ధనుర్యాగ సంకల్పం, అక్రూరుని ఆగమనం-శ్రీ విష్ణు పురాణము
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Part 12
పూతన మొదలు వరుసగా శకటాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు వృషభాసరుడు చంపబడటం, కృష్ణునిచేత కాళీయుడు అణచబడటం - గోవర్థనగిరి ఎత్తబడటం ఆదిగాగల కృష్ణ బలరాముల ఉదంతాలన్నీ నారద మహర్షి చెప్పగా విన్నాడు కంసుడు. బాలురలో ఇంతటి బలశాలులు అరుదని, వారియందు దైవీశక్తులు ఆవహించి ఉంటే తప్ప ఇవేవీ సాధ్యంకాదని అర్థమైంది కంసుడికి. వసుదేవుడ్ని గర్హించాడు. యాదవుల మీద పగపట్టాడు. బలరామకృష్ణులు ఇంకా పెద్ద వారయ్యేలోగానే వారిని సంహరించ తలపెట్టాడు.
కంసుని దగ్గర చాణూర - ముష్టికులు అనే మహావీరయోధులు, గొప్ప మల్లవిద్యానిపుణులు ఇద్దరున్నారు. వీరిద్దరిచేత ఆ ఇద్దరు బాలకులను కడతేర్చాలని కంసుని పన్నాగం.
ధనుర్యాగోత్సవ నెపంతో వారిద్దరినీ వ్రజమునుండి బయటకు రప్పించాలని ఆ దుర్మతి ఊహ. యదుశ్రేష్టుడైన అక్రూరుని పంపి, వాళ్లను తన రాజధానికి రప్పించాలనుకున్నాడు. ఈలోగ కంసుని మదిలో ఇంకొక ఊహ కలిగింది. బృందావనంలోనే కేశి రాక్షసుని చేతనే బలరామకృష్ణులను మట్టుబెట్టాలని ఆలోచించాడు. ఇవన్నీ విఫలమైనా తనవద్ద గల మదగజం 'కువలయాపీడం' ఉండనే వున్నది.
ఇలా భావించుకున్న కంసుడు, అకౄరుని రప్పించి - విష్ణ్వాంశతో జనించి, గోకులంలో పెరుగుతూన్న బలరామకృష్ణుల సంగతి వివరించి, తన ఊహ కూడా చెప్పి, ఈ చతుర్దశి నాటికి వారిద్దరూ ఇక్కడికొచ్చేలా చూడమన్నాడు.
కేశివథ
కేశి అనే పేరు గల దుష్ట రాక్షసుడొకడు మహాబలవంతుడు. అశ్వరూపుడు. కంసుని దూత ప్రేరేపణ వల్ల కృష్ణుని చంపాలని బృందావనంలో తగిన సమయం కోసం (వచ్చి) వేచి ఉన్నాడు. ఒకసారి అందుకు పరిస్థితి సహకరించగా, మబ్బులు ఎత్తుకు ఎగిరి గోపకుల మీదకు దూకాడు. గోప గోపీ బృందం శ్రీకృష్ణుని శరణువేడుకున్నారు. కృష్ణుడు వారందరికీ ధైర్యం చెప్పి, ఆ అశ్వరూప రాక్షసుని ఎదుర్కొన్నాడు.
కృష్ణుడు నిర్భీతిగా వాజి / వాని నోటిలోనికి తనబాహువును పోనిచ్చి పళ్లురాలగొట్టాడు. క్రమక్రమంగా ఆ భుజాన్ని గొంతు లోపలివరకు గ్రుచ్చి, ఆ నోరు మరింత పగిలేలా చేసే సరికి, వాడికి నవరంధ్రాల్లోంచి ఆ యాస్రావాలు బయల్వెడలి కిందపడి రెండుగా చీలిపోయాడు. నేల కూలుతూనే అశ్వరూపుడు, తన కామరూపాన్ని వదలి రాక్షసుడిగా మారి చచ్చిపడి అందరికీ ఆశ్చర్యం కల్గించాడు.
గోపాలురంతా శ్రీకృష్ణుని ప్రశంసిస్తూండగా, మబ్బుల వెనుక నుంచి నారదమహర్షి అక్కడకు వచ్చి "బాగున్నదయా నీ లీలా! నా హృదయమెంతో ఆనందంగా ఉంది. కేశి ని చంపినందున ఈ నాటి నుంచీ నీవు కేశవుడని పిలువబడతావు. నీకు మంగళమగుగాక"! అని పలికి, "నన్ను కలహోత్సకుడు అంటారు కదా! ఉగ్రసేనుని తనయుడైన కంసుడు తన పరివారంతో సహా కూల్చబడిన తర్వాత నీవు పృధ్వీభారాన్ని దింపగలవు. కనుక - కంసునితో పోరు నీకు తప్పదు. అప్పుడు మళ్ళీ నిన్ను కలుసుకుంటానులే" అని వెళ్ళిపోయాడు.
అక్రూరుని ఆగమనం
యాదవ ప్రముఖులలో శ్రేష్టుడు, సజ్జనుడు అక్రూరుడు. పేరుకు తగ్గట్లు సాధుస్వభావశీలి. మహా విష్ణుభక్తుడు. శ్రీకృష్ణుడు ఆ హరి అంశన అవతరించాడని విన్న దగ్గర్నుంచి ఎప్పుడెప్పుడా యదుభూషణుని చూద్దామా? అని ఉవ్విళ్లూరుతున్నాడతడు.
అయితే, కంసుడీ విధంగా చెప్పి రమ్మని తనను పంపేసరికి భగవానుడా జగన్నాథుడు. ఆయనకు తెలియనిదేమున్నది? తాను నిమిత్తమాత్రుడై ఈ కార్యం నిర్వర్తిస్తున్నాడంతే' అనుకుంటూనే, గోకులానికి ప్రయాణమయ్యాడు అక్రూరుడు.
అనతికాలంలోనే అతడు నంద వ్రజానికి చేరుకుని, హృదయం అంతటా శ్రీహరినే నిల్పుకుని, కంసునిచే చేరదీయబడినందున తాను దూషితుడి నవుతున్నానేమో అనే శంక మనస్సును బాధిస్తుండగా, కృష్ణదర్శనానికై తహతహలాడసాగాడు.
శ్రీకృష్ణునికి, అక్రూరుడొచ్చిన సంగతి తెలిసి, గాఢంగా కౌగలించుకుని, తమ సరసన విందారగింపజేసి వచ్చిన పని ఏమని అడగ్గా చెప్పడానికి నోరాడక అక్రూరుడు రెండు చేతులూ ఎత్తి నమస్కరించి "దేవా! ఆశ్రిత రక్షకుడవు! వరదుడవు! నన్నేల ఇరుకున పెడుదువు? నీకు తెలీని మానసమా నాది? నా హృదయమంతటా నిన్నే నింపుకున్న నేను, కంసవచనాల నెలా తెలుపను?" అని ఆర్ద్రంగా పలికేసరికి, కృష్ణ బలదేవులు అక్రూరుని తిరిగి సమాశ్వాసించి "తెలిసినదిలే! కానున్నది కాక మానదు. చింతిల్లకు. మనం రేపు మధురకు బయలుదేరుదాం! ఈ రాత్రికిక్కడ విశ్రమించు" అన్నారు.
నందగోవునింట ఆ ముగ్గురూ నిద్రించి, మర్నాడే ప్రయాణానికి గోపకులను ఆదేశించారు. అందరూ వేకువనే లేచి మధురకు వెళ్ళటానికి సన్నద్ధులైనారు.
గోపీజనం అది చూసి, కంట నీరు పెట్టి నిట్టూరుస్తు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు - "గోవిందుడు మధురానగరానికి వెళ్లాక ఇంకా ఈ గోకులము నందున్న మన ముఖం చూస్తాడా? అది అసలే రాజధాని. మధురానగరి నెరజాణల, విలాసినుల శృంగారం రుచిమరిగితే, ఈ పల్లెటూరి జనం కృష్ణుని కేమి రుచిస్తారు? ఓహోహో! ఆ పాడుదైవమేడనున్నాడో గాని, ఇంత జాలిమాలి ఈ గోపికలకెంత అపకారం చేశాడు?
అతడు అక్రూరుడా? కానేకాడు. కౄరుడు. లేకుంటే రథమెక్కి కృష్ణుని నేడు మదురకు తీసుకొని పోనేల? ఈ గోపీజనం ఈ నల్లనయ్యమీద మక్కువతో ఉన్నారని ఎరుగడా? ఈతడో పరమ నిర్దయుడు.
అదుగో - గోవింద బలరాములు రథం ఎక్కారు. వారిని ఆపడానికి త్వరపడండి! పెద్దలు అందరు ఉండగా, మనం చెప్పడానికెలా అని సంశయమా? విరహాగ్నిచేత కాల్చబడుతూన్న మనలను పెద్దలుమాత్రం ఏం చేయగలరు?
అదీగాక నందగోపుడు మొదలైనవారూ పయనమవుతున్నారే! ఒక్కరైనా గోవిందుని వారించవచ్చుకదా! ఆహా! ఈ రేయి మధురానగర భామినులకు సుప్రభాతమై తోచవచ్చును. వారి చూపులు ఆ పద్మనేత్రుని ఆకర్షించడం తథ్యం!
వారెంత మంచి స్వప్నాలు చూశారో? విరహంచేత ఆ గోపికలు రకరకాల భావాలు సందడి చేయగా, వారి ముంజేతి కంకణాలు కృశించిన హస్తాలవల్ల వదులు అవుతున్నాయి. అకౄరా! నిర్దయా! నీవు గుర్రాలను తోందరగా అదలించమంటూన్నావే! నీకిది తగునా?" అంటూ గోపికలు విరహాmదోశనలతో కుందుతూండగా, ధూళిరేపుకుంటూ సాగిన కృష్ణరథం కనుమరుగైంది.
వేగంగా పరుగెత్తే గుర్రాలు పూంచిన రథం మధ్యాహ్న సమయానికి యమునానదీతీరానికి చేర్చింది. అకౄరుడా కాళింది నదిలో మధ్యాహ్నిక సంధ్యను అనుష్టించి, స్నానం చేస్తూన్నా - సంధ్యవారుస్తూన్నా అన్నిచోట్లా బలరామకృష్ణుల అంశకు కారకుడైన ఆ శ్రీహరినే భావించి కృతకృత్యుడయ్యాడు. అదంతా ఒక స్వప్నంలా తోచిందా భక్త శిఖామణికి.
హృదయంలోనే శ్రీహరికి శతసహస్రస్తోత్రాలు చేసిన అకౄరుడు గంధర్వ, సిద్ధ, మహర్షి, నాగ దేవతాదులచే సంస్తుయమానుడైన హరిని మానసమందే దర్శించి, ఎదుటనున్న బలరామకృష్ణుల్లోనూ నారాయణుని సందర్శించి, తనకు జన్మసాఫల్యమైందని పొంగిపోయాడు.
సన్మాత్రరూపి, సర్వవ్యాపి, కార్యకారణరూపుడైన ఆ సర్వాత్మకునితోతాను పయనమై సాగగలుగుతూన్నందుకు మరింతగా ఆనందించాడు. పలువిధాల స్తోత్రం చేస్తూ, మానసిక పూజ చేశాడు. తిరిగి తమ రథం దగ్గరకు రాగా, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు....
"యమునా తీర్థంలో ఏదో వింత చూశావు కదా! నీవు ఆశ్చర్యపోతూన్నట్లున్నావు. ఎంత దాచాలనుకున్నా నీవు దాయలేవు. నీ ముఖవికాసమే చెప్తోంది" అన్నాడు నవ్వుతూ.
"స్వామీ! నీవన్నది నిజం! అక్కడ నీటిలో నేను ఏమిచుశానో, అది స్వప్నమనుకున్నాను. కాని అది నిజమే అని ఇప్పుడు తోస్తున్నది. నీ మాటతో అది మరింత బలపడిందిలే! నే నే విచిత్రం చూశానో అదే ఇక్కడ రూపం కట్టి కనిపిస్తున్నది. కృష్ణా! ఈ విశ్వం ఏ రూపుదాల్చి, ఇలా భాసిస్తున్నదో ఆ పరబ్రహ్మము - పరమాత్మనే నేనిపుడు చూస్తున్నాను.
ఆ సంగతికేం గాని, మనం ఇప్పుడు త్వరితంగా మధురకు వెళ్ళాలి. నేను ఆ కంసునికి భయపడుతున్నాను. నా వంటి పరపిండోపజీవుల బతుకు తుచ్ఛముకదా" అంటూ వాయువేగాన గుర్రాలను తిరిగి అదలించాడు. తొలి ప్రొద్దు గుంకేవేళకు రథం మధురకు చేరింది.
ఆ బలరామకృష్ణులను పాదచారులుగా (నడచి) రమ్మని, వసుదేవునింటికి వెళ్లవద్దని, అలాచేస్తే వీరికారణంగా కంసుడు నిర్దయతో ఆ వృద్ధుని గెంటేస్తాడనీ హెచ్చరించి, రథంతో సాగిపోయాడు అక్రూరుడు.
రాజధానిలో నడుస్తున్నారు బలరామకృష్ణులు....