చూసి నేర్చుకుందాం!
‘కశ్చితర్థం వినిశ్శిత్య
లఘుమూలం మహోదయమ్
క్షిప్రమారభసేకర్మ
న దీర్ఘయసి రాఘవ’
ఈ పద్యానికి అర్థం ఇది. ‘‘ముందు డబ్బుందో, లేదో చూసుకోవాలి. ఎవరినో మభ్యపెట్టడానికో, సంతోషపెట్టడానికో పని చేయకూడదు. వాస్తవంగా రూపుదాల్చడానికి సరిపడే డబ్బుందా, లేదా చూసుకోవాలి. తరువాత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించేలా ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడు పని వెంటనే మొదలుపెట్టాలి. మొదలుపెట్టిన పనిని దీర్ఘకాలం కొనసాగించాలి’’.
విజయానికి రెండే మార్గాలు. ఒకటి- కష్టపడటం, రెండోది - మనసు నిష్కల్మషంగా ఉండటం. శారీరకంగా కష్టపడాలి. మనసు నిష్కల్మషంగా ఉండాలి. అందులో భగవంతునికి తప్ప మరొకరికి స్థానం ఉండకూడదు. స్వార్థం ప్రవేశించకూడదు. ‘దీంతో నాకేమి లాభం?’ అన్న స్వార్థం పోయినపుడే ఈ దేశం బాగుపడుతుంది. శ్రద్ధగా పునర్నిర్మాణం చేయడం, ఒక జాతి తనకు తాను పునర్నిర్మాణం చేసుకోవడం ఎలాగో ఇజ్రాయిల్ దేశాన్ని చూసి నేర్చుకోవాలి.
‘వ్రాలిరి సాహసంబున అరబ్బుల మధ్యన యూదు వారు
నాజీల దురాగంతబులకు చీలక జాతి పునర్విధాతలై
గాలియు, నీరు స్వచ్ఛమనగా లభియించని బీడు నేలనన్
రాళ్లను తీర్చిదిద్దిరట రత్నములట్లు రహస్యమేమిటో!’
విజయగాథ అంటే ఇజ్రాయిల్ వారిదే! శత్రువుల మధ్యలో ఉన్నారు. చుట్టూ అరబ్బులే. వీళ్లు క్రైస్తవులు. ఇజ్రాయిల్ ప్రజలకు ఎంత చిత్తశుద్ధి అంటే మొండిగా, బండగా కృషి చేశారు. ఎన్ని సమస్యలొచ్చినా ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో చాలా కటువుగా వ్యవహరించారు. మెత్తబడలేదు. మంచివాళ్లుగా ఉండొచ్చు. మెత్తగా ఉండకూడదు. ఇజ్రాయిల్ దేశస్థులు, అక్కడి ప్రభుత్వం కఠినంగా ఉన్నారు. వాళ్ల దేశంలోకి ప్రవేశించడానికి ఒక్క ఉగ్రవాదికి కూడా అవకాశం ఇవ్వలేదు. అందుకే నిలబడ్డారు! మన రాష్ట్రంలో ఒక జిల్లా విస్తీర్ణంలో ఉంటుందా దేశం. అది శక్తిమంతమైన దేశంగా నిలబడిందీ అంటే ఆ దేశాన్ని చూసి మనం నేర్చుకోవద్దా! రెండో ప్రపంచయుద్ధంలో వారికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ యూదుల మీద నాజీల దౌర్జన్యం తెలియంది కాదు. యూదులు కనబడితే చాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించే వారు. అలాంటి బాధలన్నింటిని తట్టుకుని జాతిని పునర్నిర్మాణం చేసుకున్నారంటే ఎంత గొప్పవారండీ ఇజ్రాయిలీలు.
‘నీళ్లకు నోచనట్టి దయనీయ పరిస్థితి బట్టి
నేరుగా వేళ్లకు నీళ్లనిచ్చెడి వివేకము
నీటిని మూటగట్టి పందిళ్లనమర్చె పంటలకు
నిండిన కుక్షి రవంత పంట నాలుగిళ్లకు పంచిపెట్టెను
ఫలింపవె సత్‌కృషి చిత్తశుద్ధియున్’
అక్కడ నీళ్లు లేవు, నదులు లేవు. వర్షాలు పడవు. ఉన్న నీటిని పొదుపుగా వాడాలి. అందుకోసం నీరు నేరుగా మొక్క వేరుకు అందితే చాలు కదా అని ఆలోచించారు. దాన్నే ‘బిందు సేద్యం’ అన్నారు. మనం నేర్చుకున్నదీ అక్కడి నుంచే! వాళ్లు పంటకు పందిరేసి రక్షించారు. వాళ్ల కడుపు నిండిన తరువాత పండిన పంటను నలుగురికీ పంచారు. అనేక రకాల పంటలను ఎగుమతి చేస్తున్న దేశాల్లో ప్రథమ స్థానాల్లో ఉంది ఇజ్రాయిల్. వాళ్లకు చిత్తశుద్ధి ఉంది. ఇంట్లో అందరూ కష్టపడతారు. మన దగ్గర ఒక్కరు కష్టపడితే నలుగురు కూర్చొని తింటారు. ఇజ్రాయిల్ దేశంలో నీరు వృథా చేస్తే ప్రభుత్వ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి.
‘చుక్కనీరు పోవ క్షోభింతురక్కడ
ఇక్కడబ్ధులైన లెక్కలేదు
ఔనులెండు! మీరు అంగారక గ్రహమందు
నీరు తెచ్చుకుందురేమో!’
కుళాయిలో నుంచి నీరు పడుతుందీ అంటే ఒక్క చుక్క నీరు కూడా వృఽథా పోకుండా చూసుకోవాలి. నీరు వృథా అయిందీ అంటే మనం అసమర్థులం కింద లెక్క. నీటిని ఒడిసిపట్టి తాగాలి. ఒక్క బియ్యం గింజ నేల రాలినా నష్టం కింద భావించాలి. ఇళ్లలో నీటిని పొదుపుగా వాడకపోతే దేశానికి ద్రోహం చేసినట్టుగా భావించాలి. అప్పుడు మనం ప్రతి వస్తువునూ జాగ్రత్తగా చూసుకుంటాం.