[Forwarded from Murthy Gnvvs]
మనిషి జీవితంలో లక్ష్మీదేవి ఎలా వస్తుందో
తిరిగి ఎలా వెళ్ళిపోతుందో చూడండి .
శ్లో|| ఆజగామ యదా లక్ష్మీః నారికేళఫలాంబువత్
నిర్జగామ యదా లక్ష్మీః గజభుక్తకపిత్థవత్
--నీతి శాస్త్రం.
సిరిసంపదలు మనకు వచ్చేటప్పుడు, కొబ్బరికాయలోకి నీరు లాగా తెలియకుండా వచ్చేస్తాయట. అలాగే, సంపదలు పోయినప్పుడు ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుజ్జువలె కనబడకుండా మాయమైపోతుందట.
కం. సిరి దా వచ్చిన వచ్చును, సరగున యా నారికేళ సలిలము భంగిన్
సిరి దా బోయిన బోవును, కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ
అంటాడు భద్రభూపాల కవి, బద్దెన.
లక్ష్మీదేవి, ఎవరిని ఎప్పుడు ఎలా కరుణిస్తుందో చెప్పడం చాలా కష్టం.
దీనికి మంచి ఉదాహరణగా కొబ్బరికాయలోని నీటి గుఱించి చెబుతారు. ఆ నీరు ఎలా వచ్చి చేరుతుందో, నిజంగానే ఎవరికీ తెలియదు. ఇది ప్రకృతి రహస్యం.
కొబ్బరి కాయలోని నీరు లాగా, లక్ష్మీదేవి కూడా నిశ్శబ్దంగా వస్తుంది.
ఆమె వచ్చిన తర్వాత శబ్దాలు చేయడం ప్రారంభిస్తుంది. ఎలా అనుకున్నారు? కొత్త చుట్టాలు, కొత్త కొత్త బంధువులు, మిత్రులు, ఇలా అనేక రూపాలలో వచ్చి శబ్దాలు చేయడం ప్రారంభిస్తుంది. ఆమె ఉన్నంతవఱకు, శబ్దాల మయమే. ఇంకా దీనికి, ఆ ఇంట్లో ఎవరికైనా అధికారం వచ్చి, అదికూడా తోడైతే, ఇంక చెప్పేదేముంటుంది?
అలా లక్ష్మీదేవి సత్యధర్మాలు లేనిచోట, అబద్ధాలు రాజ్యమేలే చోట, ముఖస్తుతి చేసేవారి దగ్గర, స్వార్ధపరులు, అవినీతి పరుల దగ్గర, సంచిత కర్మ ఫలం పూర్తయ్యే వఱకు ఉంటుంది. తిరిగి వారిలో స్వార్ధం, అన్యాయం, అధర్మం పెరిగి, ప్రారబ్దంలో కూడా అలాగే ఉండి, ధర్మ కార్యాలు వదిలి, అధర్మ కార్యాలు చేపడతాడో, అక్కడ నుంచి మెల మెల్లగా, చల్లగా కరిమ్రింగిన వెలగపండు లోని గుజ్జు లాగా వెళ్లిపోతుంది.
ఆమె వెళ్ళిపోయిన మరుక్షణం, వైభవ చిహ్నాలన్నీ మటుమాయమై, కేవలం ఏడుపు ముఖాలు మాత్రమే మిగులుతాయి. డబ్బున్నప్పుడు, పొగరుతో ఇతరులను అనవసరంగా దూషించి, వారిపై అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేసినందువల్ల, పలకరించేవారే లేకుండా పతనమైపోతారు.
ఒక్కోసారి ధనలక్ష్మి ఉన్నా, ఆరోగ్య లక్ష్మి దగ్గర లేకుంటే, అంతా వృథా. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ, మొన్న మరణించిన తమిళనాడు ముఖ్యమంత్రి, జయలలిత.
అందుచేత, అష్టలక్ష్ములూ నివాసముండు లాగా జీవనం సాగించాలి. అయితే, ఆనంద లక్ష్మి దయ కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.
ఉన్నదాంట్లో అనుభవించి, తృప్తి చెంది ఇతరులను కూడా, ఆనందింపజేయాలి. మానవ జన్మ సార్ధకత ఇందులోనే ఉంది.
మనకు కలిగిన దానిలో, దానం చేయాలి. చేయగల చోట చేతిని వెనక్కి తీయకూడదు. పోయేటప్పుడు మనతో ఏమీ రాదు.ఎదుటి వారికి మాట సహాయం చేసైనా ఆనందం ఇవ్వగలిగితే, మన జీవితం ధన్యమవుతుంది.
ఇవ్వడంలో ఉన్న ఆనందం మనం అనుభవిస్తే కాని తెలియదు, ఆనంద లక్ష్మిని మన దగ్గరే ఉండమని అభ్యర్థిద్దాం, అనుభవిద్దాం, సంతృప్తితో జీవిద్దాం