🌺గురువు -ఆచార్యుడు🌺
తత్త్వతః గురువుకి ఆచార్యుడికీ ఏవిధమైనటువంటి బేధమూ ఉండదు. కానీ సున్నితమైన ఒక బేధం ఉంటుంది. గురువు పరబ్రహ్మమును అనుభవించినటువంటి వాడు. “బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి”-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. గురువు కూడా ఆస్థాయికి చేరినటువంటి వ్యక్తే. పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము. అందుకే “గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః! గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!”-గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యంకాదు. భగవాన్ రమణులు మహా పురుషులు. వారు బ్రహ్మముయొక్క స్థాయిని చేరిపోయినవారు. అంతటి అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉండేవారు. శరీరాన్ని చూపించి ఎప్పుడూ ఇది అని వేలు చూపించి తను సాక్షిగా ఉండేవారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, గురుస్వరూపుడైన రమణమహర్షి సంధ్యావందనం చేయాలనీ, యజ్ఞోపవీతం వేసుకోవాలనీ, గోచీపోసి పంచె కట్టుకోవాలనీ, వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలనీ, అలా ఆయన ప్రవర్తించకపోతే దోషం వస్తుందనీ, చెప్పడం సాధ్యంకాదు.అది అగ్నిహోత్రం వంటిది. ఆస్థాయికి చేరినటువంటి మహాపురుషులు కర్మాచరణను శాస్త్రీయంగా చేశారా? చేయలేదా?అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు. జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. అనుకరణవల్ల మహాత్ముల స్థాయిని చేరలేరు. పరమభక్తితో కర్మాచరణము చేయగా చేయగా అనుగ్రహించిన భగవంతుని కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశం ఇస్తుంది. ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమునకు హేతువు. జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ నేను ఆత్మ అని దానియందు రూఢియై అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని. శరీరంతో తాదాత్మ్యత పొందడు. అందుకే గురువు అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకు కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని భావించడం పొరపాటు. గురువుయొక్క లీల, మాట పరమశక్తివంతములు. గురువు లోకోద్ధరణకొరకే నోరువిప్పుతాడు. గురువుయొక్క సహజస్థితి మౌనం. భగవాన్ రమణులకు అందుకే మౌనయోగి అని పేరు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవములో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులను గురువులు అని పిలుస్తారు.
ఆచార్యుడు కూడా గురువే. ఆయనా పరబ్రహ్మమును తెలుసుకున్నవాడే, అనుభవములోకి తెచ్చుకున్నవాడే, పరబ్రహ్మముగా నిలబడిన వాడే. ఆచార్యుడు వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా నియమపాలనం ఎందుకు చేస్తారంటే లోకానికి ఒక మార్గదర్శకత్వం వహించి ఒకదారి చూపిస్తాడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామి వారు మహాజ్ఞాని. ఆయనలాంటి సద్గురువులు లోకంలో ఎక్కడా ఉండరు. సన్యాసాశ్రమ నియమాలను ఎక్కడా ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఆచరించారు. ఆశ్రమ నియమాన్ని విడిచిపెట్టరు. పాటించకపోయినంత మాత్రాన ఆయనస్థాయి తగ్గదు. కానీ మనందరికి మార్గదర్శకంగా ఉండడానికి అలాగే ఆచరించి చూపారు. నువ్వు ఏఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమ నియమాల్ని పాటించు. ధర్మము వర్ణము, ఆశ్రమము అనే రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ధర్మమునకు ఆలంబనం ఆశ్రమం కాబట్టి ఆ ఆశ్రమ నియమాలను ఎలా పాటించాలో మనకి చెప్పడం కోసం వేదం ఎలా చెప్పిందో అలా ఆచరించి చూపించిన గురుస్వరూపాలకి పేరు చివర ఆచార్య అని బిరుదునామం కలుపుతారు. ఉదాహరణకు ద్రోణాచార్య, కృపాచార్య, పరమాచార్య. వీరందరూ బ్రహ్మమును అనుభవించిన వారే. పరబ్రహ్మము కంటికి కనపడదు. అనుభవింపబడుతుంది. ఆ పరబ్రహ్మము కాళ్ళూ చేతులతో మనముందు కదిలితే వారే గురువులు. మనం ఎలా ఏది ఆచరించాలో అనుగ్రహభాషణం చేస్తారు. అటువంటి వారిని ఆచార్యులు అంటారు. తత్త్వతః ఈ ఒక్క బేధం తప్ప గురువుకి ఆచార్యునికి బేధం ఉండదు. ఇద్దరూ రగులుతున్న జ్ఞానాగ్నులే. “జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవే నమః” అంటాడు పరమేశ్వరుడు. అగ్నిహోత్రానికి పాపపుణ్యములుండవు. ఒకప్పుడు రమణమహర్షి దగ్గరికి ఒక మనిషి వచ్చి నాకు చాలా భయంగా ఉంది అన్నాడు. దేనికి? అని అడిగారు ఆయన. నేను చాలా పాపాలు చేశాను అన్నాడు అతను. పాపాలు చేస్తే భయమెందుకు? కరుణాసముద్రుడైన భగవంతుడున్నాడు ఆయనకి చెప్పు క్షమిస్తాడు. అన్నారు. నన్ను అవి పీడిస్తాయి. అవి పోతే నాకు సంతోషం అన్నాడు. అప్పుడు రమణులు నీపాపాలు నాకు ధారపోస్తావా? అనగా అంతకన్నానా. పుచ్చుకోండి. ధారపోస్తాను అని సమంత్రకంగా ధారపోశాడు. లోకంలో పంచభూతములయొక్క ధర్మం ఇతర భూతములయొక్క వ్యగ్రత చేత మారుతుంది. నీరు నిప్పును ఆర్పుతుంది. కానీ దావానలాన్ని నీటితో ఆపగలమా? రగిలిపోతున్న జ్ఞానాగ్ని గురువు. ఆయనయందు దోషం ఉండదు. వారు చెప్పినది పట్టుకో. వారి లీలయొక్క అంతరార్థం పట్టుకో. సామాన్య చేష్టితం అనుకోకు. అందులో ఏదో రహస్యం ఉంటుంది. లోకోద్ధరణ కొరకు చేస్తారు. గురువైనా ఆచార్యుడైనా మన ఉద్ధరణకొరకే. ఒకరు వైదికాచారమునందు కట్టుబడతారు. ఒకరు కట్టుబడకుండా పరబ్రహ్మమునందు రమిస్తారు. తాత్త్వికంగా ఇద్దరిదీ ఒకే స్థాయి.