తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు... అంటాడు వేమన. మన సమాజంలో కొందరు ఇతరుల్లోని లోపాలను అదేపనిగా వేలెత్తి చూపిస్తూ విమర్శిస్తూంటారు. గురివింద తన మచ్చ ఎరగనట్లు తమలోని లోపాలను గుర్తించకుండా ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ వారిని విమర్శించడం వల్ల మిగతా నష్టాలను అలా ఉంచితే ముఖ్యంగా అనుబంధాలు దెబ్బతింటాయి.
నిజానికి భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. లోపాలు, దోషాలు ఉన్నంతమాత్రాన సాటివారిని తక్కువగా చూడకూడదు. రూప భేదాలు భౌతికమైన దేహానికే గానీ మనసులకు లేవు. ప్రతీ ప్రాణి హృదయంలో ఆ పరమాత్మ కొలువై ఉంటాడు. అందుకే ఈ సృష్టిలో ప్రతి జీవినీ ప్రేమించాలి. ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను దర్శించే స్థాయికి చేరుకోవాలి. మనిషి సంఘజీవి. ఈ సమాజంలో ఒకరి సహకారం లేకుండా మరొకరు బతకలేరు. ఎంత గొప్పవారైనా మరొకరిపై ఆధారపడకుండా జీవించలేరు.
అందుకే వృత్తి వల్లనో, రూపాన్నిబట్టో, బలహీనతల కారణంగానో ఎవరినీ చిన్నచూపు చూడకూడదు.
ఈ సమాజానికి అందరూ అవసరమే. నవ్విన నాపచేనే పండుతుందన్నారు పెద్దలు. పరాక్రమవంతుడైన రాముడికి వానరసేన సాయం చేసి విజయానికి తోడ్పడింది. అల్పవస్తువులు, అల్పజీవులు అంటూ ఈ సృష్టిలో ఏమీ లేవు.
తండ్రి శాపం వల్ల ఎనిమిది వంకరలున్న ఆకారంతో పుట్టాడు అష్టావక్రుడు. తన అసమాన పాండిత్యంతో ఆస్థాన పండితుడైన వందిని ఓడించి, తండ్రిని చెరనుంచి విడిపించాడు. అలాగే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి
అణచివేశాడు.
అధికారం, ధనం, అందం వీటివల్ల మనిషికి కీర్తిప్రతిష్ఠలు లభించవు. మంచి నడవడి, సాయపడే గుణం, పాండిత్యం, వివేకం వల్ల మాత్రమే మనిషి కీర్తికాయుడవుతాడు. తియ్యని పండ్లనిచ్చే చెట్ల మధ్య వేపచెట్టు నిరాదరణకు గురైనప్పటికీ అవసరమైనప్పుడు అదే దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. అంధులైనా, మూగవారైనా, కటిక పేదలైనా మనోబలంతో ఎన్నో విజయాలు సాధించవచ్చని నిరూపించిన మహాత్ములెందరో ఉన్నారు. రెండుపదుల వయసు నుంచే వినికిడి శక్తి నశించడం మొదలెట్టినా చాలాకాలం పాటు అది ఎవరికీ తెలియకుండా ప్రదర్శనలిచ్చాడు బీథోవెన్. కటిక దారిద్య్రం వెంటాడినా మనోబలంతో విద్యావంతుడై అమెరికా అధ్యక్షుడు కాగలిగారు అబ్రహం లింకన్. ఎవరికైనా బుద్ధిబలం, మనోబలమే ముఖ్యం.
వాటితో ఎలాంటి ఘనకార్యాలనైనా సాధించవచ్చు. ఇంక ఎదుటివారిలో మనకు నచ్చని గుణాలున్నాయని వారిని విమర్శించే ముందు అటువంటి గుణాలు మనలో ఉన్నాయేమోనని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ స్వభావమే మనసును ప్రక్షాళన చేస్తుంది. వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.
సాటి మనిషిని నారాయణుడిగా భావించాలన్నాడు వివేకానందుడు. సర్వ ప్రాణుల్లోనూ తనను చూడగలిగినవాడే తనకు ప్రీతిపాత్రుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. సర్వసమభావనతో అందరినీ ప్రేమించేవాళ్లే ప్రజల మనుషులుగా ఎదుగుతారు. లోకకల్యాణం కోసం పాటుపడతారు.