🙏ఆచమనము-కేశవ నామాల విశిష్టత....!!
మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ
కేశవాయనమః
నారాయణాయనమః
మాధవాయనమః
అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో చానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.ప్రీతితో కార్యము చేస్తాము.
01. ఓం కేశవాయనమః(శంఖం చక్రంగద_పద్మం)
బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,నియామకుడూ అయినందువల్ల శ్రీహరి ‘కేశవుడు’అనబడుతున్నాడు..
02. ఓం నారాయణాయనమః (పద్మంగదచక్రం_శంఖం)
నాశరహితుడైనందువల్ల విష్ణువు ‘నరుడు’ ఆయన చేత,సృష్టించబడిన జలం ‘నార’అనబడుతోంది.ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు ‘నారాయణుడు’ అయ్యాడు.
03. ఓం మాధవాయ నమః(చక్రంశంఖంపద్మం_గద)
‘మధు’నామక యదువంశ శాఖలో జన్మించడంవల్లా,రమాదేవికీ పతి అయినందువల్లా,సర్వోత్తముడు అయినందువల్లా,శ్రీహరి ‘మాధవుడు’ అయ్యాడు.
04. ఓం గోవిందాయ నమః(గదపద్మంశంఖం_చక్రం)
వేదాల మూలంగా పొందబడేవాడూ,భూమినీ,గోవులనూ రక్షించేవాడూ,మోక్షప్రదుడూ అయినందువల్ల శ్రీహరి ‘గోవిందుడు’ అనబడుతాడు..
05. ఓం విష్ణవే నమః(పద్మంశంఖంచక్రం_గద)
జ్ఞానానందాది సమస్త గుణాలతో,దేశతఃకాలతః వ్యాప్తుడైనందువల్లా సర్వోత్తముడై ఉన్నందువల్లా శ్రీహరి “విష్ణువు” అనబడుతున్నాడు..
06. ఓం మధుసూదనాయ నమః (శంఖంపద్మంగద_చక్రం)
“మధు”నామక దైత్యుడిని సంహరించినందువల్లా,సాత్త్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్లా శ్రీహరి‘మధుసూదనుడు’ అనబడుతున్నాడు.
07. ఓం త్రివిక్రమాయ నమః (గదచక్రంశంఖం_పద్మం)
08. ఓం వామనాయ నమః(చక్రంగదపద్మం_శంఖం)
అపేక్షిత సుఖాలనూ,అభీష్టాలనూ కరుణించేవాడూ,మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడూ అయినందువల్ల శ్రీహరి‘వామనుడు’.
09. ఓం శ్రీధరాయ నమః(చక్రంగదశంఖం_పద్మం)
శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్తా,పోషణకర్తా అయినందువల్లా లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేతా శ్రీహరి‘శ్రీధరుడు’ అనబడుతున్నాడు.
10. ఓం హృషీకేశాయ నమః(చక్రంపద్మంశంఖం_గద)
ఇంద్రియ నియామకుడూ,రమ,బ్రహ్మ,రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘హృషీకేశుడు’ అనబడుతున్నాడు.
11. ఓం పద్మనాభాయ నమః(పద్మంచక్రంగద_శంఖం)
నాభిలో పద్మాన్ని కలిగినవాడూ,భక్తుల మనస్సులో ప్రకాశించేవాడూ,సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడూ అయినందువల్ల శ్రీహరి‘పద్మనాభుడు’ అనబడుతున్నాడు.
12. ఓం దామోదరాయ నమః(శంఖంగదచక్రం_పద్మం)
యశోదచేత పొట్టకు బిగించబడిన
తాడుగలవాడూ,ఇంద్రియనిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడూ,దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడూ,దైత్యులకు దుఃఖం కలిగించేవాడూ,దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడూ అయినందువల శ్రీహరి‘దామోదరుడు’ అనబడుతున్నాడు.
13. ఓం సంకర్షణాయ నమః(శంఖంపద్మంచక్రం_గద)
భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాలనుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందువల్ల శ్రీహరి‘సంకర్షణుడు’ అనబడుతున్నాడు.
14. ఓం వాసుదేవాయ నమః(శంఖంచక్రంపద్మం_గద)
త్రిలోకాలకూఆవాసస్థానమైనవాడూ,సర్వాంతర్యామీ,సర్వశక్తుడూ,సర్వచేష్టకుడూ,సర్వాభీష్టప్రదుడూ,యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడూ,వసుదేవసుతుడూ అయినందువల్ల శ్రీహరి ‘వాసుదేవుడు’అనబడుతున్నాడు.
15. ఓం ప్రద్యుమ్నాయ నమః(శంఖంగదపద్మం_చక్రం)
అసదృశమైన కాంతీ,యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ‘ప్రద్యుమ్నుడు’అనబడుతున్నాడు.
16. ఓం అనిరుద్ధాయ నమః(గదశంఖంపద్మం_చక్రం)
ఎవ్వరిచేతా నిరోధించబడనివాడూ,సర్వశక్తుడూ,గుణపూర్ణుడూ,మనస్సుతో సంపూర్ణంగా తెలియబడనివాడూ,జ్ఞానుల మనసులలో ధ్యానంతో బంధించబడేవాడూ,వేదవిరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అనిరుద్ధుడు’అనబడుతున్నాడు.
17. ఓం పురుషోత్తమాయ నమః(పద్మంశంఖంగద_చక్రం)
దేహనాశంగల సర్వజీవులూ క్షరపురుషులు.ఏ విధమైన నాశనమూలేని అప్రాకృత శరీరంగల శ్రీమహాలక్ష్మిదేవి అక్షరపురుష.ఈ ఉభయ చేతనులకంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి‘పురుషోత్తముడు’అనబడుతున్నాడు
18. ఓం అధోక్షజాయ నమః(గదశంఖంచక్రం_పద్మం)
ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదులవల్ల ప్రాదుర్భవించినవాడూ,నిత్యజ్ఞానస్వరూపుడూ,అక్షయకుమారుడిని సంహరించిన హనుమంతుడిచేత తెలియబడేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అధోక్షజుడు’ అనబడుతాడు.
19. ఓం నారసింహాయ నమః(పద్మంగదశంఖం_చక్రం)
నరుడిలాగా,సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగివున్నందువల్ల శ్రీహరి ‘నారసింహుడు’అనబడుతాడు.
20. ఓం అచ్యుతాయ నమః(పద్మంచక్రంశంఖం_గద)
శుద్ధజ్ఞానానందాలే దేహంగా కలవాడూ,సకలగుణ పరిపూర్ణుడూ,సత్య సంకల్పుడూ అయినందువల్ల సర్వదా పూర్ణకాముడూ,దోషరహితుడూ అయినందువల్లా శ్రీహరి ‘అచ్యుతుడు’అనబడుతున్నాడు.
21. ఓం జనార్థనాయ నమః(చక్రంశంఖంగద_పద్మం)
సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు,కైటభ, హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడూ, మోక్షప్రదుడూ, జన్మలేనివాడూ, సంసారదుఃఖాన్ని పరిహరించేవాడూ,సుజీవులచేత పొందబడేవాడూ అయినందువల్ల శ్రీహరి‘జనార్ధనుడ’య్యాడు.
22. ఓం ఉపేంద్రాయ నమః(గదచక్రంపద్మం_శంఖం)
ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి ‘ఉపేంద్రుడు’ అనబడుతున్నాడు.
23. ఓం హరయే నమః(చక్రంపద్మంగద_శంఖం)
భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడంచేత నారాయణుడు‘హరి’అనబడుతున్నాడు.
24. ఓం కృష్ణాయ నమః(గదపద్మంచక్రం_శంఖం)
సృష్టి,స్థితి,సంహార నియమనాదుల వల్ల సకల జగత్తునూ తనలోనికి లాగికొనువాడూ,పూర్ణానంద స్వరూపుడూ, నీలవర్ణ దేహకాంతికలవాడూ అయినందువల్ల శ్రీహరి“కృష్ణుడు”అనబడుతున్నాడు....