్పిందని ఒకరికొకరు చెప్పుకుంటూ వ్రజభూమికి విచ్చేశారు.

ధేనుకాసుర - ప్రలంబాసుర వథ:

బలరామకృష్ణులు ఒకరోజు బృందావనంలో ఉన్న తాళవనానికి వెళ్ళారు. అక్కడ ధేనుకుడనే రాక్షసుడు గార్దభరూపంలో మృగమాంసాలు తింటూ గడుపుతున్నాడు. తాటిపండ్లు మిగలపండి, చుట్టుప్రక్కల చాలా దూరం వాసనలు వెదజలుతూండడంతో, వాటిని గోపాలకులు తినాలని వేడుకపడ్డారు.

వెంటనే బలరామకృష్ణులు తాటిపండ్లు రాల్చే సన్నాహాల్లో ఉండగా, ఒకప్పుడు కంసుడిచ్చిన ఆజ్ఞమేరకు 'బలశాలురైన బాలురను హతమార్చడానికి సిద్ధంగా ఉన్న' వారిలో ఒకడైన ఈ ధేనుకాసురుడు తన గాడిదరూపుతోనే వెనుకకాళ్ళు బలంగా తాటించుకుంటూ వచ్చి బలరామకృష్ణుల గుండెలపై తన్న బోయాడు. వాడిని రక్కసునిగా గుర్తించిన శ్రీకృష్ణుడు, తన రెండు చేతులా, వాడివెనుక కాళ్ళు అందిపుచ్చుకుని గిరగిరత్రిప్పి బలంగా నేలకేసి కొట్టడంతో వాడు హతుడై, తన నిజరూపంతో అక్కడ పడ్డాడు. వాడ్ని తిప్పుతూన్నప్పుడు కలిగిన తాకిడికి విశేషంగా తాటిపళ్లు రాలడంతో గోపాలురకు గొప్ప విందు అందింది. గోవులకు కూడ రక్కసుల బెడద తప్పింది.

దూడ పలుపులను మూపునవేసుకుని, లేగలను అదలిస్తూ తిరుగుతూన్న బలరాములు రకరకాల బాల్యక్రీడాసక్తులయ్యారు. ఒకసారి 'హరిణక్రిడనం' అనే ఆట ఆడుతూండగా, కంసునిచే నియమితుడైన ప్రలంబాసురుడు, శ్రీకృష్ణ - బలరాములే గొప్ప ప్రతిభాశాలులని కనిపెట్టి, ప్రభుని ఆనతి చేత బలరాముని చేజిక్కించుకొని తన మూపుపైకి ఎక్కించుకున్నాడు. ఆటప్రకారం - అతడా బాలుని కొంతదూరం మోస్తూ లేడిలా గంతులేస్తూ వెళ్లాలి. దైవాంశ సంభూతుడైన బలరాముడు అంతకంతకూ బరువుగా తోచడంతో, వాడు నిజరూపంతోనే బలరాముని మోయసాగాడు.

బలరాముడు, శ్రీకృష్ణుని కేకవేసి పిలిచి "ఇప్పుడేం చేయమంటావు?" అని అడిగాడు. అది విన్న శ్రీకృష్ణుడు "అన్నా! బలరామా! గుహ్యాతి గుహ్యుడవు నీవు. కేవలం నిర్గుణ పరబ్రహ్మవు. నీ మానవాకార రీతికి తగ ప్రవర్తనమా ఇది. విడంబనం దేనికి? అశేష జగద్బీజ కారణం కంటె ముందు పుట్టిన వాడివి. జగత్తంతా ఏకార్ణవంగా ఉండగా, ఏకాత్మకమై శేషించిన నీ స్వరూపాన్ని స్మరించు. నేనూ - నువ్వూ ఈ భూభారావతరణానికే, ఈ మనుష్యలోకానికి వచ్చామని నీకు తెలిసిందేకదా!

గగనము నీకు శిరస్సు. మోఘాలు నీ కేశాలు. భూమి పాదాలు. ముఖము అనంతాగ్ని. మనస్సే చంద్రుడు. నిశ్వాసాలు వాయువు. నీ నాలుగు బాహువులు నాలుగు దిశలు. సహస్రముఖుడవు. భగవంతుడవు. నీ ద్విరూపమితరులకు గహనము. నీ యొక్క రూపమే కల్పానుసారంగా జగద్భావాన్ని పొందుతుంది. నేనూ - నీవూ కలిసి ఈ జగత్తు కోసం ఏకకారణమై ఉన్నాం! జగత్ కోసం మనం భిన్న రూపులం. అంతే! ఓ విశ్వాత్మా! నిన్ను నీవు స్మరించు! ఈ దానవుని సంహరించు! మానుషరూపంలో ఉన్న మనం మనవారికి హితం కలుగజేద్దాం!"

ఇలాగ కృష్ణుడు జ్ఞప్తిచేసేసరికి, బలరాముడు ప్రలంబుని పట్టి పీడించసాగాడు. కోపంచేత ఎర్రవారిన కళ్లతో వాని నడినెత్తిమీద పిడికిళ్లతో పొడిచాడు. వాడు కనుగ్రుడ్లు తేలవేసి, తలబద్ధలుకాగా, రక్తం కక్కుతూ మరణించాడు. గోపకులంతా బలరాముని స్తుతించారు. తదుపరి ఆ సోదరులిద్దరూ గోకులానికి విచ్చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది