అర్జునుడికి, కర్ణుడికి మధ్య వ్యక్తిగతమైన వైరం ఉండేది. కర్ణుడి దాన గుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అర్జునుడు భరించ లేక పోయేవాడు.
ఒక రోజు కృష్ణుడి దగ్గరకు వెళ్లి- *"బావా! నేను కూడా దానాలు చేశాను. అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను. అయినా నన్ను ఎవరూ గుర్తించటం లేదు. అందరూ కర్ణుడి దాన గుణాన్నే పొగుడుతున్నారు. దీని వెనకున్న కారణమేమిటి?"* అని అడిగాడు.
కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
ఆ సంభాషణ జరిగిన సాయంత్రం- కృష్ణుడు, అర్జునుడు వాహ్యాళికి వెళ్లారు. అక్కడ వాళ్లిద్దరికి ఒక బంగారు కొండ కనిపించింది. అర్జునుడు చాలా ఆశ్చర్యపోయాడు.
అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు చూసి- "ఈ బంగారు కొండను దానం చేయి.. అప్పుడైనా నీకు కర్ణుడి కన్నా మంచి పేరు వస్తుందేమో".. అన్నాడు.
అర్జునుడు వెంటనే తన సేవకుల చేత చుట్టుపక్కల ఉన్న గ్రామాలవారికి బంగారం దానంగా తీసుకొమ్మని దండోరా వేయించాడు.
అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. అర్జునుడు బంగారాన్ని తవ్వించి చిన్న చిన్న ముక్కలు దానం చేయటం మొదలుపెట్టాడు. ఎంత మందికి దానం చేసినా బంగారం తరగటం లేదు. జనం సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఒక రోజు అయ్యేసరికి అర్జునుడు అలసిపోయాడు. *"కృష్ణా.. దానం చేయాలంటే చిరాకుగా ఉంది"*, అన్నాడు.
అప్పుడు కృష్ణుడు- *"నీకు దానం ఎలా చేయాలో చెబుతా"* అని *కర్ణుడి*ని పిలిపించాడు.
*"ఈ బంగారం కొండను మాకు కనిపించాయి. వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బావుంటుంది"* అన్నాడు.
వెంటనే *కర్ణుడు*- అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి- *"ఈ కొండలు మీవి. వీటిని తవ్వి తీసుకువెళ్లండి"* అన్నాడు.
అందరూ తమకు కావల్సిన బంగారం తీసుకెళ్లారు.
అప్పుడు *అర్జునుడి*తో *కృష్ణుడు* - *"నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది. అందుకే చిన్న చిన్న ముక్కలు పంచిపెట్టావు"*. కానీ కర్ణుడికి ఆశ లేదు. అందుకే వారికి కొండ అంతా ఇచ్చేశాడు. *"దానం చేసేవారి మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు. అప్పుడే ఆ దానం ఫలిస్తుంది"* అని బోధ చేశాడు.