🔲Q : రిమోట్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది ?, Remote Controle Working-How?
జవాబు: టీవీలు, టేప్‌రికార్డర్లు, సీడీ ప్లేయర్లను మాత్రమే కాకుండా, కారు డోర్లను కూడా మనం కూర్చున్న చోట్లనుంచే కదలకుండా పని చేయించకలిగే సాధనమే 'రిమోట్ కంట్రోల్'. ఈ సాధనంలో వివిధ పనులు చేయడానికి కొన్ని బటన్లు ఉంటాయి. ఆ బటన్ నొక్కగానే అది చేయవలసిన పని పరారుణ కిరణాలుగా సంకేత రూపంలోకి మారుతుంది. ఆ కిరణాలు టీవీకి అమర్చిన బటన్లు అందుకుంటాయి. అప్పుడు ఆ బటన్ పనిచేసి మనం అనుకున్న మార్పులు జరుగుతాయి.
రిమోట్ కంట్రోల్ లోపల వెనుక భాగంలో ఒక విద్యుత్ వలయం, పలక (ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు), బ్యాటరీ కనెక్షన్ ఉంటాయి. అక్కడ ఒక సమగ్రమైన వలయం (సర్క్యూట్) ఉంటుంది. దీనిని 'చిప్' అంటారు. చిప్‌కు కుడివైపున నలుపు రంగులో 'డయోడ్' (ట్రాన్సిస్టర్) ఉంటుంది. పసుపు రంగులో రెజోనేటర్, ఆకుపచ్చ రంగులో రెండు 'విద్యుత్ నిరోధకాలు', ముదురు నీలం రంగులో 'కెపాసిటర్' ఉంటాయి. బ్యాటరీలకు కలిపి ఆకుపచ్చరంగులో ఒక విద్యుత్ నిరోధకం, బ్రౌన్ రంగులో ఒక కెపాసిటర్ కూడా ఉంటాయి.
రిమోట్ కంట్రోల్ బటన్‌ను మనం నొక్కగానే ఆ విషయాన్ని 'చిప్' కనిపెడుతుంది. వెంటనే మనం నొక్కిన బటన్ ఏం కావాలనుకుంటుందో ఆ సూచనను మోర్స్‌కోడ్‌లాంటి సంకేతాలుగా మారుస్తుంది. ఒక్కొక్క బటన్‌కు వేర్వేరు సంకేతాలుంటాయి. చిప్ ఆ సంకేతాలను ట్రాన్సిస్టర్‌కు పంపిస్తుంది. ట్రాన్సిస్టర్ ఆ సంకేతాలను అర్థం చేసుకుని విడమరిచి దృఢ పరుస్తుంది. ఈ సంకేతాలు టీవీకి ఎదురుగా ఉండే రిమోట్ కంట్రోల్ చివరిభాగంలో ఉండే ఒక చిన్న బల్బు రూపంలో ఉన్న 'లైట్ ఎమిటింగ్ డయోడ్'ను చేరుకుంటాయి.
ఈ డయోడ్ సంకేతాలను పరారుణ కాంతికిరణాలుగా మారుస్తుంది. ఈ కిరణాలు మన కంటికి కనబడవు. కానీ టీవీలో ఉండే గ్రాహకం వీటిని గ్రహిస్తుంది. ఈ కిరణాలు తెచ్చిన సంకేతాలను టీవీ వలయానికి అందిస్తుంది. సంకేతాలకు అనుగుణంగా టీవీ వలయం మార్పుచెంది మనం రిమోట్ కంట్రోల్‌తో చేయాలనుకున్న మార్పు టీవీలో కనిపిస్తుంది.