అపార్థాలు ఆధ్యాత్మికోన్నతికి అవరోధాలు!



మాయావి అనే రాక్షసుడు వాలి పాలిస్తున్న కిష్కంధపై ఓసారి యుద్ధానికి బయల్దేరాడు. వాలి కూడా ఎదురుదాడికి దిగాడు. అన్నకు అండగా సుగ్రీవుడూ వెంటవెళ్లాడు. వాలి, సుగ్రీవులను చూసి మాయావి గుహలోకి ప్రవేశించాడు. తమ్ముణ్ణి గుహ ద్వారం దగ్గర ఉండమని చెప్పి, వాలి లోనికి వెళ్లాడు. రోజుల తరబడి గుహలో యుద్ధం కొనసాగింది. వాలి తిరిగి రావటం లేదు. ఒకరోజు గుహ నుంచి నురుగుతో కూడిన రక్తం బయటకు వచ్చింది. రాక్షసుల గర్జనల ధ్వనులు, నిస్సహాయమైన వాలి ఆక్రందనలు సుగ్రీవుని చెవిన పడ్డాయి. రాక్షసులు అన్నను మట్టుపెట్టి ఉంటారని, గుహను మూసేసి కిష్కింధకు తిరుగు పయనమయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యభారాన్ని చేపట్టాడు. కొన్నాళ్లకు వాలి మాయావిని చంపి కిష్కింధకు తిరిగొచ్చాడు. పట్టాభిషిక్తుడై ఉన్న సుగ్రీవుణ్ణి చూసి వాలి అపార్థం చేసుకున్నాడు.

రాజ్యకాంక్షతో తమ్ముడు తనను మట్టుపెట్టాలనే ఉద్దేశంతో గుహద్వారాన్ని మూసేశాడని అనుమానించాడు. అపార్థంతో శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. అనర్థాన్ని కొనితెచ్చుకుని శ్రీరాముడి చేతిలో హతమయ్యాడు. అలాగే చిత్ర కూటంలో రామలక్ష్మణులు వనవాసం చేస్తున్నప్పుడు, దూరంగా వస్తున్న భరతుణ్ణి, అతని సేనను చూసి సౌమిత్రి అపార్థం చేసుకున్నాడు. భరతుడు తమపై యుద్ధానికి వస్తున్నాడనుకున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు 'శుభలక్షణ సంపన్నుడైన భరతుడు బాధతో, పినతల్లి కైకేయిని నిలదీసి ఉండవచ్చు. నాన్నను ప్రసన్నుని చేసుకుని, రాజ్యాన్ని నాకు అప్పగించాలనుకుని ఇక్కడికి వస్తున్నాడేమో! తమ్ముడు నాకు అపకారం చేయాలని ఎన్నటికీ తలచడు' అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అందుకే ఆయన లోకానికి ఆరాధ్యనీయుడయ్యాడు. అపార్థాలు మన అభ్యున్నతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డంకులని నిరూపించాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది