పరీక్షిత్తుని వృత్తాంతం

ఆదిపర్వము – 8
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
పరీక్షిత్తుని వృత్తాంతం

అలా ఉగ్రశ్రవసువు, కద్రువ శాపం గురించి, క్షీరసాగర మథనం గురించి చెప్తాడు. శౌనక మునులారా ఇప్పుడు మీకు ఉదంకుడు జనమేజయరాజు దగ్గరికి వచ్చిన తరువాత ఏం జరిగిందో చెప్తాను అని ఇలా మొదలు పెట్టాడు.

ఉదంకుడు హస్తినాపురం చేరుకుని జనమేజయ రాజుని కలిసి "తక్షకుడు నీ తండ్రి పరీక్షిత్తు మహరాజుని అన్యాయంగా చంపాడని చెప్తాడు. అప్పుడు జనమేజయరాజు తన మంత్రులను పిలిచి "నా తండ్రిని తక్షకుడు ఎందుకు చంపాడు, ఎలా చంపాడు అసలు ఏం జరిగింది" అని అడుగుతాడు.

మంత్రులు "రాజా! అర్జునుడు శ్రీ క్రిష్ణుని చెల్లెలు సుభద్రని పెళ్ళిచేసున్నాడు. వారి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు ఉత్తరని పెళ్ళి చేసుకున్నాడు. వీరి కుమారుడు నీ తండ్రి పరీక్షిత్తు మహరాజు. అతనికి వేట అంటె చాలా ఇష్టం.

ఒకరోజు వేటలో ఒక మృగానికి బాణం వేసాడు.ఆ మృగం బాణం దెబ్బతో అడవిలోకి పోతూ, ఒక ఆశ్రమములోకి పోయింది. మృగం దూరిన ఆశ్రమం శమీకునిది. శమీకుడు తపశ్శాలి, మౌనముగా ఒక చెట్టుకింద తపస్సు చేస్తున్నాడు. పరీక్షిత్తు మృగం కోసం అక్కడికి వచ్చి మునిని అడిగాడు. ముని మాట్లాడకపోయెసరికి , కోపం వచ్చి పక్కనే ఉన్న చచ్చిన పాముని శమీకుని మెడలో వేసి వెళ్లిపొతాడు. ఈ విషయాన్ని క్రుషుదు అను ముని శమీకుడు కుమారుడైన శృంగి మునికి చెప్తాడు. అప్పుడు శృంగి కోపంతో "తపస్సులో ఉన్న నా తండ్రిని చచ్చిన పాముని మెడలో వేసి అవమానించాడు, కావున నేటి నుండి ఏడవ రోజున పరిక్షిత్తు మహరాజు తక్షకుడను పాముకాటు వల్ల మరణించుగాక" అని శపించాడు.

ఆ తరువాత శృంగి శమీకుడి దగ్గరికి వెళ్ళి, మెడలోని పాముని తీస్తాడు. అప్పుడు శమీకుడు కళ్ళు తెరిచి శృంగిని చూస్తాడు. శృంగి జరిగినదంత తండ్రికి వివరిస్తాడు. తపోధనులకు కోపము ఉండరాదు శక్తి ఉన్న శాపమును తొలగించు అంటాడు. శృంగి అప్పుడు కోపంలో శపించాను, తిరిగి తీసుకునే శక్తి నాకులేదు అని చెప్తాడు. శమీకుడు తన శిష్యుదైన గౌరముఖుని పిలిచి పరీక్షిత్తుకు శాపము గురించి చెప్పమంటాడు. ఆ వార్త విన్న పరీక్షిత్తు మహరాజు భయపడి, ఒంటి స్తంభపు మేడ కట్టించి, మంత్రులను, వైద్యులను పిలిపించి అందులో ఉంటున్నాడు.

తక్షకుడు శృంగి శాపము విని, పరీక్షిత్తుని చంపడానికి బయలుదేరుతాడు. కశ్యపమునికి పాముచేత చంపబడిన వారిని బ్రతికించే వరమును బ్రహ్మదేవుడు ప్రసాదిస్తాడు. శృంగి శాపము విని పరీక్షిత్తుని రక్షించాలని వెళ్తాడు కశ్యపుడు. కశ్యపుడు,తక్షకుడు దారిమధ్యలో కలుసుకున్నారు. తక్షకుడు తన శక్తిని నిరూపించడానికి పక్కనే ఉన్న మర్రిచెట్టుని కాటు వేస్తాడు క్షణంలో అది కాలి బూడిద కుప్పగా మారుతుంది, అప్పుడు కశ్యపుడు తనకున్న వరశక్తితో ఆ మర్రిచెట్టుని మళ్ళీ ఎప్పటిలాగ పచ్చని చెట్టులా మారుస్తాడు.

తక్షకుడు కశ్యపుని శక్తి చూసి బయపడి, ఇతడు ఉండగా నా పని సక్రమంగ జరగదు అనుకున్నాడు. పరీక్షిత్తుని బ్రతికించిన అతడు ఇచ్చే ధనం కంటే ఎక్కువగా ధనం ఇస్తానంటాడు తక్షకుడు. కశ్యపుడు ఆ మాట విని, కశ్యపుడు తన కర్తవ్యాన్ని, పరీక్షిత్తు మాటనీ మరిచిపోయి ధనం తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు.

అప్పుడు తక్షకుడు ఒక ఉపాయాన్ని ఆలోచించి, నాగ కుమారులను బ్రాహ్మణులుగా మార్చి వారికి కొన్ని పళ్ళు ఇచ్చి పరీషిత్తుని దగ్గరికి పంపాడు.

పరీక్షిత్తుడు ఒంటిస్తభపు మేడ మీద ఉన్నాడు. అతని చుట్టు వేదాధ్యయనం చేస్తున్న మునులు, మంత్రులు, వైద్యులు ఉన్నారు. ఆనాడు ఏడవరోజు, సూర్యస్తమయానికి ఇంకా కొంచెం సమయం ఉంది. సూర్యస్తమయం దాటాలి తనకి శాపము తప్పిపొవాలి అనుకున్నాడు.

అప్పుడు తక్షకుడు పంపిన బ్రాహ్మణులు పరీక్షిత్తుని దగ్గరికి వచ్చి, వారు తెచ్చిన పండ్లను రాజుకి ఇచ్చారు. పరీక్షుత్తుడు ఒక పండు ఉంచుకుని మిగతావన్ని అక్కడున్న వారికి ఇస్తాడు. ఆ పండుని తినాలని కోసాడు, మధ్యలొ ఒక చిన్న పురుగు కనిపించింది అతనికి. చూస్తూ ఉండగానె మహా సర్పంగా మారింది. అతడే తక్షకుడు. తక్షకున్ని చూసి అక్కడున్న వారు భయంతో పారిపొయారు. తక్షకుడు పరీక్షిత్తుని కాటు వేసాడు, ఆ కాటు ప్రభావనికి, పరీక్షిత్తుడు సహ ఒంటి స్తభపు మేడ కాలి, బూడిద కుప్పగా మారింది" అని చెప్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది