*దొంగోడి బుద్ది*కథ

*దొంగోడి బుద్ది*కథ
******************
పునఃకథనం: పుల్లారామాంజనేయులు
*********************
సిరిపురంలో గోవిందుడు అనే యువకుడు చిన్నప్పటినుండే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఎవరికీ పట్టుబడకుండా ఎంతో ఉపాయంగా దొంగతనాలు చేసేవాడు. వాడిని పట్టుకోవడానికి ఎంతో మంది కృషిచేసినా లాభం లేకపోయింది. ఈ విషయం ఆనోటా ఈనోటా  రాజు గారికి తెలిసింది.

రాజు రంగనాధుడు దయా హృదయుడు. ఇలాంటి వారిని ఎంతో మందిని మంచి వారిగా తయారు చేశారు. రాజు గారికి వీడి విషయం తెలిసిన మరునాడే వాడిని పట్టుకు రమ్మని భటులను పంపాడు. భటులను పంపుతున్న విషయాన్ని ముందుగానే ఆ ఊరి జనాలకు, గోవిందుడికీ తెలిసేవిధంగా చేశాడు.
భటులు ఊళ్ళోకి వచ్చారన్న విషయం విని గోవిందుడు పారిపోసాగాడు.   రాజభటులు గోవిందుడిని చందుగిరి అడవుల్లోకి వెళ్ళేట్లు తరిమి కొట్టారు. "ఆడవిని జాగురుకతగా దాటితే నందపురం చేరుకోవచ్చు" అనుకుంటూ వడివడిగా నడవసాగాడు గోవిందుడు.
సాయంకాలం అయింది. చీకటి ముసురుకుంది. అలిసిన గోవిందుడు రాతిరికి విరామం తీసుకోవడం కోసం ఎత్తైన చెట్టుని ఎక్కబోతుండగా "ఎవరురా నువ్వు?! ఎందుకు, నా చెట్టును ఎక్కుతున్నావు?" అన్న మాటలు వినిపించి భయంగా కిందకు చూశాడు. చెట్టు కింద ఒక భయంకరాకారుడు నిలబడి ఉన్నాడు.
భయం వల్ల గోవిందుడికి నోట మాట రాలేదు. "భయపడకు. చెట్టు దిగిరా! నేను నిన్నేమీ చేయను" అన్నాడా భయంకరాకారుడు.
గోవిందుడు చెట్టు దిగి వచ్చాడు.

"ఎవరు నువ్వు? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు?" అడిగాడు ఆ భయంకరాకారుడు.
"నేను ఒక దొంగను. రాజ భటులు నన్ను ఈ అడవిలోకి తరిమారు" అన్నాడు గోవిందుడు వణికిపోతూ.

"భయపడకు. నేను ఒక రాక్షసుడిని. ఎప్పుడూ ఇక్కడే తిరుగుతుంటాను. ఈ చెట్టు నా నివాసం.  కొంత కొంత ధనం తీసుకొని పోయి. దొంగతనాలు మానేసి యాపారం చేసుకుని బతుకుతావా?" అని అడిగాడు భయంకరాకారం.
"ఇప్పటికే సగం చచ్చి ఉన్నాను. ఇక దొంగతనాలు చేయను. నువ్వు చెప్పిన విధంగా యాపారం చేసుకుని బతుకుతాను" అన్నాడు గోవిందుడు సంతోషంగా.

భయంకరాకారుడు ఆ చెట్టు తొర్రలోంచి పెద్ద డబ్బు మూట తీసాడు. అందులోంచి కొంత డబ్బుని తీసి గోవిందుడి చేతిలో పెడుతూ "చెట్టెక్కి పడుకుని రేపు ఉదయాన్నే ఇక్కడి నుండి వెళ్ళు" అని మిగిలిన డబ్బు మూటను తిరిగి తొర్రలో ఉంచి, చీకటిలోకి దూకి మాయమయ్యాడు.
భయంకరాకారం తన చేతికి ఇచ్చిన డబ్బు అంత సంతోష పెట్టలేదు గానీ; అతను తిరిగి తొర్రలో పెట్టిన డబ్బు మూటను చూడగానే మటుకు గోవిందుడి కళ్ళు మెరిశాయి. 'మొత్తం డబ్బునీ ఎలా కాజేయాలా' అని అలోచనలతో రాతిరంతా గడిపాడు వాడు. ఉదయాన్నే లేచి 'ఆ తొర్రలో డబ్బు మూట ఉందా లేదా' అని చూడాలనుకున్నాడు; అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
అలా నందపురం చేరిన గోవిందుడు నేరుగా తనకు తెలిసిన ఓ మయలోడు దగ్గరికి వెళ్ళాడు. తనకు రాక్షసుడు ఇచ్చిన డబ్బునే ఎరవేసి, ఆ రాక్షసుడిని ఆ అడవిలోంచి పంపమని ఒప్పందం చేసుకున్నాడు. ఆ మాయలోడిని తను అంతకు ముందు పడుకున్న చెట్టు వద్దకు తీసుకు వచ్చాడు. మాయలోడు చాలాసేపు ఏవేవో చదివి; 'రాక్షసుడిని పంపానురా! వాడు ఇక నిన్ను పీడించడు" అని చెప్పి డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయాడు.
మాయలోడు అటు వెళ్ళగానే ఇటు తొర్రలో చేయి పెట్టి డబ్బు మూటను బయటకు తీశాడు గోవిందుడు. సంతోషంతో పరుగు పరుగున ఇంటికి చేరి మూట విప్పాడు. మూటలో నుండి తేళ్ళు, బయటపడి ఇల్లంతా పాకటం మొదలు పెట్టాయి! భయంతో అరుచుకుంటూ ఇంటి బయటకు పరిగెత్తిన గోవిందుడిని వాకిటిలోనే నిలబడి ఉన్న భటులు బంధించి రాజు గారి దగ్గరకు తీసుకువెళ్ళారు.

అప్పటికే చచ్చిన గోవిందుడు రాజు గారి కాళ్ళపైన పడి 'రాక్షసుడిని కూడా మోసం చేశాన'ని ఒప్పుకున్నాడు. వాడు  మారిపోయాడని తెలుసుకున్న రాజుగారు "యాపారం చేసుకుంటానని డబ్బు తీసుకున్నావు; కానీ డబ్బు మూటను చూడగానే నీ పాత అలవాటుని మానుకోలేకపోయావు. నీకు తెలివి తీసుకురావాలనే నా మనిషిని రాక్షసుడిలా నటించేట్టూ చేశాను. ఇకనైనా ఆ పాడు బుద్ధిని మానుకుని యాపారం చేసుకో" అంటూ కొంత డబ్బుని వాడి చేతిలో ఉంచాడు.
సిగ్గుతోటీ తల దించుకున్నాడు గోవిందుడు. అటుపైన ఉన్న ఊళ్ళోనే అంగడి పెట్టుకుని మంచి పేరు సంపాదించుకున్నాడు అతను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది