జీవితాన్ని మించిన ఫిలాసఫీ ఏముంటుంది!







 జీవితం ఎప్పుడు నిచ్చెనలెక్కిస్తుందో, ఎప్పుడు పాములతో కాటేయిస్తుందో తెలీదు. అయినా నిత్యం నూతనంగా బతకాలనుకునే తాపత్రయం. నీటిలో మునిగిపోతున్నామని తెలిసినా... నీటిపై తేలియాడే ఎండుటాకును పట్టుకుని అది రక్షిస్తుందేమోనని ఆశపడడం - జీవితం! 

 నిత్యభ్రమణంలో ఉన్న భూమ్మీద నివసిస్తూ... కాంక్రీట్‌తో ఇల్లు కట్టుకుని, వాస్తు గురించి ఆలోచించడం - జీవితం!

 దేవుడూ, జీవుడూ వేరు కారనే అద్వైత సిద్ధాంతాన్ని నమ్ముతూనే, అంతమంది దేవుళ్లనూ పూజించడం, అజ్ఞానాంధకారంలో నడవడం - జీవితం!

 మిణుగురు పురుగులా బతుకుతూ నా అంతటి కాంతి మరెక్కడా లేదనుకునే మూఢత్వం - జీవితం!  

నేను కుయ్యకపోతే తెల్లవారదేమోనన్న భ్రమలో బతకడం - జీవితం!  

నలుగురితో మంచిగా ఉండాలని - అందరితో మంచి అనిపించుకోవాలని - తన జీవితాన్ని పడుపు వృత్తిలోకి దించడం - జీవితం!

  జరిగినదాని గురించి పశ్చాత్తాపపడుతూ, జరుగుతున్న దాని గురించి ఆవేదన చెందుతూ, జరగబోయే దాని గురించి ఆందోళన పడడం - జీవితం! 

అన్నీ నేనే చేసుకుంటూ, నా జీవితాన్ని నేనే శిల్పంలా తీర్చిదిద్దుకుంటున్నాననుకుంటూ, నీకు జీవితాన్ని ప్రసాదించిన అతీతమైన శక్తిని మరచిపోవడం - జీవితం!  

ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా ఎన్నో చెప్పాల్సి వస్తుందని తెలియకపోవడం - జీవితం!  

ఇలా లెక్కలేసుకుని బతకడం ... జీవితం కాదు! ఒక్క మాటలో చెప్పాలంటే - జీవితం ఎక్కాల పుస్తకం కాదు... పెద్దబాలశిక్ష ఎవరో మహాకవి అన్నట్టు - కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చేమో కానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం. అందుకే - జీవితాన్ని మించిన ఫిలాసఫీ ఏముంది?.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది