రావణుడు మాయోపాయంతో సీతను అపహరించుకుపోయాడు.
ఆమె కోసం వెతికి వేసారిన రాముడికి అంతవరకు గల ఆందోళన ఉన్నపళంగా ఆగ్రహంగా మారింది. సృష్టినే నాశనం చేస్తానంటూ బ్రహ్మాస్త్రాన్ని చేతపట్టాడు. లోకానికి రానున్న ఉపద్రవాన్ని గుర్తించిన లక్ష్మణుడు ఆయనను చల్లబరచాడు. ‘అన్నా! శాంతించు.
సర్వం తెలిసిన నీకు చెప్పదగినవాణ్ని కాదు. నువ్వు అరివీర భయంకరుడివి. శౌర్య పరాక్రమాల్లో నీకు మరెవ్వరూ సాటి రారు. అలాంటి నీవే ఆగ్రహిస్తే, భూమండలమే కాదు పద్నాలుగు భువనాలూ భస్మమవుతాయి.
ఒక స్త్రీ కోసం రాముడు సకల సృష్టినే దహించాడన్న అపకీర్తి మూటకట్టుకోకు’ అని హితవు పలికాడు లక్ష్మణుడు.
రాముడి విక్రమాన్ని లక్ష్మణుడు ఒకవైపు శ్లాఘిస్తూనే, మరోవైపు ప్రియ వచనాలు పలికాడు. హితవు కలిగించే మాటలతో, జరగనున్న అనర్థాన్ని తెలియజేశాడు.
రాముడి గుణగణాల్ని పొగుడుతూనే, అంతటి ఆగ్రహం కూడదన్న హితవు వల్ల, వివేకవంతుడైన ఆయన శాంతించాడు. హితవును సైతం ప్రియంగా చెప్పగలిగితే ఫలితం బాగుంటుం దనేందుకు ఇదే తార్కాణం!